
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ నిర్వహిస్తోన్న యో-యో టెస్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. కేవలం అరగంటపాటు చేసే పరీక్ష ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను ఎలా నిర్ధరిస్తారని మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యో యో పరీక్షనే ఎందుకు ప్రామాణికంగా తీసుకొంటున్నారని వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకుల కమిటీ(సీఓఏ) బీసీసీఐని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.
ఐపీఎల్‌లో రాణించిన అంబటి రాయుడు, సంజూ శాంసన్ ఇద్దరూ యో-యో టెస్టులో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో యో యో టెస్టు నిర్వహణ అనేది చర్చకు తెరలేపింది. ‘వినోద్ రాయ్‌తోపాటు ఇతర పాలక సభ్యులకు రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై పూర్తి అవగాహన ఉంది. యో-యో టెస్ట్‌పై వస్తున్న ఆరోపణలను రాయ్ బృందం పరిగణనలోకి తీసుకొంటుంది. దీనిపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) శిక్షకుల నుంచి సమాచారం అడిగే అవకాశం ఉంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘యో- యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశమని, అందువల్ల సీవోఏ చీఫ్ ఇప్పటివరకూ కలగజేసుకోలేదని, అయితే రాబోయే రోజుల్లో క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ సబా కరీమ్ నుంచి సంపూర్ణ సమాచారం తెలుసుకొంటారని’ బీసీసీఐ అధికారి వివరించారు. కాగా, ఇప్పటికే యో యో టెస్ట్‌ను ఎప్పుడు, ఎలా అమల్లోకి తీసుకొచ్చిందీ వంటి వివరాలను తెలియజేస్తూ బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి ఆరు పేజీల లేఖను సీవోఏకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment