
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ త్రయం తమ పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో చాలా మందికి వీరు ముగ్గురూ ఆదర్శంగా నిలిచారు. అందులో ఒకడు టీమిండియా వెటరన్, రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్ నితీష్ రాణా. నితీష్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. సౌరవ్ గంగూలీని ఎక్కువగా ఆరాధిస్తానని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ బాగా ఆడితే తన చిన్నతనంలో ఓ గదిలోకి వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉండేవాడినని రానా వెల్లడించాడు.
"మా నాన్న సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని. నాకు సౌరవ్ గంగూలీ అంటే చాలా ఇష్టం. నా తమ్ముడు రాహుల్ ద్రవిడ్ సార్ ఫ్యాన్. భారత్ మ్యాచ్ ఆడినప్పుడల్లా మా ఇంట్లో గొడవలు జరిగేవి. మా ముగ్గురిలో ఎవరో ఒకరు బాధపడాల్సి వచ్చేది. ఎందుకంటే మాకు ఇష్టమైన ముగ్గురు క్రికెటర్లు ఒకే మ్యాచ్‌లో రాణించడం చాలా అరుదుగా జరిగేవి.
గంగూలీ బాగా ఆడితే సచిన్ సర్ ఫెయిల్ అయ్యేవారు. అప్పుడు మా నాన్న బాధపడేవారు. ఒకవేళ సచిన్ సర్ ఆడి గంగూలీ ఫెయిల్ అయితే నేను ఫీల్ అయ్యేవాడిని. రాహుల్ సర్ ఓ దశలో దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడేవారు. దీంతో నా తమ్ముడికి చాలా గొడవలు జరిగేవి. మా నాన్నకు ఈ విషయాలు చెప్పేవాళ్లము కాదు. ద్రవిడ్ బాగా ఆడి గంగూలీ విఫలమైతే నేను రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని. గంగూలీ ఎందుకు ఇలా ఔటయ్యారని బాధపడేవాడిని. రాహుల్ ద్రవిడ్ మాత్రం సెంచరీల మీద సెంచరీలు చేసే వారు. నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి" అని ఫ్యాన్ కోడ్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా పేర్కొన్నాడు.
అయితే ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడే రాణా భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. ఇదే విషయంపై రాణా మాట్లాడుతూ.. "టీమిండియా తరపున నా అరంగేట్రం రాహుల్ సర్ హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడే జరిగింది. నిజంగా ఆ సమయంలో చాలా సంతోషంగా అన్పించింది. ఎవరు బాగా ఆడితే నేను బాధపడేవాడినో ఆయన నేతృత్వంలోనే భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టాను" అని అన్నాడు.
కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరపున రాణా ఆడుతున్నాడు. కాగా రాజస్తాన్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పనిచేస్తుండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బాగంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాణా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాణా కేవలం 36 బంతుల్లో 81 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: IND vs ENG: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు