
ముంబై: తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవాళీ జట్లలో కొనసాగుతోన్న క్రికెటర్లను బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. వయసు తక్కువగా చూపిస్తే ఆటగాళ్లపై రెండేళ్ల సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఓఏ చీఫ్ వినోద్‌రాయ్ తెలిపారు. మే నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించిన సీఓఏ... దేశవాళీ క్రికెట్‌లో సర్వసాధారణంగా మారిన ఈ మోసాలను కట్టిపెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఇదివరకు ఒక సంవత్సరంగా ఉన్న సస్పెన్షన్ కాలాన్ని రెండేళ్లకు పెంచడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మూడేళ్ల క్రితం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారకోపన్యాసంలో ప్రస్తుత భారత అండర్–19 కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. వయసును తక్కువగా చూపెట్టి జట్టులో చోటు దక్కించుకోవడం ఫిక్సింగ్‌తో సమానమని అన్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో అండర్–19, అండర్–16 జట్లలో చేరుతున్న ఆటగాళ్ల కారణంగా... అర్హుడైన ప్రతిభ గల మరో యువ క్రీడాకారుడికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.