బీసీసీఐ నుంచి ముగ్గురు ప్రతినిధులు
ఖరారు చేసిన సుప్రీం కోర్టు
నేటి నుంచి దుబాయ్‌లో
ఐసీసీ సమావేశం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశానికి ముగ్గురు ప్రతినిధులను పంపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరి, విక్రమ్ లిమాయేలతో కూడిన ప్యానెల్‌ను అనుమతించాల్సిందిగా ఐసీసీకి సమాచారమివ్వాలని సుప్రీం కోర్టు బీసీసీఐని ఆదేశించింది. మంగళవారం ఒక్క లిమాయేనే బోర్డు ప్రతినిధిగా వెళ్లాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని తమిళనాడు సంఘం తరఫున కపిల్ సిబల్ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఆ ముగ్గురికి సమాన హోదాతో పాల్గొనే అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి స్పష్టం చేసింది. ఐసీసీ సమావేశం నేటి నుంచి 5వ తేదీ వరకు దుబాయ్‌లో జరగనుంది.
బోర్డు తరఫున ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారని మొదట బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే అనంతరం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ముగ్గురిని అనుమతించాల్సిందిగా ఐసీసీని కోరడంతో సమ్మతించారని చెప్పుకొచ్చారు. ‘భారత సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఐసీసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది కేవలం భారత్‌కు సంబంధించిన అంతర్గత అంశం. ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదు’ అని ఐసీసీ ప్రతినిధి స్పష్టం చేసినట్లు ‘ఔట్‌లుక్’ పేర్కొంది. బోర్డు బాధ్యతల్ని కోర్టు టేకోవర్ చేయజాలదని కేవలం సంస్కరణల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందని, ఇది ప్రభుత్వ జోక్యం కానేకాదని సుప్రీం కోర్టు తెలిపింది.
మేం గమనిస్తున్నాం: శశాంక్
భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల్ని సునిశితంగా గమనిస్తున్నామని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపారు. ‘బలమైన పాలకపక్షంతోనే పటిష్టమైన బీసీసీఐ రూపుదిద్దుకుంటుంది. ఇది ఆటకెంతో మేలు చేస్తుంది’ అని శశాంక్ ఐసీసీ వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు. ఐసీసీలో బీసీసీఐ కీలక సభ్యదేశమని... అలాంటి బోర్డులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ సంస్కరణలు చేపట్టడం మంచిదేనని గతంలో బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరించిన మనోహర్ తెలిపారు.
అమితాబ్... ఇదేం పని!
సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) తొలి సమావేశంలో బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి చేసిన నిర్వాకం వివాదాస్పదమైంది. మంగళవారం మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మినిట్స్‌ను అమితాబ్ ఈ–మెయిల్ ద్వారా తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) కోశాధికారికి తెలియజేశారు. ఓ ఉన్నతస్థాయి సమావేశానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని సంబంధంలేని వ్యక్తులకు చేరవేయడం ద్వారా అమితాబ్ పరిధిదాటి వ్యవహరించాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కమిటీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని... దీనిపై తాను కామెంట్ చేయనని టీఎన్‌సీఏ కోశాధికారి నర్సింహన్ తెలిపారు.