న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలను పెంచే విషయంలో ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ సీకే ఖన్నా స్పష్టం చేశారు. ప‍్రస్తుతం క్రికెటర్ల శాలరీ పెంపు అంశం చర్చల పరిధిలో మాత్రమే ఉందని వెల్లడించారు. దీనిపై త్వరలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో చర్చించాల్సి ఉందన్నారు. 'క్రికెటర్ల శాలరీ పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాబోవు సమావేశాల్లో జీతాల పెంపుకు సంబంధించి స్పష్టత వస్తుంది. ఎస్‌జీఎమ్‌లో బీసీసీఐ ఫైనాన్స్ కమిటీతో చర్చించిన తరువాత మాత్రమే తుది నిర్ణయం ఉంటుంది' అని సీకే ఖన్నా తెలిపారు.
ఇప్పటివరకూ బీసీసీఐ వార్షిక రెవెన్యూలో రూ. 180 కోట్లను క్రికెటర్లకు కేటాయిస్తుండగా, దానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చాలని పరిపాలకుల కమిటీ(సీఓఏ) యోచిస్తోంది. తద్వారా క్రికెటర్లకు ఇప‍్పుడు తీసుకుని వార్షిక జీతం మీద రెట్టింపు చేయాలనేది సీఓఏ ఆలోచన. దీనిలో భాగంగా ఇటీవల ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం సీఓఏతో సమావేశమైన కోహ్లి, ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు ఆటగాళ్ల శాలరీ పెంపుపై చర్చించారు. దీనికి సుముఖత వ్యక్తం చేసిన పరిపాలకుల కమిటీ బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఒకవేళ ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వార్షిక ఫీజు 100 శాతం పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment