ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: తరాలు మారినా చేనేత కార్మికుల జీవనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మగ్గం గుంతల్లోనే మగ్గుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి చేనేత కార్మికునితోపాటు ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా పనిచేసినా జీవనం సాగించడం దుర్భరంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు అమలు చేసినా వీరిని మాత్రం ఆదుకోవడం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కుటుంబాలకు ఉపాధిని కల్పించే నిమిత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005-06 సంవత్సరంలో అపెరల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
గోపవరం పంచాయతీ పరిధిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 71.17 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతోపాటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అపెరల్ పార్కు ఏమాత్రం చేనేత కార్మికులకు ఉపయోగపడటం లేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 50వేల మంది చేనేత వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. దాదా పు 20వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత కార్మికుడు నివాసం ఉండని ప్రాంతం లేదు. ప్రతి కార్మికునిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. భార్యాభర్తలతోపాటు వారి సంతానం కూడా చేనేత కార్మికులకు చేదోడు వాదోడుగా నిలవాల్సి వస్తోం ది. ఇంత చేసినా కడుపు నిండటం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరులో అపెరల్ పార్కు నిర్మాణం చేపట్టాలని నిర్ణయిం చారు. ఈ ప్రాజెక్టును ఏపీఐఐసీ అధికారులకు అప్పగించడంతో వారు భూసేకరణ చేయడంతోపాటు రోడ్ల నిర్మా ణం పూర్తి చేశారు. దీనికోసం రూ.5కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇంతటితోనే ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది.
నిబంధనల ప్రకారం రోడ్లు నిర్మించిన తర్వాత రంగుల అద్దకం, శిల్క్ యూనిట్లు, టెస్టింగ్ యూనిట్లు, వస్త్రాల తయారీ, పవర్ లూమ్స్ తదితర చేనేత రంగానికి సంబంధించిన అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉం ది. అయితే వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు పూర్తిగా నీరుగారిపోయింది.
2005-06లో ప్రాజెక్టు మంజూరైనా ఇంతవరకు యూనిట్ల ఏర్పాట్లు జరగలేదు. నిధుల లేమి సమస్యల కారణంగా మరింత జాప్యం జరుగుతోంది. దీంతో స్థలంలో పిచ్చిమొక్కలు మొలిచాయి. వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అపెరల్ పార్కు నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు.. తమకు ఉపాధి లభించేదెప్పుడు అని చేనేత కార్మికులు నిట్టూరుస్తున్నారు.