కోల్‌కతా: కీలక టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరవ్ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి కీలక బ్యాట్స్‌మెన్ సేవల్ని కోల్పోయిన ఆసీస్ జట్టు బలహీన పడిందని దాదా అభిప్రాయపడ్డాడు. సారథి విరాట్ కోహ్లి, స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మలు లేకుంటే టీమిండియా ఎలా ఉంటుందో ప్రస్తుతం ఆసీస్ జట్లు పరిస్థితి అలా తయారైందని పేర్కొన్నాడు.
ఇక అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కోహ్లి సేన ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచేందుకే ఇదే సరైన సమయమని అభిప్రాయం వ్యక్త చేశాడు. అయితే ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఆ జట్టు బౌలింగ్‌లో బలంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే బ్యాటింగ్‌లో ఆసీస్ ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలన్నాడు. ఇదిలాఉండగా.. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ రంజీల్లో బెంగాల్ తరపున బరిలోకి దిగే విషయంపై కూడా గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. షమీ ఫిట్‌నెస్‌తో ఉంటే త్వరలో కేరళతో జరిగే మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం ఉందని దాదా తెలిపాడు. ఇక అభిమానిపై కోహ్లి చేసిన కామెంట్ (దేశం వదిలి వెళ్లు) పై స్పందించేందుకు సౌరవ్ ఇష్టపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment