
టీమిండియా సేవలకు ద్రవిడ్ దూరం
సీఓఏ చీఫ్ వినోద్ రాయ్
న్యూఢిల్లీ: వివాదాస్పద రీతిలో టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమితులైన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. భారత జట్టు విదేశీ పర్యటనలకు రాహుల్ ద్రవిడ్ అందుబాటులో ఉండటం లేదని ఆయన తెలిపారు. ‘ద్రవిడ్‌కు అండర్–19, భారత్ ‘ఎ’ జట్ల కోచ్‌గా రెండేళ్ల ఒప్పందం ఉంది. వచ్చే ఏడాది అండర్–19 ప్రపంచకప్, అలాగే కొన్ని ‘ఎ’ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జట్టు వెంట ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లే సమయం లేదు.
అయితే కోచ్ రవిశాస్త్రి సూచన మేరకు జట్టు జాతీయ క్రికెట్ శిబిరంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటారు’ అని వినోద్ రాయ్ వివరించారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) నేతృత్వంలో ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఆయన సహాయకులుగా ద్రవిడ్, జహీర్‌లను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే అధికారం కోచ్‌కే ఉంటుందని సీఓఏ కూడా తెలిపింది. ప్రస్తుతం జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్నా ద్రవిడ్ వెళ్లలేదు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత్ ‘ఎ’ జట్టుతో వెళ్లనున్నారు. అయితే బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ త్వరలోనే జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉందని వినోద్ రాయ్ తెలిపారు. ఆయనతో రవిశాస్త్రి టచ్‌లోనే ఉన్నారని, లంక పర్యటన ముగిశాక జట్టుతో చేరతాడని చెప్పారు.