న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌లో చెలరేగిన స్పాట్ ఫిక్సింగ్ వివాదం సంచలనం సృష్టించింది. ఇందులో నిందితులుగా తేలిన ముగ్గురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేధం విధించగా... మరి కొందరిపై కోర్టు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండేళ్ల నిషేధానికి గురి కావడంతో పాటు రాజ్ కుంద్రా, గురునాథ్ మెయప్పన్‌లను క్రికెట్ కార్యకలాపాల నుంచి పూర్తిగా వెలివేశారు. అయితే నాడు ఈ వివాదంపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఒక నివేదిక సమర్పించి ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న 9 మంది ఆటగాళ్ల పేర్లను ఒక సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. కానీ వేర్వేరు కారణాలతో ఇప్పటి వరకు ఆ కవర్‌ను కోర్టు విప్పలేదు. ఇప్పుడు తాజాగా క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) దీనిపై మళ్లీ దృష్టి పెట్టింది. ఆ సీల్డ్ కవర్‌ను తెరచి ఆటగాళ్ల పేర్లను బయట పెట్టాలని ప్రత్యేకంగా కోరింది. క్రికెట్ నుంచి ఫిక్సింగ్ పూర్తిగా తొలగిపోయే దాకా ఐపీఎల్‌ను కూడా ఆపేయాలంటూ అతుల్ కుమార్ అనే వ్యక్తి వేసిన రిట్ పిటిషన్‌పై సమాధానమిస్తూ సీఓఏ ఈ విజ్ఞప్తి చేసింది. ‘జస్టిస్ ముద్గల్ కమిటీ సమర్పించిన పేర్ల జాబితా సీల్డ్ కవర్ రూపంలో మీ వద్దే ఉంది. దానిని తెరచి అందులో ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకోండి. అలా చేస్తే ఫిక్సింగ్‌కు పాల్పడేవారికి బలమైన సందేశం ఇవ్వడంతో పాటు హెచ్చరికలా కూడా పని చేస్తుంది’ అని కమిటీ పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.
ఆధారాలు లభించలేదు!
మరోవైపు నాటి ముద్గల్ కమిటీలో సభ్యుడిగా ఉన్న బీబీ మిశ్రా తగిన ఆధారాలు లేకపోవడం వల్లే స్పాట్ ఫిక్సింగ్ వివాదం విచారణను పూర్తి చేయలేకపోయామని వెల్లడించారు. ముఖ్యంగా క్రికెటర్లు, బుకీలకు మధ్య సంబంధాలను చూపించేందుకు సరైన సాక్ష్యాలు తమకు దొరకలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక అగ్రశ్రేణి క్రికెటర్‌కు బుకీలతో సంబంధం ఉందనే విషయం నాకు తెలిసిందనేది నిజం. అయితే నాకు దానికి సంబంధించిన ఆధారం లభించలేదు. మాకు కావాల్సినంత సమయం అందుబాటులో ఉన్నా సదరు బుకీ ఎలాంటి సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. దాంతో విచారణ నిలిపేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. అతను మొదట్లో సాక్ష్యాలు ఇచ్చేందుకు సిద్ధపడినా... ఆ తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఇందులో ఉన్నారని, తన ప్రాణాలు కూడా పోతాయని చెప్పి వెనక్కి తగ్గాడు. విచారణలో భాగంగా నాకు సమాచారం ఉన్న క్రికెటర్ ఒక్కడినే కాకుండా అనేక మంది ఇతర క్రికెటర్లతో కూడా నేను మాట్లాడాను’ అని మిశ్రా స్పష్టం చేశారు. అయితే విచారణలో తనకు లభించిన సమాచారం మొత్తాన్ని ప్రస్తుతం బీసీసీఐ యాంటీ కరప్షన్ చీఫ్‌గా ఉన్న అజిత్ సింగ్‌తో పంచుకునేందుకు తాను సిద్ధమని ఆయన చెప్పారు.
ఆ 9 మంది క్రికెటర్ల పేర్లు బయటపెట్టండి
Published Sat, Nov 3 2018 1:38 AM | Last Updated on Sat, Nov 3 2018 1:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment