అడ్డగోలుగా ఆప్కో విభజన
కాకినాడ: అసలే నాలుగేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన చేనేత రంగానికి రాష్ర్ట విభజన శాపంలా మారింది. విభజన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆప్కో సంస్థను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది కార్మికుల పొట్టకొడుతోంది. సహకార సంఘాల చట్టం ప్రకారం ఏర్పడిన ఆప్కోను ప్రభుత్వ ఆస్తిలా అడ్డగోలుగా విడదీసేందుకు యత్నిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సొసైటీగా ఏర్పడిన ఆప్కో ప్రభుత్వ సంస్థ కాదు కదా కనీసం ప్రభుత్వరంగ సంస్థ కూడా కాదు. అలాంటి ఆప్కోను తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకోసం ఉద్దేశించిన బిల్లులో ప్రభుత్వ సంస్థగా పరిగణిస్తూ 9వ షెడ్యూల్‌లో 52వ అంశంగా పేర్కొన్నారు. సహకార సంఘాల చట్టం ప్రకారం ఆప్కోను వేరుచేయాలంటే ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ సిఫార్సు మేరకు మహాజన సభ ఆమోదం పొందాలి. అప్పుడు కానీ వేరు చేయడానికి వీల్లేదు. లేదా ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆప్కో ఏర్పడినందున ఆప్కోను పూర్తిగా 13 జిల్లాలకు పరిమితం చేస్తూ మిగిలిన 10 జిల్లాలకు కొత్త సంఘాన్ని రిజిస్టరు చేయించాలి.
అలాచేస్తే తెలంగాణ లో ఆప్కో పేరిట ఉన్న ఆస్తులేవీ కొత్త సంఘానికి బదిలీ కావు. తెలంగాణ పాలకుల ఒత్తిడి మేరకు సొసైటీ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన ఆప్కోను రాష్ర్ట ప్రభుత్వ సంస్థల జాబితాలో చేరుస్తూ తెలంగాణ బిల్లులో పేర్కొన్నా సీమాంధ్ర ప్రజాప్రతినిధులుగానీ, చేనేత సంఘాల ప్రతినిధులుగానీ పట్టించుకోలేదు. వీరి ఉదాసీన వైఖరి నూతన ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు మారింది.
తెలంగాణకు కొత్త పాలవకర్గం ఏర్పాటుకు యోచన
13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కోకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్నే కొనసాగించి, తెలంగాణ ప్రాంత పరిధిలో ఉన్న డెరైక్టర్లతో కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి వారికి ఆ పరిధిలో ఉన్న ఆప్కో ఆస్తులపై పెత్తనాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. జనాభా ప్రాతిపదికన 58 : 42 నిష్పత్తిలో ఆప్కో ఆస్తుల పంపకం చేయాలని నిర్ణయించారు. ఆప్కో పరిధిలో ప్రస్తుతం చేనేత సహకార సంఘాలు, ఊలు సంఘాలు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 999 సంఘాలున్నాయి. వీటిలో అత్యధికంగా 732 సంఘాలు సీమాంధ్రకు చెందినవి. తెలంగాణ లో 267 సంఘాలు మాత్రమే ఉన్నాయి.
సంఘాల ప్రాతిపదికన విభజిస్తే 73:27 నిష్పత్తిలో ఆప్కో ఆస్తుల పంపకాలు జరగాలి. సీమాంధ్రలో 2.20 లక్షల మంది చేనేత కార్మికులుండగా (చేనేత మగ్గాలు) తెలంగాణలో 48 వేలమంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఆప్కోకు స్థిరాస్తులు (స్థలాలు, భవనాలు) సుమారు రూ.11 కోట్లకు పైగా ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ ఏడెనిమిది రెట్లు అధికమని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్కెట్ ఇన్‌సెంటివ్ స్కీం ద్వారా ఆప్కోకు వచ్చే నిధుల పంపకంలో కూడా భారీగా కోత పడుతుందని ఆంధ్ర ప్రాంత చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు 2011-12లో కేంద్ర ప్రభుత్వం నుంచి మార్కెట్ ఇన్‌సెంటివ్ స్కీం ద్వారా ఆప్కోకు సుమారు రూ.8.35 కోట్లు వచ్చాయి. 2012 నుంచి 2014 వరకు ఈ స్కీం ద్వారా నిధులు రాలేదు.
ఈ రెండేళ్లకు సుమారుగా రూ.25 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సహకార సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఆప్కోను 58 : 42 నిష్పత్తి ప్రకారం విభజిస్తే సీమాంధ్ర వాటాగా రూ.13 కోట్లు మాత్రమే వస్తాయి. సంఘాల ప్రాతిపదికన లెక్కేస్తే సీమాంధ్ర సంఘాలకు రూ.20 కోట్ల వరకు వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే మార్కెట్ ఇన్‌సెంటివ్ రూపంలో కేవలం రెండేళ్లకే ఏడు కోట్లు నష్టపోతుంటే, ఇక ఆస్తుల పంపకాల్లో ఎంత నష్టపోతున్నామో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
సీమాంధ్రకు తీరని అన్యాయం
ఆప్కోను విభజించడమే అన్యాయం. ఒకవేళ విభజించాల్సి వచ్చినా 58 : 42 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవడంతో సీమాంధ్రలో ఆప్కోకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. అదే సందర్భంలో తెలంగాణ లో మిగులు బడ్జెట్ ఉంటుంది. 23 జిల్లాల ఆప్కోను అడ్డగోలుగా విభజించాలని కేంద్రం చూస్తుంటే ఆప్కో పాలకవర్గం మాత్రం మౌనంగా ఉండడం దురదృష్టకరం.
- దొంతంశెట్టి విరూపాక్షం, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు