గర్ల్ఫ్రెండ్స్ను ఇంటి దగ్గరే వదిలేయండి!
బీసీసీఐ ఆటగాళ్లకు షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి విదేశీ పర్యటనలకు ఆటగాళ్లు తమ గర్ల్ఫ్రెండ్స్ను తీసుకు వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పనుంది. క్రికెటర్ల గర్ల్ఫ్రెండ్స్ను ఇంటికే పరిమితం చేయాలని నిర్ణయించింది. అలాగే ఆటగాళ్లు తమ భార్యలను తమతోపాటు తీసుకువెళ్లే విషయంలో ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనలకు భారత క్రికెటర్లతో పాటు వారి భార్యలు వెళ్లడం తక్కువ. అయితే ఈసారి ఇంగ్లాండ్‌లో రెండు నెలల సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో క్రికెటర్లలో చాలామంది తమ వెంట భార్యలనూ తీసుకెళ్లారు. పనిలో పనిగా విరాట్ కోహ్లీ తన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను తీసుకు వెళ్లాడు.
విషయానికి వస్తే ఇంగ్లండ్ సిరీసీలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి బీసీసీఐ కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు... క్రికెటర్లతో పాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఇక పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్‌ను విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం. క్లోహీ అడగటమే ఆలస్యం బీసీసీఐ ఏమాత్రం ఆలోచించకుండా అనుష్కను తీసుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దాంతో ఇంగ్లండ్ టూర్‌లో కోహ్లి...అనుష్కశర్మతో ప్రేమ కలాపాల్లో మునిగిపోయి... ఆటను పక్కన పెట్టాడని విమర్శులు వచ్చాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చాడు. దాంతో తీరిగ్గా నాలుక కరుచుకున్న బీసీసీఐ ఈసారి నుంచి టెస్ట్ మ్యాచ్లకు ఆటగాళ్లు తమ గర్ల్ఫ్రెండ్స్ను ఇంటి వద్దే వదిలి రావాలని సూచించనుంది. అయితే ఈ నిబంధన ఎప్పటివరకూ కొనసాగించాలనేది బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వెళ్లిన పని మరచి... ఎంజాయ్ చేస్తున్న ఆటగాళ్లను దారిలో పెట్టేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వర్కవుట్ అవుతుందేమో చూడాలి.