విత్తు లేదు... ‘విత్తం’ రాదు! | No loans from banks for Karrif season of ruby crops | Sakshi
Sakshi News home page

విత్తు లేదు... ‘విత్తం’ రాదు!

Published Sat, Sep 26 2015 2:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

విత్తు లేదు... ‘విత్తం’ రాదు! - Sakshi

విత్తు లేదు... ‘విత్తం’ రాదు!

రబీ సాగుకు చర్యలు చేపట్టని సర్కారు
వర్షాభావంతో దెబ్బకొట్టిన ఖరీఫ్.. రబీపైనే అన్నదాత ఆశలు
‘ముందస్తు రబీ’కి అంతా సిద్ధం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
రెండింతల సాగుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటన
మరో వారంలో ప్రారంభంకానున్న రబీ సీజన్
విత్తన సరఫరాలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం
అప్పులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు
పూర్తి రుణమాఫీ చేయలేదని కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకులు
వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి
 
 - ఖరీఫ్ రుణ లక్ష్యం (రూ. కోట్లలో) 18,000
- బ్యాంకర్లు ఇచ్చింది (రూ. కోట్లలో) 7,000
- అవసరమైన విత్తనాలు (క్వింటాళ్లలో) 3,80,000
- ప్రభుత్వం సిద్ధం చేసింది (క్వింటాళ్లలో) 40,000
 
సాక్షి, హైదరాబాద్: ఇటు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు... వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేసి పెట్టుబడి తెచ్చుకున్నా అటు విత్తనాలు లేవు... ఎరువులు వస్తాయో రావో తెలియదు... ఖరీఫ్ నిండా ముంచిన ఆవేదనలో ఉన్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం మరో శాపంగా మారుతోంది. ఖరీఫ్ దెబ్బను తట్టుకోవడానికి రబీ సాగును భారీగా పెంచుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. మరో వారంలో రబీ సీజన్ మొదలుకానున్నా వ్యవసాయశాఖ ఇంకా సన్నద్ధమే కాలేదు. రైతులకు విత్తనాలను సమకూర్చలేదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించేలా గట్టి ప్రయత్నమూ జరగడం లేదు. పంట రుణమాఫీ సొమ్ము రెండు వాయిదాలు చెల్లించినా... పూర్తిగా చెల్లించేవరకూ రుణాలివ్వబోమని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు.
 
 బ్యాంకుల మొండిచెయ్యి: అసలే వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నిర్దేశించుకున్న రుణ మంజూరుకు దూరంగా ఉండిపోతున్నాయి. బ్యాంకులను ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. 2015-16 ఖరీఫ్‌కు రూ.18,032 కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకోగా... ఇచ్చింది రూ.7 వేల కోట్లే. ఇక పంట రుణమాఫీ అర్హులకు రుణాలు ఇచ్చేం దుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. మొత్తం 36 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందగా... తిరిగి బ్యాంకు రుణాలు అందింది 15 లక్షల మందికే. వారిలోనూ ఎక్కువ మంది బంగారం తనఖా పెట్టి రుణం తీసుకున్నారని బ్యాంకర్లే చెబుతున్నారు. మిగతా 21 లక్షల మంది వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ‘ప్రభుత్వం హామీ ఇచ్చినంత మాత్రాన రైతులు తీసుకున్న రుణం మాఫీ అయినట్టు కాదు. మి గతా రెండు విడతల బకాయిలు చెల్లిస్తే తప్ప రుణాలు ఇవ్వకూడదని ఆదేశాలున్నాయి. లీడ్ బ్యాంకు సూచనల మేరకు ముందుకు వెడుతున్నాం..’ అని ఆంధ్రా బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
 నిలువు దోపిడీ..
 బ్యాంకులు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీ పెరిగిపోయింది. వందకు రూ.4 నుంచి 6 రూపాయల దాకా వడ్డీ వసూలు చేసుకునే అవకాశం ఉండటంతో ఆర్థికంగా కలిగిన కుటుంబాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ‘వ్యాపారం’ మొదలుపెడుతున్నారు. భూమి పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని అప్పులు ఇస్తున్నారు. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ‘‘మా బ్యాంక్ నుంచి నిత్యం వంద మంది రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు చెక్కులు జారీ చేస్తున్నారు. ఆ రైతులు బ్యాంకుకు వచ్చినప్పుడు అడిగితే 5 రూపాయల వడ్డీ అని చెబుతున్నారు. వారికి రుణాలు ఇచ్చేందుకు మాకేమో అనధికార ఆంక్షలున్నాయి..’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ బ్యాంక్ అధికారి పేర్కొనడం గమనార్హం.
 
 మరోవైపు రైతులు వ్యవసాయంతో పాటు ఇతర అవసరాల కోసం కూడా బ్యాంకు కొంత అదనంగా రుణాలు తీసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ప్రతీదానికి వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. ఆ అప్పులు, వడ్డీలు తీర్చలేకే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు సుమారు రూ.6 వేల కోట్ల దాకా వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నట్లు బ్యాంకర్ల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వడ్డీ వ్యాపారులు గ్యారెంటీ కోసం చెక్కుల ద్వారానే రుణాలు ఇస్తున్నారని, అందువల్ల ఈ అంచనాకు రాగలిగామని ఎస్‌బీహెచ్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
 
విత్తనాలు, ఎరువులేవీ?
ఖరీఫ్‌లో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రబీలోనైనా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం భావించింది. గతేడాది రబీలో 12.37 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా... ఈసారి రబీలో 20.45 లక్షల ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా పెంచాలని, నూనె గింజలను గతేడాది 4.62 లక్షల ఎకరాల్లో సాగుచేయగా... ఇప్పుడు 6.57 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఇందుకు తగినట్లుగా విత్తనాల సరఫరా లేదు.

రబీ కోసం అన్నిరకాల విత్తనాలు కలిపి 3.80 లక్షల క్వింటాళ్ల వరకు అవసరమని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నా... అందులో 40 వేల క్వింటాళ్లు (10.52%) మాత్రమే సిద్ధంగా ఉంచినట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఇక ఎరువులదీ అదే పరిస్థితి. రబీలో 16.20 లక్షల టన్నుల ఎరువులు కావాలని కేంద్రాన్ని కోరడమే తప్ప.. ఇప్పటిదాకా సాధించింది చాలా తక్కువ. యూరియా కొరతను సృష్టించేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే నిల్వలు పెంచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement