‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Peddi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Jun 4 2026 12:33 AM | Updated on Jun 4 2026 12:46 PM

Peddi Movie Review And Rating In Telugu

టైటిల్‌ : పెద్ది
నటీనటులు: రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌, జగపతి బాబు, శివరాజ్‌ కుమార్‌, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు
నిర్మాత: సతీష్‌ కిలారు
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
రచన-దర్శకత్వం: బుచ్చిబాబు
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
విడుదల తేది: జూన్‌ 4, 2026

గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రం ‘పెద్ది’. గేమ్‌ ఛేంజర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నుంచి వస్తున్న పాన్‌ ఇండియా  చిత్రమిది. ఉప్పెన లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అదించిన తెలుగు చిత్రం  ఇదే కావడం మరో ప్రత్యేకం. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలకు, ఆసక్తికి దీటుగా ఈ చిత్రం ఉందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూ(Peddi Review)లో చూద్దాం.

Ram Charan Peddi Movie Trailer HD Photos1

కథేంటంటే..
1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో  రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్‌ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్‌లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్‌ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్‌) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్‌ వరకు వెళ్తాడు. మరి నేషనల్‌ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది?  కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి?  అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్‌),  రామ్‌ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Tollywood : Ram Charan Peddi Movie HD Wallpaper1

 ఎలా ఉందంటే...
గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఎమోషనల్‌ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్‌తో తెరపై ఎంట్రీ ఇచ్చి, కుస్తీతో ఆకట్టుకొని, అథ్లెట్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. మూడు విభిన్నమైన క్రీడల్నీ తీసుకున్న బుచ్చి బాబు.. వీటి మధ్యలో ఓ ఎమోషనల్‌ కథ చెప్పాడు. ఆ  కథ ఊహకందేలా సాగడమే ఇక్కడ కొంతవరకు మైనస్‌.  అయితే రామ్‌ చరణ్‌ నటన, రెహమాన్‌ నేపథ్య సంగీతం ఆ మైనస్‌ని కొంతవరకు కప్పిపుచ్చాయనే చెప్పాలి.

2016లో కథ ప్రారంభం అవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కి కేవలం 2 ఓలింపిక్స్‌ పథకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై సీరియస్‌ అవ్వడం..  వచ్చే పోటీల్లోపు మెరికాల్లాంటి కుర్రాళ్లను తయారు చెయమని ఆదేశించడం..  ఓ అధికారి(బోమన్‌ ఇరానీ) విజయనగరం రావడం.. అక్కడ పెద్ది పేరు విని..అతని గురించి తెలుసుకునేందుకు  ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరి వ్యక్తి పెద్దికి భారీ ఎలివేషన్‌ ఇస్తూ.. స్టోరీని ప్రారంభిస్తాడు. అయితే కేజీయఫ్‌ తర్వాత ఇలా హీరో కథని ఎలివేషన్‌ ఇస్తూ,  ముక్కలు ముక్కలుగా చెప్పడం రొటీన్‌గా మారింది.  అందుకే పెద్ది ప్రారంభం అంత ఆసక్తికరంగా అనిపించదు. 

ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్‌లో సిక్సర్‌ కొడతాడో.. అప్పటి నుంచి కథనం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.  ఒకవైపు పెద్ది క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెబుతూనే.. మరోవైపు అప్పల సూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి.. అసలు సంఘర్షణ ఏంటనేది మొదటి నుంచే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అయితే అచ్చీయమ్మగా జాన్వీ ఎంట్రీ, ఎన్నికల ప్రచారం.. ముద్దు సీన్‌.. ఇవేవి అంతగా ఆకట్టుకోవు. అసలు కథకు ఈమె పాత్రకు సంబంధమే ఉండదు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమెషనల్‌గా సాగుతాయి.  పోలీస్ స్టేష‌న్ సీన్‌తో హీరో మెయిన్‌ ట్రాక్‌ ఎక్కుతాడు. ఇంటర్వెల్‌ సీన్‌ ని దర్శకుడు చక్కగా ప్లాన్‌ చేశాడు. 

ఫస్టాఫ్‌ మొత్తం పక్కా కమర్షియల్‌ మీటర్‌లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు.. సెకండాఫ్‌ని మాత్రం వాటిని పట్టించుకోకుండా చెప్పాల్సిన పాయింట్‌పై మాత్రమే ఫోకస్‌ పెట్టాడు.  ద్వితియార్థంలో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్‌ అన్ని ఆకట్టుకుంటాయి.  ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే కీలక మలుపు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది.  

ఢిల్లీ ఎపిసోడ్‌.. ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమి ఉండదు. కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను హత్తుకుంటుంది.  క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్‌ విషయంలో దర్శకుడు చాలా వరకు సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా తెరపై సహజంగానే కనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. 

Tollywood : Ram Charan Peddi Movie HD Wallpaper3

ఎవరెలా చేశారంటే.. 
రామ్‌ చరణ్‌ వన్‌ మ్యాన్‌ షో ఇది. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్‌గా మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్‌..ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయాడు.  అయితే ప్రమోషన్స్‌లో ఇచ్చినంత ఎలివేషన్స్‌ మాత్రం సినిమాలో లేవు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు శివరాజ్‌కుమార్‌ న్యాయం చేశాడు. 

ఇక అచ్చియమ్మగా జాన్వీ కపూర్‌ తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది.  కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథకి ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. హీరోయిన్‌ అన్నాక కథకు కొంత లింకు చేయాలి అన్నట్లుగా.. కొంతవరకు అలా చూపించారంతే.  రామ్‌ బుజ్జిగా దివ్యేందుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
 
Advertisement
Advertisement