జహీర్ ఖాన్ తర్వాత సరైన లెఫ్టార్మ్ పేసర్ లేక టీమిండియా ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. సెలక్టర్లు సైతం యువ లెఫ్టార్మ్ పేసర్లకు అవకాశమిచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేదు. ఈ క్రమంలో ఆసియా కప్ వంటి మెగా టోర్నీ కోసం దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్ యువ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ బౌలర్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో భవిష్యత్‌పై ఆశలు రేపిన ఖలీల్‌కు అసలు సవాల్ ఆస్ట్రేలియాలో ఎదురుకానుంది. ఉపఖండపు పిచ్‌లపై రాణించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. పేస్‌కు స్వర్గధామమైన ఆసీస్ పిచ్‌లపై రాణిస్తాడా లేక చేతులెత్తేస్తాడా వేచి చూడాలి. అయితే ఆసీస్ సిరీస్‌కు ఎంపిక కావడం, గత సిరీస్‌లలో తన ప్రదర్శణ , సీనియర్ల సూచనలు తదితర అంశాల గురించి ఖలీల్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆ ముగ్గురు ప్రోద్బలంతోనే..
తొలి సారి టీమిండియాకు ఎంపిక కావడంతో ఉద్వేగం, ఆనందం, భయం కలిగిందని, కానీ సీనియర్ల సలహాలు, వారి ప్రోత్సాహం మరువలేనిదని, ముఖ్యంగా ఎంఎస్ ధోని, సారథి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల సూచనలు తనకు ఎంతో మేలు చేశాయని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు. మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని వికెట్ వెనకాల ఉంటే ఏ బౌలర్‌కైనా సగం పని సులువవుతుందని ఖలీల్ తెలిపాడు. బ్యాట్స్‌మన్ కదలికలు వివరించడం, బౌలింగ్ విధానం బట్టి ఫీల్డర్‌లను అమర్చడంలో ధోనికి సాటిలేరని స్పష్టం చేశాడు. ఇక కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడని తెలిపాడు.
అతనిచ్చిన స్వేచ్చతోనే..
ఇక తన తొలి మ్యాచ్ సారథి రోహిత్ శర్మను ఈ యువ పేసర్ ప్రశంసలతో ముంచెత్తాడు. బౌలింగ్ చేసేటప్పుడు స్వేచ్చనిచ్చేవాడని, ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఆసియాకప్‌ను రోహిత్‌ను అందుకున్న తర్వాత ఆ ట్రోఫిని తనకివ్వడంతో ఒక్క సారిగా ఉద్వేగానికి గురయ్యానని తెలిపాడు. ఇక ఆసియాకప్‌తో సహా, వెస్టిండీస్‌పై నెగ్గిన వన్డే, టీ20 సిరీస్ ట్రోఫీలను సారథులు ఖలీల్‌కు అందించిన విషయం తెలిసిందే.
కోహ్లి ఫిట్‌నెస్ మంత్రం
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంలో ఫన్నీగా ఉంటాడని తెలియజేశాడు. కోహ్లి అనగానే తనకు గుర్తొచ్చేది కష్టపడటం, బాడీ ఫిట్‌గా ఉంచుకోవడమని తెలిపాడు. టీమిండియా పరుగుల యంత్రం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, అతడిలా ఫిట్‌నెస్ కాపాడుకుంటే భవిష్యత్‌లో గొప్ప బౌలర్ అవుతాననే నమ్మకం ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు. ఇక బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇచ్చిన అమూల్యమైన సూచనలు గత సిరీస్‌లలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపాడు.
ఆసీస్ సిరీస్ గురించి..
ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని ఖలీల్ స్పష్టం చేశాడు. కానీ తన అసలైన సవాల్ ఆసీస్‌లోనే మొదలవుతుందన్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడమే తన ప్రధాన సూత్రమని, ఆసీస్‌లో అది కచ్చితంగా అమలు చేస్తానని వివరించాడు. అయితే ఉపఖండపు పిచ్‌లతో పోలిస్తే ఆస్ట్రేలియాలో కాస్త కఠినంగా ఉంటాయని, పక్కా ప్రణాళికలతో బౌలింగ్ చేస్తే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయవచ్చని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment