క్రికెటర్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పరీక్షించే యో-యో టెస్ట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌తో పాటు బోన్ స్కాన్ టెస్ట్ 'డెక్సా'ను బీసీసీఐ ఈ ఏడాది జనవరి నుంచి తిరిగి అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వీరూ స్పందించాడు. టీమిండియాకు ఎంపిక కావాలంటే తప్పనిసరిగా యో-యో ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాలన్న బీసీసీఐ షరతుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ అవలంభిస్తున్న ఫిట్‌నెస్ ప్రమాణాల వల్ల కెరీర్‌లు నాశనమవుతాయే కానీ ఫలితం శూన్యమని తెలిపాడు.
యో-యో టెస్ట్‌ను బీసీసీఐ కనీస అర్హతగా పేర్కొనడాన్ని ఖండించిన ఆయన.. తమ జమానాలో యో-యో టెస్ట్‌ను తప్పనిసరి చేసుంటే చాలామంది దిగ్గజ ఆటగాళ్లు ఫెయిల్ అయ్యేవారని, వారికి జట్టులో స్థానం కూడా దక్కేది కాదని అన్నాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో బీసీసీఐ స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించేదని, ఇప్పుడు పరిస్థితి ఇంకోలా మారిపోయిందని తెలిపాడు.
క్రికెటర్లు మంచి రన్నర్‌లు కావాలనుకుంటే క్రికెట్ ఆడించాల్సిన పనిలేదని, వారితో మారథాన్‌లు ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుందని వ్యంగ్యంగా సూచించాడు. ఆటగాళ్లు ఏ విభాగంలో అయినా రాణించాలంటే స్కిల్ డెవలప్ చేసుకుంటే సరిపోతుందని.. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, సిక్స్ ప్యాక్ బాడీలపై అధికంగా ఫోకస్ పెడితే గాయాల బారిన పడి కెరీర్‌లు అర్ధంతరంగా ముగుస్తాయే తప్ప సాధించేది ఏదీ ఉండదని అన్నాడు. జిమ్‌లో సాధన, అధిక బరువులు మోయడం వల్ల కెరీర్ స్పాన్ పెరుగుతుందని అనుకుంటే పొరబడ్డట్టేనని, ఇలా చేయడం వల్ల గాయాలు తీవ్రతరమైతాయే తప్ప ఎలాంటి ఫలితం ఉండదని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment