ముంబై: కెప్టెన్ కోహ్లి కోరికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల వెంట సతీమణి, ప్రియసఖిలు ఉండేందుకు బోర్డు పరిపాలకుల కమిటీ (సీఓఏ) అనుమతించింది. నిజానికి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి విధాన నిర్ణయం లేదు. అయితే విదేశాల్లో రెండు వారాల పాటు ఆటగాళ్ల వెంట భాగస్వాముల్ని అనుమతించేవారు. ఇప్పుడు మాత్రం బోర్డు స్థిరమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై మొదటి పది రోజుల తర్వాత విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల భార్యలను, ప్రియురాళ్లను వారితో పాటు ఉండేందుకు అనుమతిస్తారు. ఈ విషయమై కోహ్లి ఎప్పటి నుంచో గట్టిగా పట్టుబడుతున్నాడు.
ఇటీవల బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)కి తన అభ్యర్థన మరోసారి తెలియజేశాడు. సుదీర్ఘ పర్యటనలప్పుడు ‘తోడు–నీడ’ కావాల్సిందేనని వాదించాడు. హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టుకు ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలను సీఓఏ సభ్యులు కలిశారు. తుది నిర్ణయం తీసుకునే దిశగా చర్చించారు. అనంతరం సీఓఏ సభ్యులు... బోర్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు (భార్య, ప్రియురాలు) వెంట ఉన్నంత మాత్రాన జట్టుకు, ఆటకు వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఆటగాళ్ల విరహవేదన తగ్గనుంది. ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని విదేశీ పర్యటనల్లో ఆటని, ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2015లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆసీస్ జట్టు ఘోరంగా ఓడినప్పటికీ అప్పటి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment