న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో ఇప్పుడు ఇద్దరు సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మాత్రమే మిగిలారు. వీరిద్దరికి కూడా పడటం లేదని చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న వివాదం కారణంగా అవి ఇప్పుడు బయట పడ్డాయి. జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించమని ఎడుల్జీ కోరగా... దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వినోద్ రాయ్ కొత్త కోచ్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీని మంగళవారం ప్రకటించారు. ఇందులో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఉన్నారు. దీంతో పాటు ఇతర అంశాలను కూడా ప్రశ్నిస్తూ ఎడుల్జీ సుదీర్ఘ లేఖ రాశారు.
మహిళల జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించాలంటూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధన కోరడంలో తప్పేమీ లేదని ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. గతంలో విరాట్ కోహ్లి పట్టు పట్టడం వల్లే రవిశాస్త్రిని ఎంపిక చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘కోహ్లి తరహాలో కాకుండా మహిళా క్రికెటర్లు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కోహ్లి వరుస పెట్టి సీఈఓ జోహ్రికి మెసేజ్‌లు పంపించాడు. దానిపైనే మీరు స్పందించి కోచ్‌ను మార్చారు. రవిశాస్త్రి కోసం దరఖాస్తు గడువు తేదీని పెంచడంపై కూడా నాడు నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. దిగ్గజ ఆటగాడు కుంబ్లేను కూడా విలన్‌లా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అతను గౌరవంగా తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. అయితే ఆ సమయంలో అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన కోసం కోచ్‌గా కొనసాగించమని ఇద్దరు ప్లేయర్లు కోరుతున్నారు. కొత్త కోచ్‌ను కమిటీ ఎంపిక చేసే వరకు వారి మాటకు విలువిస్తే తప్పేమిటి’ అని ఎడుల్జీ ప్రశ్నించారు. క్రికెట్ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారా లేదా కనీసం తెలుసుకోకుండానే ముగ్గురితో అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు చేయడంపై కూడా ఆమె వివరణ కోరారు. తాను లేకుండానే మిథాలీ, హర్మన్‌లతో సమావేశం ఎలా అవుతారని... బీసీసీఐ వ్యవహారాల్లో రాయ్‌తో పాటు తనకూ సమాన అధికారాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. తన ఆమోదం లేకుండా రాయ్ సూచనలపై స్పందించవద్దని కూడా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఈఓలను ఎడుల్జీ కోరారు.
రమేశ్ పొవార్ దరఖాస్తు...
జట్టు కోచ్ రేసులో మరోసారి రమేశ్ పొవార్ నిలిచాడు. నవంబర్ 30న పదవీకాలం పూర్తయి తప్పుకున్న అతను ఇప్పుడు మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. ‘అవును... స్మృతి, హర్మన్ మద్దతు పలకడంతో మళ్లీ దరఖాస్తు చేశాను. అలా చేయకుండా వారిని నిరాశపర్చలేను’ అని పొవార్ చెప్పాడు. ప్రస్తుతానికి కోచ్ పదవికి బీసీసీఐ వద్ద మనోజ్ ప్రభాకర్, హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), దిమిత్రి మస్కరెన్హాస్ (ఇంగ్లండ్) దరఖాస్తులు ఉన్నాయి.
కోహ్లి మెసేజ్‌లతో ఒత్తిడి పెంచడం వల్లే...
Published Wed, Dec 12 2018 12:47 AM | Last Updated on Wed, Dec 12 2018 12:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment