
బరిలోకి అమితాబ్ చౌదరి!
♦ అధ్యక్ష పదవికి ఈస్ట్‌జోన్ ప్రతిపాదన
♦ ఆరు సంఘాలు మద్దతిచ్చే అవకాశం
న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్ష పదవిపై సీనియర్ పరిపాలకులు శరద్ పవార్, రాజీవ్ శుక్లాలు ఆసక్తి చూపిస్తుండగా అనూహ్యంగా మరో పేరు తెర మీదికి వచ్చింది. బోర్డు చీఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉన్న ఈస్ట్‌జోన్ తమ అభ్యర్థిగా జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈస్ట్‌జోన్‌లోని ఆరు సంఘాలు బెంగాల్, అస్సాం, జార్ఖండ్, ఒడిషా, త్రిపుర, నేషనల్ క్రికెట్ క్లబ్‌లు అమితాబ్‌కు మద్దతు పలకనున్నట్లు సమాచారం. దాల్మియా మృతి అనంతరం గత రెండు రోజులుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ చౌదరి ప్రస్తుతం బీసీసీఐ సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా మంచి గుర్తింపు ఉండటం, వివాదరహితుడు కావడం వల్ల కూడా ఆయన పేరుపై పెద్దగా వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చు.
శ్రీనివాసన్ చాణక్యం
నిబంధనల ప్రకారం 2017 వరకు ఈస్ట్‌జోన్‌కు చెందిన వ్యక్తే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని అక్కడి సంఘాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుత బోర్డు కార్యవర్గం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పక్కన పెడుతున్నా... అనేక మంది మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నారు. బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరితో పాటు అమితాబ్ చౌదరి కూడా శ్రీనివాసన్‌కు బాగా నమ్మకస్తులు. వీరిద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా చేసి మళ్లీ పట్టు సాధించాలని భావిస్తున్న శ్రీని ఇప్పటికే ఈస్ట్ జోన్ సంఘాలతో మాట్లాడగా... కనీసం నాలుగు సంఘాలు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందరూ అమితాబ్ పేరుకు మద్దతిస్తే సమస్యే లేకుండా ఏకగ్రీవ ఎంపిక జరుగుతుంది. ఒక వేళ ఏదైనా అసోసియేషన్ అమితాబ్‌కు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఏజీఎం జరిపి ఎన్నిక నిర్వహిస్తారు.
పవార్, శుక్లాలకు కష్టం!
మరో వైపు పవార్, శుక్లాలలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధమైనా వారికి పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. బోర్డులోని 30 ఓట్లలో కనీసం 16 మంది ఖాయంగా తన వైపు ఉన్నారని స్పష్టమైతే తప్ప బరిలోకి దిగరాదని పవార్ భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. రాజీవ్ శుక్లా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ అభ్యర్థిని బరిలోకి దించకుండా తనకే మద్దతు ఇవ్వాలని ఈస్ట్‌జోన్ సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు శుక్లా సిద్ధమవుతున్నా అది జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రత్యేక ఏజీఎంను కూడా శ్రీనివాసన్ అంశంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చాకే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండటంతో సమావేశం మరింత ఆలస్యం కావచ్చు.