
చేతి కర్రలతో ప్రాక్టీస్ పర్యవేక్షించిన రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్
జైపూర్: నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్... మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్... చేతి కర్రల సాయంతో జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇటీవల ఓ స్థానిక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రవిడ్ గాయపడ్డాడు. దీంతో కాలికి పట్టి, చేతి కర్రల సాయంతోనే మైదానానికి వచ్చిన ద్రవిడ్... ఆటగాళ్ల శిక్షణను పర్యవేక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేయగా... అది కాస్తా వైరల్‌గా మారింది.
గోల్ఫ్ కార్ట్‌లో మైదానంలోకి వచ్చిన ద్రవిడ్... ప్లేయర్ల ఆటతీరును పరిశీలించాడు. ఒక్కో ఆటగాడి దగ్గరికి వెళ్లేందుకు చేతి కర్రల సాయం తీసుకున్న ద్రవిడ్... చాలాసేపు వారి ఆటతీరును పరిశీలించాడు. కాలికి మెడికల్ వాకింగ్ బూట్ ధరించిన ద్రవిడ్... యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్‌తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు.
2022 నుంచి 2024 వరకు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్... గతేడాది టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తిరిగి రాజస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్‌గా కొనసాగుతుండగా... సంజూ సామ్సన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment