Amitabh Chaudhary
-
ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు
ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి. యూపీఐ సేవలకూ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు.. ఫ్రీచార్జ్ అనే పేమెంట్స్ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!
ముంబై: ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో జరీన్ దారువాలా ఈ కేసు విచారణకు ఇప్పటిదాకా హాజరుకాకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీగా విభ పదాల్కర్
ముంబై: హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా విభ పదాల్కర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 8న అమితాబ్ చౌదరి ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విభ పదాల్కర్ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బుధవారం విధులు చేపట్టిన ఆమె పదవీకాలం మూడేళ్లు ఉంటుందని వెల్లడించింది -
యాక్సిస్ బ్యాంక్‌కు కొత్త సీఈవో..
ముంబై : యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో కొత్త సీఈవో, ఎండీ దొరికేశారు. యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవో, ఎండీగా అమితాబ్ చౌదరిని మూడేళ్ల పాటు నియమిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసిన ఫైలింగ్ ఈ విషయాన్ని బ్యాంక్ వెల్లడించింది. ‘నేడు జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్‌లో 2019 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అంటే మూడేళ్ల పాటు అమితాబ్ చౌదరిని యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమించాలని నిర్ణయించాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఆమోదం తెలిపింది’ అని బ్యాంక్ తెలిపింది. ఈ నియామకం, రెమ్యునరేషన్ నియమ, నిబంధనల ప్రకారం ఉంటుందని పేర్కొంది. అమితాబ్ చౌదరి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో పనిచేస్తున్నారు. 2010లో ఆయన హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో చేరారు. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరువలో దేశంలో అత్యంత విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉంది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌కు సీఈవో, ఎండీగా ఉన్న శిఖా శర్మ పదవి కాలం ఈ ఏడాది చివరి నాటికి ముగియనుంది. ఈ పోస్టు కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను బ్యాంక్, ఆర్బీఐ వద్దకు పంపింది. వారిలో అమితాబ్ చౌదరిని ఈ పదవి వరించింది. చౌదరి బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో చేరకముందు ఇన్ఫోసిస్ బీపీవో పనిచేశారు. 1987లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆసియాకు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్, హోల్‌సేల్ బ్యాంకింగ్‌కు, గ్లోబల్ మార్కెట్లకు రీజనల్ ఫైనాన్స్ హెడ్‌గా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా పదవులు చేపట్టారు. -
ప్లీజ్.. కోహ్లిని తిట్టొద్దు
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని తప్పుగా అర్థం చేసుకోవద్దని బీసీసీఐ తాత్కలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి అభిమానులను కోరారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లి అందుబాటులో ఉండకుండా ఇంగ్లండ్ కౌంటీలకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల కోహ్లిపై విమర్శలు గుప్పించారు. చారిత్రాత్మకమైన అఫ్గాన్ టెస్టుకు కోహ్లి దూరం కావడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అమితాబ్ చౌదరి కోహ్లిని తిట్టవద్దని కోరారు. అఫ్గాన్ టెస్టుకు దూరం కావడంలో కోహ్లికి వేరే ఉద్దేశం లేదని, ఇంగ్లండ్ పరిస్థితులను తెలుసుకోవడం కోసమే అతను అక్కడికి వెళ్తున్నాడని స్పష్టం చేశాడు. దయచేసి అభిమానులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘అఫ్గానిస్తాన్‌తో ఆడకూడదన్న ఉద్దేశం కోహ్లికి లేదు. ఇంగ్లండ్ గడ్డపై రాణించి అభిమానులను సంతృప్తిపరచాలనే అతను కౌంటీ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపాడు. ఇందులో భాగంగానే కొంతమంది ఆటగాళ్లు అక్కడికి ముందుగానే పంపించాం. టెస్టు క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టే ఇలా చేస్తున్నాం. పరమిత ఓవర్ల క్రికెట్ కోసం అయితే కాదు‘’ అని అమితాబ్ చౌదరి తెలిపారు. మరెందుకు ఓపెనర్లను కౌంటీ క్రికెట్ ఆడేందుకు పంపించలేదు అన్న ప్రశ్నకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ సమాధానమిచ్చారు. విరాట్‌కు మాత్రమే అవకాశం వచ్చిందని, ఇతరులకు వచ్చిందో రాలేదో తెలియదన్నారు. వారి కూడా అవకాశం వస్తే సంతోషంగా పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఆఫీస్ బేరర్ల ఉద్వాసనకు సీఓఏ నివేదిక
న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో జస్టిస్ లోధా సంస్కరణల అమలుపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాల్లో మరో కుదుపు. బీసీసీఐ నియమావళి ప్రకారం పదవీ కాలం పూర్తయినందున ప్రస్తుత ఆఫీస్ బేరర్లు తప్పుకోవాలని, కొత్త రాజ్యాంగం అమలుకు ముందే లోధా సిఫార్సుల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని అపెక్స్ కోర్టును సీవోఏ కోరింది. ఈ మేరకు సీవోఏ సభ్యులు వినోద్‌రాయ్, డయానా ఎడుల్జీ గురువారం తమ ఎనిమిదో స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. మార్చి 1వ తేదీతోనే పదవీ కాలం పూర్తయిన తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలను తొలగించి, కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఇందులో కోరారు. అయితే... దీనిని వీరు ముగ్గురూ ప్రతిఘటించనున్నట్లు తెలుస్తోంది. విధాన నిర్ణయాలపై చర్చించే సర్వసభ్య సమావేశం నిర్వహణకు వినోద్ రాయ్ కమిటీ సరైన ప్రొటొకాల్ పాటించ లేదనేది ఖన్నా బృందం వాదనగా ఉంది. కాంట్రాక్టులపై అమితాబ్ అసంతృప్తి... 26 మంది క్రికెటర్లకు బుధవారం సీఓఏ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల వ్యవహారం చిక్కుల్లో పడనుంది. ఈ విషయంలో తనతో సహా బీసీసీఐలోని ముగ్గురు ప్రధాన అధికారులను సంప్రదించకుండా సీఓఏ నిబంధనలను అతిక్రమించిందంటూ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి కోర్టు జోక్యాన్ని కోరనున్నారు. కాంట్రాక్టు జాబితాను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ రూపొందించిందని, వాస్తవానికి వారికి ఆ అర్హత లేదని జాతీయ సెలెక్షన్ కమిటీ కన్వీనర్ అమితాబ్ అంటున్నారు. అయితే... కొత్త కాంట్రాక్టు స్వరూపంపై గతేడాది సెప్టెంబర్ లోనే బీసీసీఐ ఫైనాన్స్ అధ్యక్షుడు జ్యోతిరాదిత్య సింధియా, కోశాధికారి అనిరుధ్ చౌదరిలకు సమాచారం ఇచ్చామని వారి నుంచి ప్రతిస్పందన రాలేదని రాయ్ అంటున్నారు. కానీ దీనికి ఆధారాలు లేవని బీసీసీఐ అధికారి ఒకరు చెబుతున్నారు. -
అఫ్ఘనిస్తాన్ తొలి టెస్ట్ భారత్‌తోనే
న్యూఢిల్లీ : క్రికెట్లో కూన దేశమైన అప్ఘనిస్తాన్ తన చారిత్రాత్మక తొలి టెస్టును భారత్‌తో ఆడనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు భారతే ఆతిథ్యం ఇవ్వనుందని, షెడ్యూల్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ తాత్కలిక సెక్రటరీ అమితాబ్ చౌదరీ తెలిపారు. సోమవారం జరిగిన బీసీసీఐ అధికారుల ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక 2019-2023 ఎఫ్టీపీ( ప్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్) ప్రకారం మూడు ఫార్మట్లలో కలిపి భారత్‌లో 81 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. నిజానికి అఫ్ఘనిస్తాన్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 2019లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉందని, కానీ భారత్-అఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మక సంబంధాల నేపథ్యంలో తొలి టెస్ట్ మ్యాచ్ భారత్‌తో ఆడేట్లు నిర్ణయం తీసుకున్నామని అమితాబ్ చౌదరీ తెలిపారు. అలాగే వచ్చే ఎఫ్టీపీ సైకిల్లో భారత్‌లో పెద్ద జట్లైన ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు పర్యటిస్తాయన్నారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌పై నిషేదం ఎత్తివేసినట్లు ప్రకటించారు. అలాగే జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ( నాడా) పరిధిలోకి రావాలని కూడా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. -
అవన్నీ పుకార్లే!
బర్మింగ్‌హామ్: భారత క్రికెట్లో సంచలనంగా మారిన కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య వివాదాన్ని బీసీసీఐ మాత్రం తేలిగ్గా తీసుకుంది. బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ పెద్ద పుకార్లు’ అంటూ కొట్టిపారేశారు. తనకు అసలు ఈ విషయం గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. ‘ఇద్దరికీ పడటం లేదంటూ వచ్చిన కథనాలన్నీ ఊహాజనితం. ఏదేదో ఊహించుకొని రాయడం తప్ప వాటికి ఎలాంటి విలువ లేదు. నిప్పు లేదని పొగ రాదని కొందరంటున్నారు. కానీ అసలు పొగే లేదని నేను నమ్ముతున్నాను’ అని చౌదరి వ్యాఖ్యానించారు. కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించడంలో తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు. ‘దీనిపై ఇప్పటికే స్పష్టతనిచ్చాం. కోచ్ ఎంపిక అనేది ఒక ప్రక్రియ. అంతా పారదర్శకంగా, సరిగ్గా జరిగేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి అప్లికేషన్లు కోరడంలో సమస్య లేదు’ అని అమితాబ్ చెప్పారు. భారత్ వరుసగా సిరీస్‌లు ఆడుతుండటం వల్ల విరామం లభించడం లేదని, అందుకే ఒక వైపు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగానే కోచ్ కోసం ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మరోవైపు గురువారం ఎడ్జ్‌బాస్టన్ మైదానం లో సాధన చేసిన భారత్ తమకు కల్పించిన ప్రాక్టీస్ సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు!
-
కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు!
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కీలకమైన పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో నెలకొన్న విభేదాలపై బీసీసీఐలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంట్లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం ఎంవీ శ్రీధర్‌ను నియమించారు. వీరు బర్మింగ్‌హామ్‌లో ఇద్దరితో విడివిడిగా సమావేశమై విభేదాలను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ఈనెల 4న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ అనంతరం బీసీసీఐ ప్రారంభించనుంది. మే 31తో అభ్యర్థుల దరఖాస్తుల గడువు ముగిసింది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆలోపునే జట్టు కోచ్ ఎవరనేది తేలిపోతుందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ పదవి కోసం ఇప్పటిదాకా ఎవరెవరు ముందుకు వచ్చారనే విషయం బోర్డు చెప్పడం లేదు. టామ్ మూడీ పేరు బాగానే ప్రచారం అవుతున్నా బోర్డు నుంచి మాత్రం స్పందన లేదు. దరఖాస్తులన్నింటిని బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి లండన్‌లో ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులకు అందించనున్నారు. ‘ఇంటర్వూ్యలన్నీ ఇంగ్లండ్‌లోనే జరపాలా? లేదా? అనే విషయం సీఏసీ నిర్ణయిస్తుంది. ఇది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. కుంబ్లే కూడా మరోసారి కమిటీ ముందు రావాలా అనేది కూడా వారే తేలుస్తారు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘కెప్టెన్, కోచ్ అభిప్రాయాలు ఒకేలా ఉండవు’ ఎప్పుడైనా జట్టు కెప్టెన్, కోచ్ ఒకేలా ఆలోచిస్తారనుకోవడం సరికాదని, అలా ఎప్పుడూ జరగదని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నారు. కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాల గురించి స్పందిస్తూ.. ‘అదంతా నిజమో కాదో తెలీదు కానీ చాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ పరిస్థితి ఉండకూడదు. కచ్చితంగా కోచ్ అనే వ్యక్తి ప్రస్తుత తరంకన్నా ముందు ఆడినవారై ఉంటారు. అందుకే వారి దృక్పథం వేరేలా ఉంటుంది. ఇక జట్టు విజయాల గురించి మాట్లాడితే కుంబ్లే అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతీ కోచ్ జట్టు 10 ఏళ్ల భవిష్యత్‌ను ఊహించి పనిచేయాలి. కెప్టెన్, కోచ్‌లతో సీఏసీ సభ్యులు మాట్లాడతారని అనుకుంటున్నాను’ అని గావస్కర్ చెప్పారు. -
ఐసీసీ సమావేశానికి అమితాబ్, జోహ్రి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో బీసీసీఐ నుంచి మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు పాల్గొనే అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నట్టు గతంలో నిరూపితమైనందుకునే ఆయనకు ఈ అవకాశం లేదని తేల్చింది. అయితే ఈనెల 24న జరిగే ఐసీసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈవో రాహుల్ జోహ్రిలకు కోర్టు అనుమతిచ్చింది. ఇదే విషయంలో స్పష్టత కోసం ఇటీవల బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టు జోక్యాన్ని కోరిన విషయం తెలసిందే. ‘ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా అమితాబ్ వ్యవహరిస్తారు. ఆయనకు తోడుగా ఉండే జోహ్రి సీఈవోల సమావేశానికి హాజరవుతారు’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎమ్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ తెలిపింది. -
బీసీసీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు
ఖరారు చేసిన సుప్రీం కోర్టు నేటి నుంచి దుబాయ్‌లో ఐసీసీ సమావేశం న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశానికి ముగ్గురు ప్రతినిధులను పంపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరి, విక్రమ్ లిమాయేలతో కూడిన ప్యానెల్‌ను అనుమతించాల్సిందిగా ఐసీసీకి సమాచారమివ్వాలని సుప్రీం కోర్టు బీసీసీఐని ఆదేశించింది. మంగళవారం ఒక్క లిమాయేనే బోర్డు ప్రతినిధిగా వెళ్లాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని తమిళనాడు సంఘం తరఫున కపిల్ సిబల్ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ ముగ్గురికి సమాన హోదాతో పాల్గొనే అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి స్పష్టం చేసింది. ఐసీసీ సమావేశం నేటి నుంచి 5వ తేదీ వరకు దుబాయ్‌లో జరగనుంది. బోర్డు తరఫున ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారని మొదట బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే అనంతరం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ముగ్గురిని అనుమతించాల్సిందిగా ఐసీసీని కోరడంతో సమ్మతించారని చెప్పుకొచ్చారు. ‘భారత సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఐసీసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది కేవలం భారత్‌కు సంబంధించిన అంతర్గత అంశం. ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదు’ అని ఐసీసీ ప్రతినిధి స్పష్టం చేసినట్లు ‘ఔట్లుక్’ పేర్కొంది. బోర్డు బాధ్యతల్ని కోర్టు టేకోవర్ చేయజాలదని కేవలం సంస్కరణల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందని, ఇది ప్రభుత్వ జోక్యం కానేకాదని సుప్రీం కోర్టు తెలిపింది. మేం గమనిస్తున్నాం: శశాంక్ భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల్ని సునిశితంగా గమనిస్తున్నామని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపారు. ‘బలమైన పాలకపక్షంతోనే పటిష్టమైన బీసీసీఐ రూపుదిద్దుకుంటుంది. ఇది ఆటకెంతో మేలు చేస్తుంది’ అని శశాంక్ ఐసీసీ వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు. ఐసీసీలో బీసీసీఐ కీలక సభ్యదేశమని... అలాంటి బోర్డులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ సంస్కరణలు చేపట్టడం మంచిదేనని గతంలో బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరించిన మనోహర్ తెలిపారు. అమితాబ్... ఇదేం పని! సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) తొలి సమావేశంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి చేసిన నిర్వాకం వివాదాస్పదమైంది. మంగళవారం మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మినిట్స్‌ను అమితాబ్ ఈ–మెయిల్ ద్వారా తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) కోశాధికారికి తెలియజేశారు. ఓ ఉన్నతస్థాయి సమావేశానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని సంబంధంలేని వ్యక్తులకు చేరవేయడం ద్వారా అమితాబ్ పరిధిదాటి వ్యవహరించాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కమిటీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని... దీనిపై తాను కామెంట్ చేయనని టీఎన్‌సీఏ కోశాధికారి నర్సింహన్ తెలిపారు. -
బరిలోకి అమితాబ్ చౌదరి!
-
చక్రం తిప్పుతున్న శ్రీనివాసన్!
న్యూఢిల్లీ : ఏడు నెలల వ్యవధిలోనే బీసీసీఐలో మరో సారి రాజకీయం రాజుకుంది. దాల్మియా మృతితో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు బోర్డులోని రెండు వర్గాలు వ్యూహా ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ తన మద్దతుదారులతో గురువారం బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి, అభ్యర్థి ఎవరు అనే అంశాలను ఇందులో చర్చించనున్నారు. తనకు ఈ సమావేశం కోసం పిలుపు వచ్చినట్లు ఒక సీనియర్ సభ్యుడు ధ్రువీకరించారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న అమితాబ్ చౌదరి కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈస్ట్‌జోన్ సంఘాలతో పాటు తనకు అనుకూలురైన సౌత్‌జోన్ సంఘాలనుంచి కూడా శ్రీని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలపై చర్చించేందుకు శ్రీనివాసన్ నాగపూర్‌లో శరద్‌పవార్‌తో కూడా సమావేశమైనట్లు తెలిసింది. ఇక రాజకీయాల్లో భిన్న ధ్రువాలే అయినా రాజీవ్ శుక్లాను అధ్యక్షుడిని చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్‌జోన్ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. -
బరిలోకి అమితాబ్ చౌదరి!
♦ అధ్యక్ష పదవికి ఈస్ట్‌జోన్ ప్రతిపాదన ♦ ఆరు సంఘాలు మద్దతిచ్చే అవకాశం న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్ష పదవిపై సీనియర్ పరిపాలకులు శరద్ పవార్, రాజీవ్ శుక్లాలు ఆసక్తి చూపిస్తుండగా అనూహ్యంగా మరో పేరు తెర మీదికి వచ్చింది. బోర్డు చీఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉన్న ఈస్ట్‌జోన్ తమ అభ్యర్థిగా జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈస్ట్‌జోన్‌లోని ఆరు సంఘాలు బెంగాల్, అస్సాం, జార్ఖండ్, ఒడిషా, త్రిపుర, నేషనల్ క్రికెట్ క్లబ్‌లు అమితాబ్‌కు మద్దతు పలకనున్నట్లు సమాచారం. దాల్మియా మృతి అనంతరం గత రెండు రోజులుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ చౌదరి ప్రస్తుతం బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా మంచి గుర్తింపు ఉండటం, వివాదరహితుడు కావడం వల్ల కూడా ఆయన పేరుపై పెద్దగా వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చు. శ్రీనివాసన్ చాణక్యం నిబంధనల ప్రకారం 2017 వరకు ఈస్ట్‌జోన్‌కు చెందిన వ్యక్తే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని అక్కడి సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుత బోర్డు కార్యవర్గం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పక్కన పెడుతున్నా... అనేక మంది మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నారు. బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరితో పాటు అమితాబ్ చౌదరి కూడా శ్రీనివాసన్‌కు బాగా నమ్మకస్తులు. వీరిద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా చేసి మళ్లీ పట్టు సాధించాలని భావిస్తున్న శ్రీని ఇప్పటికే ఈస్ట్ జోన్ సంఘాలతో మాట్లాడగా... కనీసం నాలుగు సంఘాలు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందరూ అమితాబ్ పేరుకు మద్దతిస్తే సమస్యే లేకుండా ఏకగ్రీవ ఎంపిక జరుగుతుంది. ఒక వేళ ఏదైనా అసోసియేషన్ అమితాబ్‌కు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఏజీఎం జరిపి ఎన్నిక నిర్వహిస్తారు. పవార్, శుక్లాలకు కష్టం! మరో వైపు పవార్, శుక్లాలలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధమైనా వారికి పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. బోర్డులోని 30 ఓట్లలో కనీసం 16 మంది ఖాయంగా తన వైపు ఉన్నారని స్పష్టమైతే తప్ప బరిలోకి దిగరాదని పవార్ భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. రాజీవ్ శుక్లా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ అభ్యర్థిని బరిలోకి దించకుండా తనకే మద్దతు ఇవ్వాలని ఈస్ట్‌జోన్ సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు శుక్లా సిద్ధమవుతున్నా అది జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రత్యేక ఏజీఎంను కూడా శ్రీనివాసన్ అంశంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చాకే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండటంతో సమావేశం మరింత ఆలస్యం కావచ్చు.