అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు! | farmers will suffer bank loans | Sakshi
Sakshi News home page

అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు!

Published Mon, Jun 29 2015 1:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు! - Sakshi

అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు!

* సాగు 40 శాతం.. బ్యాంకుల రుణాలు 4 శాతం
* గత్యంతరం లేక వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
* ఇప్పటికే 3 వేల కోట్ల రూపాయల మేర ప్రైవేటు అప్పులు

* బ్యాంకులకు రుణమాఫీ రెండో విడత సొమ్ము చెల్లించని ప్రభుత్వం
* గత మాఫీలో అవకతవకలు తేలాకే చెల్లింపులంటూ క్షేత్రస్థాయిలో విచారణ
* సర్కారు నుంచి నిధులందకపోవడంతో రైతు రుణాలకు బ్యాంకుల విముఖత
* రూ. 30,995 కోట్ల రుణ లక్ష్యంలో ఇప్పటిదాకా విదిల్చింది రూ. 1,200 కోట్లే!

 
సాక్షి, హైదరాబాద్: రైతన్న ఎప్పట్లాగే మళ్లీ అప్పుల ఊబికి దగ్గరవుతున్నాడు! కాలం కలిసి వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులు చూస్తున్నాడు. బ్యాంకు రుణాలపై ఆశలు సన్నగిల్లడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. తెలంగాణలో ఇప్పటివరకు పంటల సాగు 40 శాతానికి చేరుకున్నా.. బ్యాంకు రుణాలు 4 శాతాన్ని మించలేదు. సర్కారు వైపు నుంచి కూడా బ్యాంకులపై ఒత్తిడి లేకపోవడంతో రైతులకు ఆశించిన మేర రుణాలు అందడం లేదు. ఫలితంగా అన్నదాతలు ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ప్రైవేటు అప్పులు చేసినట్టు తెలుస్తోంది.
 
 ఈసారి రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. వాతావరణ శాఖ నివేదికలకు భిన్నంగా మొదటి దశలో అనేక చోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. జూన్ 25 నాటికి రాష్ట్రంలో 40 శాతం పంటల సాగు జరిగింది. ఇంతటి కీలక సమయంలో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ రుణాలను బ్యాంకులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ కింద ప్రభుత్వం రెండో విడత బకాయిలు చెల్లించనందున రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. రెండో విడత సొమ్ము విడుదల చేయకుండా ప్రభుత్వం.. గత ఏడాది ఇచ్చిన రుణమాఫీలో అవకతవకలు జరిగాయంటూ  క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తోంది. ఈ కారణంగా రుణాలు మంజూరు చేయడంలో జాప్యం తప్పడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి.
 
రూ.1,200 కోట్లు దాటని రుణాలు
రాష్ట్రంలో ఈసారి 1.03 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. తెలంగాణలో సన్న, చిన్నకారు, మధ్య తరహా, ధనిక రైతులు 55.53 లక్షల మంది ఉన్నారు. అందులో సన్న, చిన్నకారు రైతులు 47.68 లక్షల మంది, మధ్య తరహా రైతులు 7.69 లక్షల మంది ఉన్నారు. వీరిలో అధికంగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడతారు. గతేడాది లెక్కల ప్రకారం 35.82 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈసారి వ్యవసాయ సీజన్ ఆశాజనకంగా ఉండటంతో రుణాలు తీసుకునే రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఈ ఏడాది రూ.30,995 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో రైతుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు మాత్రం ఇప్పటి వరకు రూ.1,200 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. అంటే మొత్తం లక్ష్యంలో కేవలం 3.87 శాతం మాత్రమే! సాగు విస్తీర్ణం మాత్రం 40 శాతం దాకా ఉంది. ఒక్క పత్తి సాగే 54 శాతం జరిగింది.
 
 ఇంత మొత్తంలో సాగు విస్తీర్ణం ఉన్నా.. బ్యాంకు రుణాలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయి. సర్కారు, బ్యాంకులు కలిసి మొండిచేయి చూపడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు రూ.3 వేల కోట్లకు పైగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. కేరళకు చెందిన ఓ బంగారు తాకట్టు సంస్థ తన వ్యాపారాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. బ్యాంకులు ఆలస్యంగా అప్పులు ఇస్తాయని తెలుసుకున్న ఈ సంస్థ రైతులను ఆకర్షించేందుకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ సంస్థ ఒక్కటే రైతుల దగ్గర్నుంచి ఆభరణాలు కుదువ పెట్టుకుని రూ.1,500 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం.
 
 అక్రమాలు వెలికి తీశాకే రుణమాఫీ!
రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలకు ముందు సర్కారు అనేక మెలికలు పెడుతోంది. మొదటి విడత విడుదల చేసిన సొమ్ములో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం అందిందని ఆర్థికశాఖ ఇటీవల వెల్లడించింది. మొదటి విడతలో ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న అంశంపై జిల్లాల్లో నిఘా బృందాలు గాలిస్తున్నాయి.
 
 అనర్హులు ఎంతమంది రుణమాఫీ పొందారో పరిశీలన చేస్తున్నాయి. బోగస్ రైతులుంటే తొలగించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 30లోగా తమ పనిని పూర్తి చేయాలని నిఘా బృందాలకు సూచించింది. గత ఏడాది క్షుణ్ణంగా పరిశీలించి రుణమాఫీ అమలు చేశారు. ఎమ్మార్వో ధ్రువీకరణ ఇచ్చాకే సంబంధిత రైతులకు రుణమాఫీని వర్తింపచేశారు. మళ్లీ ఇప్పుడు అక్రమాలు.. తనిఖీలంటూ కొత్తగా చేయడం సరికాదని వ్యవసాయశాఖ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. కీలకమైన సీజన్‌లో రైతులను ఆదుకోవాల్సింది పోయి నిఘా బృందాలతో బ్యాంకుల్లో పరిశీలన చేయించడం దారుణమని అంటున్నారు.  
 
 వడ్డీలకు తెచ్చుకుంటున్నాం
పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. రుణమాఫీకి సంబంధించి ఈ ఏడాది ఇప్పటి దాకా ఖాతాలో జమ చేయలేదు. బ్యాంకుకు వెళ్తే డబ్బులు జమ కాలేదంటున్నారు. చేసేది లేక పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారుల వద్దకు పరుగెడుతున్నాం.
 - రాముడు, గట్టు, మహబూబ్‌నగర్
 
 బ్యాంకు రుణాలు ఇవ్వలేదు
 నాకు మూడెకరాల పొలం ఉంది. పత్తి, నారుమళ్లను సిద్ధం చేసుకున్నాం. బ్యాంకుకు వెళ్తే రుణాలు ఇవ్వడం లేదు. ఈ నెలాఖరు వరకు రెన్యూవల్ చేసుకోని రైతులకు అవకాశం ఉండదని చెబుతున్నారు. కొత్త రుణాలను ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. వడ్డీకి అప్పులు తెచ్చుకొని పంటలు సాగుచేస్తున్నా.    
 - సాయన్న, ధరూరు, మహబూబ్‌నగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement