రితికా సజ్దే- అనుష్క శర్మ (PC: BCCI)
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అమెరికాలోని డలాస్ వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఐసీసీ టోర్నీ కోసం సన్నద్ధమైంది.
న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి కూడా భారీ అంచనాల నడుమ రోహిత్ సేన ప్రపంచకప్ బరిలో దిగనుంది. టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకు, టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌కప్ అన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇరువురిపై ఒత్తిడి ఉండటం సహజం.
అదే విధంగా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంచనాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆటగాళ్లు అంత ఎక్కువగా ఒత్తిడికి లోనై.. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేరని పేర్కొన్నాడు.
‘‘రాహుల్ ద్రవిడ్ చాంపియన్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టును బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నడంలో దిట్ట. అయితే, రిలాక్స్ కావడానికి తనకూ కొంత సమయం కావాలి.
రోహిత్ భార్య(రితికా సజ్దే)ను స్టాండ్స్‌లో చూసినపుడు మనకే అర్థమవుతుంది. ఆమె ఎంత ఒత్తిడిలో ఉన్నారో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అదే విధంగా.. విరాట్ భార్య(అనుష్క శర్మ)ను చూసినపుడు కూడా ఇదే అనిపిస్తుంది.
ఆమె ఎంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారో తెలిసిపోతుంది. ఆటగాళ్లపై ఆశలు పెట్టుకున్నామంటూ వాళ్లను ఎంత ఒత్తిడికి లోను చేస్తోంది మనమే. తప్పు మనవైపే ఉంది. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఇదే జరిగింది.
మేజర్ టోర్నీల్లో ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆడుతున్నపుడు ఒత్తిడి పెట్టకుండా స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించగలగాలి’’ అని గంగూలీ రెవ్‌స్ట్పోర్స్‌తో వ్యాఖ్యానించాడు. అంచనాల పేరిట ఆటగాళ్లపై మానసికంగా భారం మోపడం సరికాదని దాదా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
ఇక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లోనూ టీమిండియా ఓడిపోవడానికి ఇదే కారణమని.. ఆటగాళ్లు కూడా కాస్త రిలాక్స్‌గా ఉండి ఒత్తిడి పడకుండా చూసుకోవాలని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment