న్యూఢిల్లీ: గత 15 ఏళ్ల భారత క్రికెట్‌లో ప్రస్తుత జట్టే ఉత్తమ పర్యాటక జట్టు అని పదే పదే చెబుతున్న ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఊహించని పరిణామ ఎదురైంది. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పరిపాలన కమిటీ (సీఓఏ) గట్టి కౌంటర్ ఇచ్చింది. అత్యుత్తమ జట్టు ఏదో ప్రజలు నిర్ణయిస్తారంటూ రవిశాస్త్రికి క్లాస్ తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖులతో కూడిన సమావేశంలో ఇది చోటు చేసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
భారత మీడియా సొంత ఆటగాళ్లనే పదేపదే విమర్శలకు గురి చేస్తోందంటూ సమావేశంలో రవిశాస్త్రి పరోక్షంగా బయటపెట్టాడట. ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత మీడియాకు, కెప్టెన్ విరాట్ కోహ్లికి మధ్య జరిగిన మాటల వాగ్వాదాన్ని సీవోఏ ముందుంచాడని, ఈ క‍్రమంలోనే ఇదే అత్యుత్తమ పర్యాటక జట్టు అంటూ మరోసారి సీఓఏకి చెప్పే యత్నం చేశాడని సదరు అధికారి పేర్కొన్నారు. అయితే ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రదర్శన గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలంటూ కౌంటర్ ఇచ్చినట్లు అధికారి తెలిపారు. ‘ఓవరాల్‌గా ప్రపంచంలో అత్యుత్తమ జట్టుని ప్రజలు నిర్ణయిస్తారు. మీరు కాదని ఘాటుగానే హెచ్చరించారు’ అని తెలిపారు. అదే సమయంలో రవిశాస్త్రి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని సీఓఏ బృందం.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి చర్చను కొనసాగించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, సీఈఓ రాహుల్ జోహ్రీ, ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమీన్, (క్రికెట్ ఆపరేషన్)జనరల్ మేనేజర్ సబా కరీమ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, చీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment