
ముంబై: తన బ్యాటింగ్ మెరుపులు, రికార్డులతోనే కాకుండా వివాదాలతోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ అభిమానిని ‘ నీకు నచ్చకుంటే దేశం వదిలి వెళ్లు’ అంటూ చేసిన కామెంట్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో కీలక ఆస్ట్రేలియా పర్యటన, అభిమానితో వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) కోహ్లికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (దేశం విడిచి వెళ్లిపో : విరాట్ కోహ్లి)
64 రోజుల సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో ఆసీస్‌కు టీమిండియా బయలుదేరే ముందు సీఓఏకు చెందిన ఓ ముఖ్య అధికారి విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా సంభాషించారని తెలిసింది. మీడియా సమావేశాల్లో, అభిమానులతో మాట్లాడే సమయంలో హుందాగా వ్యవహరించాలని కోహ్లికి సీఓఏ తెలిపినట్లు ముంబై మిర్రర్‌లో వార్తా కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం సీఓఏ మెంబర్ తొలుత కోహ్లీతో వాట్సాప్‌లో చాట్ చేసి, ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడారని పేర్కొంది. (రవిశాస్త్రికి సీఓఏ కౌంటర్..!)
స్లెడ్జింగ్‌కు మారుపేరైన ఆసీస్ ఆటగాళ్లు కోహ్లిని టార్గెట్ చేస్తారనడంలో సందేహమేలేదు. 2012 ఆస్ట్రేలియా పర్యటనలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లిని అభిమానులు గేలి చేయడంతో అతడు చేతితో అసభ్య సంజ్ఞలు చేసి విమర్శల పాలయ్యాడు. ఇక 2014లోనూ ఆసీస్ ప్రధాన బౌలర్ మిచెల్ జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొన్న సీఓఏ కోహ్లికి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. (‘అందువల్లే కోహ్లి నియంత్రణ కోల్పోయాడు’)
Comments
Please login to add a commentAdd a comment