విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని తప్పుగా అర్థం చేసుకోవద్దని బీసీసీఐ తాత్కలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి అభిమానులను కోరారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లి అందుబాటులో ఉండకుండా ఇంగ్లండ్ కౌంటీలకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల కోహ్లిపై విమర్శలు గుప్పించారు. చారిత్రాత్మకమైన అఫ్గాన్ టెస్టుకు కోహ్లి దూరం కావడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అమితాబ్ చౌదరి కోహ్లిని తిట్టవద్దని కోరారు. అఫ్గాన్ టెస్టుకు దూరం కావడంలో కోహ్లికి వేరే ఉద్దేశం లేదని, ఇంగ్లండ్ పరిస్థితులను తెలుసుకోవడం కోసమే అతను అక్కడికి వెళ్తున్నాడని స్పష్టం చేశాడు. దయచేసి అభిమానులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘‘అఫ్గానిస్తాన్‌తో ఆడకూడదన్న ఉద్దేశం కోహ్లికి లేదు. ఇంగ్లండ్ గడ్డపై రాణించి అభిమానులను సంతృప్తిపరచాలనే అతను కౌంటీ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపాడు. ఇందులో భాగంగానే కొంతమంది ఆటగాళ్లు అక్కడికి ముందుగానే పంపించాం. టెస్టు క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టే ఇలా చేస్తున్నాం. పరమిత ఓవర్ల క్రికెట్ కోసం అయితే కాదు‘’ అని అమితాబ్ చౌదరి తెలిపారు. మరెందుకు ఓపెనర్లను కౌంటీ క్రికెట్ ఆడేందుకు పంపించలేదు అన్న ప్రశ్నకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ సమాధానమిచ్చారు. విరాట్‌కు మాత్రమే అవకాశం వచ్చిందని, ఇతరులకు వచ్చిందో రాలేదో తెలియదన్నారు. వారి కూడా అవకాశం వస్తే సంతోషంగా పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment