ముంబై: ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ చాలా శక్తిమంతమైన బోర్డు. కాగా భారత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి బీసీసీఐ అధ్యక్ష పదవి చాలా కీలకం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సంబంధాలతో సహా ఐపీఎల్ నిర్వహణ, జాతీయ సెలెక్షన్ కమిటీ, జట్టు ఎంపిక తదితర వ్యవహారాల్లో బీసీసీఐ చీఫ్ పాత్ర కీలకం. అయితే ఏడాదిపైగా బోర్డులో అధ్యక్షుడు లేకుండానే కార్యకలాపాలు సాగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అనురాగ్ ఠాకూర్‌పై వేటు పడటంతో అప్పట్నుంచి బీసీసీఐ అధ్యక్ష స్థానం ఖాళీగానే ఉంది. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన పరిపాలన కమిటీ(సీఓఏ) బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
కాగా, ఇటీవల లోధా సంస్కరణల్లో కొన్నింటికి సవరణలు చేసిన సుప్రీంకోర్టు.. బోర్డు నూతన రాజ్యాంగాన్ని ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. కొత్త రాజ్యాంగంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను సవరించిన దరిమిలా ప్రస్తుత, మాజీ అడ్మినిస్ర్టేటర్లు బీసీసీఐ అధ్యక్ష పదవికి అనర్హులు కానున్నారు. దాంతో ఆ పదవిలో కొత్త వ్యక్తి రావడం అనివార్యం కానుంది. ఈ రేసులో ఒకప్పటి టీమిండియా కెప్టెన్, ప్రస్తుతం క్రికెట్ అసోయేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉన్నాడు.
బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికల్లో పలువురు మాజీ క్రికెటర్లకు చాన్స్ ఉన్నా.. ఎక్కువ అవకాశాలు గంగూలీకే ఉన్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ బీసీసీఐ చీఫ్ పదవికి ప్రధాన పోటీదారు కానున్నాడు. క్యాబ్ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తుండడం, మరోవైపు బీసీసీఐ పాలన అదుపు తప‍్పిన సమయంలో గాడిలో పెట్టడంలో గంగూలీకి మించిన వారు మరొకరుండరన్న అభిప్రాయాలు క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే 46 ఏళ్ల సౌరవ్ కనుక బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైతే రెండేళ్ల తర్వాత అతడు వైదొలగాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి క్యాబ్ అధ్యక్ష పదవితో కలిసి గంగూలీ మొత్తం ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment