న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో జస్టిస్ లోధా సంస్కరణల అమలుపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాల్లో మరో కుదుపు. బీసీసీఐ నియమావళి ప్రకారం పదవీ కాలం పూర్తయినందున ప్రస్తుత ఆఫీస్ బేరర్లు తప్పుకోవాలని, కొత్త రాజ్యాంగం అమలుకు ముందే లోధా సిఫార్సుల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని అపెక్స్ కోర్టును సీవోఏ కోరింది.
ఈ మేరకు సీవోఏ సభ్యులు వినోద్‌రాయ్, డయానా ఎడుల్జీ గురువారం తమ ఎనిమిదో స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. మార్చి 1వ తేదీతోనే పదవీ కాలం పూర్తయిన తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలను తొలగించి, కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఇందులో కోరారు. అయితే... దీనిని వీరు ముగ్గురూ ప్రతిఘటించనున్నట్లు తెలుస్తోంది. విధాన నిర్ణయాలపై చర్చించే సర్వసభ్య సమావేశం నిర్వహణకు వినోద్ రాయ్ కమిటీ సరైన ప్రొటొకాల్ పాటించ లేదనేది ఖన్నా బృందం వాదనగా ఉంది.
కాంట్రాక్టులపై అమితాబ్ అసంతృప్తి...
26 మంది క్రికెటర్లకు బుధవారం సీఓఏ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల వ్యవహారం చిక్కుల్లో పడనుంది. ఈ విషయంలో తనతో సహా బీసీసీఐలోని ముగ్గురు ప్రధాన అధికారులను సంప్రదించకుండా సీఓఏ నిబంధనలను అతిక్రమించిందంటూ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి కోర్టు జోక్యాన్ని కోరనున్నారు. కాంట్రాక్టు జాబితాను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ రూపొందించిందని, వాస్తవానికి వారికి ఆ అర్హత లేదని జాతీయ సెలెక్షన్ కమిటీ కన్వీనర్ అమితాబ్ అంటున్నారు. అయితే... కొత్త కాంట్రాక్టు స్వరూపంపై గతేడాది సెప్టెంబర్ లోనే బీసీసీఐ ఫైనాన్స్ అధ్యక్షుడు జ్యోతిరాదిత్య సింధియా, కోశాధికారి అనిరుధ్ చౌదరిలకు సమాచారం ఇచ్చామని వారి నుంచి ప్రతిస్పందన రాలేదని రాయ్ అంటున్నారు. కానీ దీనికి ఆధారాలు లేవని బీసీసీఐ అధికారి ఒకరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment