Banks Loans
-
అత్యవసర రుణ హామీ పథకంపై కేంద్రం ఆర్ధిక శాఖ రివ్యూ!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు, టాప్–4 ప్రైవేటు రంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ బ్యాంకుల అధినేతలకు కబురు పంపింది. కరోనా సమయంలో అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. లాక్డౌన్లతో దెబ్బతిన్న వ్యాపార సంస్థలకు రుణ సాయం ద్వారా ఆదుకోవడం ఈ పథకం ఉద్దేశ్యం. దీని పురోగతిని సమావేశంలో సమీక్షించనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే, కరోనా వల్ల ప్రభావితమైన రంగాలకు రుణ హామీ పథకం (ఎల్జీఎస్సీఏఎస్)ను సైతం సమీక్షించనున్నట్టు తెలిపాయి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్ జోషితోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల సీఈవోలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాక్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈసీఎల్జీఎస్ కింద హామీ లేని రూ.4.5 కోట్ల వరకు రుణాలను బ్యాంకులు మంజూరు చేయవచ్చు. -
స్థిరాస్తి ప్రాజెక్టులపై ‘రెరా’ కన్ను
సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అన్ని వర్గాల వారు దీనిని సమకూర్చుకోవాలనుకుంటారు. అయితే, కొన్న ఫ్లాట్లకు ప్రభుత్వ అనుమతులు లేకుంటే బ్యాంకు రుణాలు రావు.. అలాగే, ఓపెన్ ప్లాట్ అయితే నిర్మాణానికి స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరి. ఈ రెండు రకాల అనుమతులు ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) బాధితులకు అండగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్లాట్లు, బహుళ అంతస్తుల నిర్మాణలు చేపట్టే కంపెనీలు లేదా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో రిజిస్టర్ చేయించాలని, లేదంటే వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది. రెరాలో నమోదైనవి 2,900 ప్రాజెక్టులే.. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచిగాని, మున్సిపాలిటీలు, టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచిగాని ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. సదరు సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇలాంటి వాటిలో స్థలాలు, ఫ్లాట్లు కొనేవారికి రక్షణ ఉండదు. ఇవిగాక మున్సిపాలిటీలు, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు దాదాపు ఏడువేలకు పైగా ఉన్నట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ ‘రెరా’ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో ‘రెరా’ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2,900 ప్రాజెక్టులు మాత్రమే ‘రెరా’లో నమోదయ్యాయి. ఈ ప్రాధికార సంస్థ అనుమతిలేకుంటే ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్మాణదారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా తమ ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించకుంటే ‘రెరా’ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం 10 శాతం వరకు పెనాల్టీ విధిస్తామని ‘రెరా’ పాలకవర్గం ప్రాజెక్టుల యజమానులకు సమాచారం పంపిస్తోంది. అప్పటికీ స్పందించకుంటే అలాంటి ప్రాజెక్టుల వివరాలను బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి వాటి రుణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారులకు నష్టం జరగకుండా.. కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలుకు వెళ్తే.. అన్ని అనుమతలు ఉన్నాయని, స్థానిక సంస్థల నుంచి, టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి ఉన్నట్లు చెబుతారు. వీటితో పాటు రెరాలో రిజిస్టర్ అయ్యిందో లేదో చూసుకోవాలి. 500 చ.మీ. విస్తీర్ణంలో దాటిన వెంచర్లు, డెవలపర్లు నిర్మించే ఫ్లాట్ల సంఖ్య 8 మించి ఉంటే తప్పనిసరిగా ‘రెరా’లో నమోదు చేయించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి పనుల పురోగతిని ‘రెరా’లో నమోదు చేయాలి. అలా చేయని పక్షంలో ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో ఉంచే అధికారం ‘రెరా’కు ఉంది. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా నిర్మాణం లేకున్నా.. మరేదైనా పెద్ద లోపాలు తలెత్తినా ఐదేళ్ల వరకు సదరు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ఐదేళ్ల వరకు నిర్మాణంలో తలెత్తే పెద్ద సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు బిల్డరుదే. ఆయా సమస్యలపై కొనుగోలుదారులు ‘రెరా’కు ఫిర్యాదు చేయవచ్చని పాలక మండలి చెబుతోంది. -
కొత్తగా బ్యాంక్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్
మీరు ఇప్పటివరకు ఎప్పుడు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేదా?. కొత్తగా మీకు రుణాలు ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ లేని కారణంగా ఆలోచిస్తున్నాయా?. అయితే మీకు శుభవార్త. సాధారణంగా బ్యాంకులు సీబీల్ స్కోర్ ఆధారంగా వినియోగదారులకు రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే మొదటిసారిగా లేదా కొత్తగా ఎవరైనా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే వారికి ఎలాంటి క్రెడిట్ స్కోర్ ఉండకపోవడంతో బ్యాంకులు కాస్త వెనకడుగు వేస్తుంటాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి క్రెడిట్ స్కోరు, లోన్ హిస్టరీ లేని వారికి గురించి అంచనా వేసేందుకు వీలుగా క్రెడిట్ విజన్ న్యూ టు క్రెడిట్(ఎన్టీసీ) స్కోరు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెల్లడించింది.ఈ ఎన్‌టీసీతో వినియోగదారులకు లోన్ ఇవ్వొచ్చా? లేదా అని నిర్ణయించడం బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు సులభతరం కానుంది. ఈ కొత్త స్కోర్ ను రుణ గ్రహీత గురించి అందుబాటులో ఉన్న వివిధ సమాచారం ఆధారంగా నిర్ణయించనున్నారు. క్రొత్త అసెస్మెంట్ లేదా స్కోరింగ్ మోడల్‌ను క్రెడిట్ విజన్ అని పిలుస్తారు. క్రెడిట్ విజన్ స్కోర్ 101-200 వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం ఇవ్వడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే సదరు వ్యక్తి లోన్ తిరిగి చెల్లించకపోవడానికి అవకాశం ఉంటుందని బ్యాంకులు భావిస్తాయి. ఈ స్కోర్ కొత్తగా లోన్ తీసుకునే వారికి కీలకంగా మారనుంది. క్రెడిట్ సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది. చదవండి: Flipkart: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ -
పేదల పట్టాలపై.. రాజకీయాలేలా?
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నందిగాం: నకిలీ పట్టాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారిలో టీడీపీ వారు ఉన్నారని స్వయంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడే ఇటీవల అంగీకరించారు! ఎంతటివారినైనా వదలబోమనీ చెప్పారు. ఇది నాణేనికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు టీడీపీలోని అక్రమార్కులను పక్కనబెట్టి తమను ఇక్కట్లు పాల్జేసే కార్యక్రమం సాగుతోందని పట్టాదారులైన పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలతోనే జారీ చేసిన పాసు పుస్తకాలు ఇప్పుడెలా చెల్లకుండా పోతాయో తమకు అర్థం కావట్లేదంటూ వాపోతున్నారు. ఎన్నికల వాగ్దానాల అమల్లో తమ వైఫల్యాలను, ప్రభుత్వ పథకాల్లో దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే అధికార పార్టీ నాయకులు ‘కొండతెంబూరు’ డి పట్టాల వ్యవహారాలను తెరపైకి తెచ్చారని, అధికారుల దర్యాప్తులో తమ్ముళ్ల అక్రమాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు కేవలం తమను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేయిస్తున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. కథ అడ్డం తిరగడంతో అధికార పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారని, ఏదోఒక రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపై నెపం నెట్టేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నారుు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలోని కొండతెంబూరు గ్రామ పరిధి సర్వే నంబరు 29లోని కొండపై కొంత మంది అక్రమంగా డి.పట్టాలు పొందారంటూ గతంలోనే పలుమార్లు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కొండ పరిధిలో పట్టాలు పొందిన 123 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ పట్టాదారుల్లో కణితూరు, కొండతెంబూరు, దేవుపురం తదితర గ్రామాలకు చెందిన పేదలు ఉన్నారు. వారు తమ వద్దఉన్న ఆధారాలను ఇప్పటికే రెవెన్యూ అధికారులకు చూపించారు. వివరణలు కూడా ఇచ్చారు. మరోవైపు డి పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంపై విజిలెన్స అధికారులు బ్యాంకులకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. దీంతో నకిలీ డి.పట్టాలతో రుణాల వ్యవహారంలో టీడీపీ కార్యకర్తల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిని తప్పించేందుకు, అలాగే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇరికించేందుకు మంత్రి అనుచరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. పదేపదే తనిఖీలు ఐదుగురు తహసిల్దారులతో కూడిన అధికారుల బృందం శనివారం కణితూరు గ్రామంలో విచారణ ప్రారంభించింది. పట్టాదారులను పిలిపించుకొని వారివద్దనున్న ఆధారాలను పరిశీలించారు. పలువురు పేదలు తమవద్దనున్న పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు చూపించారు. వాటిని తమకు 2009లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర హయాంలో రెవెన్యూ అధికారులు మంజూరు చేశారని చెప్పారు. డి పట్టాలపై రుణాలు మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అప్పటి నుంచి రుణాలు తీసుకొంటూ సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నామని పేదలైన లబ్దిదారులు వాపోతున్నారు. తాము అక్రమంగా పట్టాలు పొందినట్టు అధికార పార్టీకి చెందిన నాయకులు తమను రాజకీయ కారణాలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాగే కొనసాగిస్తే న్యాయం కోసం కోర్టులను ఆశ్రరుుంచడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు. తలపట్టుకుంటున్న రెవెన్యూ అధికారులు ప్రత్యర్థి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తేవడంతో చివరకు రెవెన్యూ అధికారుల బృం దం విచారణ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తీరా విచారణలో పట్టాదారుల వద్దనున్న పాసు పుస్తకాలపై తహసీల్దారు, ఆర్డీవో సంతకాలు ఉండటంతో తనిఖీ బృందం కం గుతింది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొండతెంబూరులోనే కాకుండా బడబంద, సొంఠనూరు గ్రామాల పరిధిలోని కొండలపై పట్టాలు పొందిఉండటంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. -
పరిశ్రమల స్థాపనకు బ్యాంకులు రుణాలివ్వాలి
కాకినాడ రూరల్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వారికి బ్యాంకులు రుణాలు అందజేయాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్‌బాబు అన్నారు. ఏపీ పొల్యూషన్ బోర్డు కేంద్ర కార్యాలయంలో బ్యాంకు అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎన్నికై రుణాల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ బాగోకపోతే వాటిని మార్చి వేరే యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సహకరించాలే తప్ప రుణం ఇవ్వకపోవడం సరికాదని సురేష్ బాబు అన్నారు. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వాలని, లేకపోతే ఎందుకు రుణాలను తిరస్కరిస్తున్నారనే సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని 63 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నేబ్కాన్ మేనేజర్ కె.కృష్ణమోహన్, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏబీ పటేల్, ఇండస్ట్రియల్ టీమ్ హెడ్ కె.శ్రీహరి, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
విత్తు లేదు... ‘విత్తం’ రాదు!
⇒ రబీ సాగుకు చర్యలు చేపట్టని సర్కారు ⇒ వర్షాభావంతో దెబ్బకొట్టిన ఖరీఫ్.. రబీపైనే అన్నదాత ఆశలు ⇒ ‘ముందస్తు రబీ’కి అంతా సిద్ధం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ రెండింతల సాగుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటన ⇒ మరో వారంలో ప్రారంభంకానున్న రబీ సీజన్ ⇒ విత్తన సరఫరాలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ⇒ అప్పులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకులు ⇒ పూర్తి రుణమాఫీ చేయలేదని కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకులు ⇒ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి - ఖరీఫ్ రుణ లక్ష్యం (రూ. కోట్లలో) 18,000 - బ్యాంకర్లు ఇచ్చింది (రూ. కోట్లలో) 7,000 - అవసరమైన విత్తనాలు (క్వింటాళ్లలో) 3,80,000 - ప్రభుత్వం సిద్ధం చేసింది (క్వింటాళ్లలో) 40,000 సాక్షి, హైదరాబాద్: ఇటు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు... వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేసి పెట్టుబడి తెచ్చుకున్నా అటు విత్తనాలు లేవు... ఎరువులు వస్తాయో రావో తెలియదు... ఖరీఫ్ నిండా ముంచిన ఆవేదనలో ఉన్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం మరో శాపంగా మారుతోంది. ఖరీఫ్ దెబ్బను తట్టుకోవడానికి రబీ సాగును భారీగా పెంచుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. మరో వారంలో రబీ సీజన్ మొదలుకానున్నా వ్యవసాయశాఖ ఇంకా సన్నద్ధమే కాలేదు. రైతులకు విత్తనాలను సమకూర్చలేదు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించేలా గట్టి ప్రయత్నమూ జరగడం లేదు. పంట రుణమాఫీ సొమ్ము రెండు వాయిదాలు చెల్లించినా... పూర్తిగా చెల్లించేవరకూ రుణాలివ్వబోమని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. బ్యాంకుల మొండిచెయ్యి: అసలే వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నిర్దేశించుకున్న రుణ మంజూరుకు దూరంగా ఉండిపోతున్నాయి. బ్యాంకులను ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. 2015-16 ఖరీఫ్‌కు రూ.18,032 కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకోగా... ఇచ్చింది రూ.7 వేల కోట్లే. ఇక పంట రుణమాఫీ అర్హులకు రుణాలు ఇచ్చేం దుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. మొత్తం 36 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందగా... తిరిగి బ్యాంకు రుణాలు అందింది 15 లక్షల మందికే. వారిలోనూ ఎక్కువ మంది బంగారం తనఖా పెట్టి రుణం తీసుకున్నారని బ్యాంకర్లే చెబుతున్నారు. మిగతా 21 లక్షల మంది వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ‘ప్రభుత్వం హామీ ఇచ్చినంత మాత్రాన రైతులు తీసుకున్న రుణం మాఫీ అయినట్టు కాదు. మి గతా రెండు విడతల బకాయిలు చెల్లిస్తే తప్ప రుణాలు ఇవ్వకూడదని ఆదేశాలున్నాయి. లీడ్ బ్యాంకు సూచనల మేరకు ముందుకు వెడుతున్నాం..’ అని ఆంధ్రా బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నిలువు దోపిడీ.. బ్యాంకులు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీ పెరిగిపోయింది. వందకు రూ.4 నుంచి 6 రూపాయల దాకా వడ్డీ వసూలు చేసుకునే అవకాశం ఉండటంతో ఆర్థికంగా కలిగిన కుటుంబాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ‘వ్యాపారం’ మొదలుపెడుతున్నారు. భూమి పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని అప్పులు ఇస్తున్నారు. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ‘‘మా బ్యాంక్ నుంచి నిత్యం వంద మంది రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు చెక్కులు జారీ చేస్తున్నారు. ఆ రైతులు బ్యాంకుకు వచ్చినప్పుడు అడిగితే 5 రూపాయల వడ్డీ అని చెబుతున్నారు. వారికి రుణాలు ఇచ్చేందుకు మాకేమో అనధికార ఆంక్షలున్నాయి..’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ బ్యాంక్ అధికారి పేర్కొనడం గమనార్హం. మరోవైపు రైతులు వ్యవసాయంతో పాటు ఇతర అవసరాల కోసం కూడా బ్యాంకు కొంత అదనంగా రుణాలు తీసుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ప్రతీదానికి వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. ఆ అప్పులు, వడ్డీలు తీర్చలేకే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు సుమారు రూ.6 వేల కోట్ల దాకా వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నట్లు బ్యాంకర్ల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వడ్డీ వ్యాపారులు గ్యారెంటీ కోసం చెక్కుల ద్వారానే రుణాలు ఇస్తున్నారని, అందువల్ల ఈ అంచనాకు రాగలిగామని ఎస్బీహెచ్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. విత్తనాలు, ఎరువులేవీ? ఖరీఫ్‌లో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రబీలోనైనా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం భావించింది. గతేడాది రబీలో 12.37 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా... ఈసారి రబీలో 20.45 లక్షల ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా పెంచాలని, నూనె గింజలను గతేడాది 4.62 లక్షల ఎకరాల్లో సాగుచేయగా... ఇప్పుడు 6.57 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఇందుకు తగినట్లుగా విత్తనాల సరఫరా లేదు. రబీ కోసం అన్నిరకాల విత్తనాలు కలిపి 3.80 లక్షల క్వింటాళ్ల వరకు అవసరమని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నా... అందులో 40 వేల క్వింటాళ్లు (10.52%) మాత్రమే సిద్ధంగా ఉంచినట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఇక ఎరువులదీ అదే పరిస్థితి. రబీలో 16.20 లక్షల టన్నుల ఎరువులు కావాలని కేంద్రాన్ని కోరడమే తప్ప.. ఇప్పటిదాకా సాధించింది చాలా తక్కువ. యూరియా కొరతను సృష్టించేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే నిల్వలు పెంచుకుంటున్నారు. -
అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు!
-
అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు!
* సాగు 40 శాతం.. బ్యాంకుల రుణాలు 4 శాతం * గత్యంతరం లేక వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు * ఇప్పటికే 3 వేల కోట్ల రూపాయల మేర ప్రైవేటు అప్పులు * బ్యాంకులకు రుణమాఫీ రెండో విడత సొమ్ము చెల్లించని ప్రభుత్వం * గత మాఫీలో అవకతవకలు తేలాకే చెల్లింపులంటూ క్షేత్రస్థాయిలో విచారణ * సర్కారు నుంచి నిధులందకపోవడంతో రైతు రుణాలకు బ్యాంకుల విముఖత * రూ. 30,995 కోట్ల రుణ లక్ష్యంలో ఇప్పటిదాకా విదిల్చింది రూ. 1,200 కోట్లే! సాక్షి, హైదరాబాద్: రైతన్న ఎప్పట్లాగే మళ్లీ అప్పుల ఊబికి దగ్గరవుతున్నాడు! కాలం కలిసి వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులు చూస్తున్నాడు. బ్యాంకు రుణాలపై ఆశలు సన్నగిల్లడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. తెలంగాణలో ఇప్పటివరకు పంటల సాగు 40 శాతానికి చేరుకున్నా.. బ్యాంకు రుణాలు 4 శాతాన్ని మించలేదు. సర్కారు వైపు నుంచి కూడా బ్యాంకులపై ఒత్తిడి లేకపోవడంతో రైతులకు ఆశించిన మేర రుణాలు అందడం లేదు. ఫలితంగా అన్నదాతలు ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ప్రైవేటు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈసారి రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. వాతావరణ శాఖ నివేదికలకు భిన్నంగా మొదటి దశలో అనేక చోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. జూన్ 25 నాటికి రాష్ట్రంలో 40 శాతం పంటల సాగు జరిగింది. ఇంతటి కీలక సమయంలో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ రుణాలను బ్యాంకులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ కింద ప్రభుత్వం రెండో విడత బకాయిలు చెల్లించనందున రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. రెండో విడత సొమ్ము విడుదల చేయకుండా ప్రభుత్వం.. గత ఏడాది ఇచ్చిన రుణమాఫీలో అవకతవకలు జరిగాయంటూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తోంది. ఈ కారణంగా రుణాలు మంజూరు చేయడంలో జాప్యం తప్పడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. రూ.1,200 కోట్లు దాటని రుణాలు రాష్ట్రంలో ఈసారి 1.03 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. తెలంగాణలో సన్న, చిన్నకారు, మధ్య తరహా, ధనిక రైతులు 55.53 లక్షల మంది ఉన్నారు. అందులో సన్న, చిన్నకారు రైతులు 47.68 లక్షల మంది, మధ్య తరహా రైతులు 7.69 లక్షల మంది ఉన్నారు. వీరిలో అధికంగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడతారు. గతేడాది లెక్కల ప్రకారం 35.82 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈసారి వ్యవసాయ సీజన్ ఆశాజనకంగా ఉండటంతో రుణాలు తీసుకునే రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఈ ఏడాది రూ.30,995 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో రైతుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు మాత్రం ఇప్పటి వరకు రూ.1,200 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. అంటే మొత్తం లక్ష్యంలో కేవలం 3.87 శాతం మాత్రమే! సాగు విస్తీర్ణం మాత్రం 40 శాతం దాకా ఉంది. ఒక్క పత్తి సాగే 54 శాతం జరిగింది. ఇంత మొత్తంలో సాగు విస్తీర్ణం ఉన్నా.. బ్యాంకు రుణాలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయి. సర్కారు, బ్యాంకులు కలిసి మొండిచేయి చూపడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు రూ.3 వేల కోట్లకు పైగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. కేరళకు చెందిన ఓ బంగారు తాకట్టు సంస్థ తన వ్యాపారాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. బ్యాంకులు ఆలస్యంగా అప్పులు ఇస్తాయని తెలుసుకున్న ఈ సంస్థ రైతులను ఆకర్షించేందుకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ సంస్థ ఒక్కటే రైతుల దగ్గర్నుంచి ఆభరణాలు కుదువ పెట్టుకుని రూ.1,500 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అక్రమాలు వెలికి తీశాకే రుణమాఫీ! రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలకు ముందు సర్కారు అనేక మెలికలు పెడుతోంది. మొదటి విడత విడుదల చేసిన సొమ్ములో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం అందిందని ఆర్థికశాఖ ఇటీవల వెల్లడించింది. మొదటి విడతలో ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న అంశంపై జిల్లాల్లో నిఘా బృందాలు గాలిస్తున్నాయి. అనర్హులు ఎంతమంది రుణమాఫీ పొందారో పరిశీలన చేస్తున్నాయి. బోగస్ రైతులుంటే తొలగించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 30లోగా తమ పనిని పూర్తి చేయాలని నిఘా బృందాలకు సూచించింది. గత ఏడాది క్షుణ్ణంగా పరిశీలించి రుణమాఫీ అమలు చేశారు. ఎమ్మార్వో ధ్రువీకరణ ఇచ్చాకే సంబంధిత రైతులకు రుణమాఫీని వర్తింపచేశారు. మళ్లీ ఇప్పుడు అక్రమాలు.. తనిఖీలంటూ కొత్తగా చేయడం సరికాదని వ్యవసాయశాఖ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. కీలకమైన సీజన్లో రైతులను ఆదుకోవాల్సింది పోయి నిఘా బృందాలతో బ్యాంకుల్లో పరిశీలన చేయించడం దారుణమని అంటున్నారు. వడ్డీలకు తెచ్చుకుంటున్నాం పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. రుణమాఫీకి సంబంధించి ఈ ఏడాది ఇప్పటి దాకా ఖాతాలో జమ చేయలేదు. బ్యాంకుకు వెళ్తే డబ్బులు జమ కాలేదంటున్నారు. చేసేది లేక పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారుల వద్దకు పరుగెడుతున్నాం. - రాముడు, గట్టు, మహబూబ్‌నగర్ బ్యాంకు రుణాలు ఇవ్వలేదు నాకు మూడెకరాల పొలం ఉంది. పత్తి, నారుమళ్లను సిద్ధం చేసుకున్నాం. బ్యాంకుకు వెళ్తే రుణాలు ఇవ్వడం లేదు. ఈ నెలాఖరు వరకు రెన్యూవల్ చేసుకోని రైతులకు అవకాశం ఉండదని చెబుతున్నారు. కొత్త రుణాలను ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. వడ్డీకి అప్పులు తెచ్చుకొని పంటలు సాగుచేస్తున్నా. - సాయన్న, ధరూరు, మహబూబ్‌నగర్ -
ఇకపై ‘సర్కారీ’ రుణాలు!
స్వయం ఉపాధి పథకాలకు రాయితీతో కూడిన రుణాలు బ్యాంకుల పాత్ర తగ్గించే యోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రాయితీలు విడుదల చేసి ఏడాది గడిచినా బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. రుణం కోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులకు చివరకు మిగిలేది బ్యాంకర్ల ఈసడింపులే. ప్రభుత్వ రాయితీ పథకాల అమలులో ప్రతి ఏటా జరిగే సర్వ సాధారణ తంతు ఇది. బడా బాబులకు వందల కోట్ల రుణాలను ఉదారంగా చెల్లించే బ్యాంకర్లు బడుగు, బలహీనవర్గాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఏటా రాయితీ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా తామే స్వయంగా లబ్ధిదారులకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలనే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాల అమలులో బ్యాంకుల పాత్రను క్రమంగా తగ్గించుకుంటూ పోవాలనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే (2015-16) ఆర్థిక సంవత్సరం నుంచి ఎంపిక చేసిన కొన్ని పథకాలకు ఈ ప్రతిపాదనలను వర్తింపజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదేవిధంగా రాయితీల పంపిణీపై సైతం పునఃసమీక్ష జరుపుతోంది. స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం.. బీసీ, మైనారిటీలకు 50 శాతం రాయితీలు ఇవ్వాలని కిందటేడాది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి వీరికి జారీ చేసే రాయితీలను ఏక విధానంలో 70-75 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. యూనిట్ విలువలో మిగిలిన 25-30 శాతం నిధులను సైతం ప్రభుత్వమే లబ్ధిదారులకు రుణం కింద చెల్లిస్తే లబ్ధిదారులకు బ్యాంకు కష్టాలు తప్పుతాయని, సకాలంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోగలుగుతారనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల్లో జవాబుదారీతనం లోపిస్తుందని, బ్యాంకుల పాత్రను పూర్తిగా నిర్మూలించడం సరికాదని కొందరు ఉన్నతాధికారులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది పాత విధానమే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పాత విధానంలోనే రాయితీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది వరకు అమల్లో ఉన్న రాయితీ మొత్తాలనే ఈ ఏడాది కూడా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఒకవేళ రాయితీల పెంపుపై నిర్ణయం తీసుకున్నా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనే భావనలో ఉంది. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు సూచిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 101 సవరణ విషయం సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. లబ్ధిదారులు కచ్చితంగా 21-45 ఏళ్ల వయసు కలిగి ఉండాలనే నిబంధనపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వయో అర్హతను 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ ఆధారిత పథకాల (భూపంపిణీ మినహాయించి) లబ్ధిదారుల వయోపరిమితిని 55-60 ఏళ్ల వరకు పెంచాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
జీవన్‌రెడ్డి పక్కన కేసీఆర్
దగ్గరికి వెళ్లి కూర్చొని మరీ ముచ్చటించిన సీఎం సాక్షి, హైదరాబాద్: అవకాశం దొరికితే చాలు.. అధికార పార్టీపై విపక్షాలు, విపక్షాలపై అధికార పార్టీ విరుచుకుపడే ఘటనలకు వేదికగా మారిన అసెంబ్లీలో మంగళవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. స్వయానా సీఎం కేసీఆర్ తనసీట్లో నుంచి లేచి, హాలులో అటు చివరన ఉన్న ప్రతిపక్షాల గ్యాలరీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి పక్కన కూర్చున్నారు. సీఎం దాదాపు ఐదు నిమిషాల పాటు జీవన్‌రెడ్డితో ముచ్చటించారు. అయితే తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు స్వయం ఉపాధి కార్యక్రమంపై జీవన్‌రెడ్డి వేసిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్న సూచనను స్వాగతిస్తున్నానని, బ్యాంకుల తీరు బాగాలేదన్న జీవన్‌రెడ్డి మాటలతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై కొత్త విధానం రూపకల్పనకు వారంలోనే ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. ఆ వెంటనే సీఎం.. జీవన్‌రెడ్డి పక్కన కూర్చుని, ఆయనతో మాట్లాడటంతో సభ్యులందరి దృష్టి అటు వైపు మళ్లింది. -
సాగుకు దూరం!
సాక్షి, గుంటూరు జిల్లాలో ఈ ఏడాది 1.63 లక్షల హెక్టార్లలో భూములు సాగుకు నోచుకోలేదు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి 6.14 లక్షల హెక్టార్లలో సాగు చేపట్టగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 4.51 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారు. ఇందులో వరి సాగు 1.05 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. జిల్లాలో భారీ స్థాయిలో సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రభుత్వ వైఖరే కారణమని రైతులంటున్నారు. ఈ ఏడాది బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడం, సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కాకపోవడంతో వంటి కారణాలను రైతులు ప్రధానంగా పేర్కొంటున్నారు. {పభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విసుగు చెందిన రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర పనులకు వెళ్లాల్సి వస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, రైతులకు అండగా నిలుస్తామని సార్వత్రిక ఎన్నికల్లో వాగ్దానాలు చేసి తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కి వంద రోజులు పూర్తయినా ఒరగబెట్టింది ఏమీ లేదనే భావన రైతుల్లో గూడుకట్టుకుంది. {పధానంగా రైతు రుణమాఫీ చేయకపోవడం, వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అమలు చేయకపోవడం వల్ల సాగు భారమైందని రైతులు చెబుతున్నారు. పాత రుణాలు తిరిగి చెల్లించలేదని బ్యాంకర్లు ఈ ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా పేర్కొంటున్నారు. గత ఏడాది వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టప రిహారం ప్రకటించిన అప్పటి ప్రభుత్వం అధికారంలో లేకపోవడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ ఊసెత్తకపోవడం వల్ల తిరిగి సాగు చేపట్టే ధైర్యం లేకుం డా పోయిందంటున్నారు. వ్యవసాయ మోటర్ల కింద పంటలు వేసిన రైతులకు సైతం ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోతుందంటున్నారు. గత ఏడాది పండించిన మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అవి గోడౌన్లలో మూలుగుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి సాగు ఎలా చేపట్టగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
రుణమాఫీ అమలుపై తాజా ప్రతిపాదన
సాక్షి, ఒంగోలు: రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కగా మారింది. బ్యాంకుల రుణాలు చెల్లించొద్దని చెప్పినవారే.. నేడు నెత్తిన బండ మోపుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేతగాదంటూ చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా రోజుకో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ‘తొలిసంతకం’ అమల్లోకి రాకపోవడంపై అంతటా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఆయన రాష్ర్ట బ్యాంకర్లతో సమావేశమైనా.. ఆర్బీఐకి లేఖలు రాసి అనుకూల స్పందన రాలేదు. ఈక్రమంలో మెడపై కత్తిని కొంతకాలం దూరంపెట్టేందుకే రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదన తెచ్చినట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే, ఏదో ఒక కారణం లేనిదే రీషెడ్యూల్ చేయడం కుదరదని ఆర్బీఐ చెప్పడంతో కిందటేడాది తుపాను, కరువును తెరమీదికి తెచ్చారు. మొత్తానికి రుణాల మాఫీ హామీ దాటవేతకు ముఖ్యమంత్రి రైతులను తిమ్మినిబమ్మిని చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సరిగ్గా పదేళ్ల కిందట టీడీపీ అధికారంలో ఉండగా, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తుపాను ప్రభావిత మండలాల్లో పర్యటిస్తూ.. ‘వ్యవసాయం దండగ మారిదని...’ వ్యాఖ్యానించిన విషయం రాష్ట్రవ్యాప్త సంచలనమైంది. అప్పట్నుంచి రైతువ్యతిరేకి అనే అపనిందను తొలగించుకునేందుకు టీడీపీ పాట్లు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం రుణాలమాఫీ ఆచరణ కాదంటూ.. రీషెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో బాబు గతకాలపు ఏలుబడిని రైతులు మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కొత్తప్రభుత్వం పాతరుణాలు మాఫీతో కొత్తగా ఖరీఫ్సాగు పెట్టుబడులొస్తాయని ఆశించిన రైతన్నకు భవిష్యత్ అగమ్యగోచరమైంది. జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల విలువైన రైతు రుణాలు మాఫీకావాల్సి ఉంది. జిల్లాలో 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే మరో రూ.488.67 కోట్ల మేరకు మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ ప్రకటనల నాటినుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని.. బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత రుణాలు రైతుపేరు మీదే.. రుణాల రీషెడ్యూల్ అమలుపై సోమవారం ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే, ఈవిధానాన్ని కూడా జిల్లామొత్తం వర్తించకుండా.. కేవలం కొన్ని మండలాలకే పరిమితం చేస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కిందటేడాది ఎక్కడైతే తుపాను, కరవు సంభవించినట్లు ప్రభుత్వం గుర్తించిందో.. అక్కడి రైతులకే రుణాల రీషెడ్యూల్ చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆమేరకు జిల్లాలో 45 తుపాను ప్రభావిత మండలాలు, నాలుగు కరువుపీడిత మండలాలంటూ ఈఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. గడువు మీరిన బకాయిలన్నీ రైతులపేరు మీదనే ఉండి.. రుణం తీసుకున్న నాటినుంచి ఇవ్పటి వరకు వడ్డీ 11.75 శాతంను అసలు మొత్తంతో కలిపి లెక్కించి బకాయిగా రికార్డులో నమోదు చేయనున్నారు. కొత్తగా ప్రస్తుతం రుణాలిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే, జిల్లాలోని 5 లక్షల మంది రైతుల్లో 49 మండలాల రైతులకే రీషెడ్యూల్ వర్తిస్తే.. మిగతా వారి రుణాల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా. పైగా, బ్యాంకరు రైతు వద్దనున్న అన్ని ఆధార ధ్రువీకరణలు, పొలం పుస్తకాలు చూసిన తర్వాతనే రుణాలిస్తారని... ఆధార్‌కార్డు వంటి షరతులు పెట్టి ప్రభుత్వం రైతులను అనుమానించే ప్రయత్నం చేస్తోందని రైతుసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రీషెడ్యూల్ వర్తించే మండలాలివే.. ప్రభుత్వం తుపాను, కరవు మండలాల రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ కుదురుతోందని ప్రకటించనుంది. ఈమేరకు జిల్లాలో 45 మండలాలు తుపాను ప్రభావితం కాగా.. ఒంగోలు డివిజన్ పరిధిలో అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జే.పంగులూరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మద్దిపాడు, మార్టూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పర్చూరు. సంతమాగులూరు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలున్నాయి. కందుకూరు డివిజన్లో దర్శి, దొనకొండ, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, కందుకూరు, కొండపి, కురిచేడు, మర్రిపూడి, ముండ్లమూరు, పొదిలి, సింగరాయకొండ, తాళ్లూరు, తర్లుపాడు మండలాలున్నాయి. మార్కాపురం డివిజన్లో అర్థవీడు, బేస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం మండలాల రైతులకే రీ షెడ్యూల్ వర్తించనుంది. -
రుణాల రీషెడ్యూల్‌పై 30న నిర్ణయం!
* ఆరోజు రాష్ట్రస్థారుు బ్యాంకర్ల కమిటీ భేటీ * వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల రీ షెడ్యూల్‌తో పాటు కొత్తగా రైతులకు రుణాల మంజూరుపై ఈ నెల 30వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు నిమిత్తం ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఎల్బీసీ భేటీకి సీఎం చంద్రబాబునాయుడు సమయం ఇచ్చారు. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలుపడంతో పాటు ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలంటే పాత రుణాలను చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కాలేదు. తాజాగా రైతుల పాత రుణాలను రీ షెడ్యూల్ చేరుుంచి కొత్తగా రుణాలు మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రీ షెడ్యూల్ ఎలా చేయాలి? రైతుల పేరు మీదే రీ షెడ్యూల్ చేస్తారా? అదే జరిగితే రైతులు బ్యాంకులకు వచ్చి సంతకాలు చేస్తారా? లేకపోతే రైతుల పేరు మీద ఉన్న రుణాలను ప్రభుత్వం పేరు మీద బదలాయించుకుని రీ షెడ్యూల్ చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల పేరు మీదే రుణాలను రీ షెడ్యూల్ చేస్తే ఆ రుణాల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతే, రైతులపై భారం తడిసి మోపెడు అవుతుందని, వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రుణాలను రీ షెడ్యూల్ చేస్తామంటే అందుకు రైతులు అంగీకరిస్తారా? అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నారుు. గత ఖరీఫ్ రుణాల రీషెడ్యూల్కు వినతి ఇలా ఉండగా గత ఖరీఫ్‌లో ప్రకటించిన విధంగా కరువు మండలాల్లోని రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయలేదని, ఇప్పుడు నిబంధనలను సడలించి ఆ రుణాలను రీ షెడ్యూల్ చేయాల్సిందిగా ఆర్బీఐకి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరువు మండలాలను ప్రకటిస్తూ జీవో జారీ చేయడంలో జాప్యం జరిగినందున ఆయూ మండలాల్లోని రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయలేదు. -
వర్షభావంతో అన్నదాతల్లో ఆందోళన
-
వరుణ దేవా...కరుణ లేదా?
ఖరీఫ్ వచ్చేసింది. చినుకు రాలదు. నేల తడవదు. నాగలి కదలదు. ఎండలు తగ్గవా? వర్షాలు ఎప్పుడు పడతాయి? విత్తులు ఎప్పుడు వేయాలి? ఉభాలు ఎలా చేయాలి. పంట ఎప్పుడు పండించాలి. పరిపరి విధాలా సాగుతున్న ఆలోచనలతో అన్నదాత మనసు ఆందోళన చెందుతోంది. ఇంతవరకు చినుకు రాలకపోవడంతో ఈ ఏడాది సాగు కష్టమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమైన కారణంగా ఈ ఏడాది వర్షాలు ఊరిస్తున్నాయి. గత నెలాఖరు వరకు అడపాదడపా కురిసిన వర్షాలు కచ్చితంగా పడాల్సిన జూన్ నెలలో అడ్రస్ లేకుండా పోయాయి. ఫలితంగా చెరువులు, గుంతలు నీరు లేక వెలవెలబోతు న్నాయి. నారుపోయడానికి రైతులు మడులను సిద్ధం చేసి ఉంచారు. వరుణుడు కరుణిస్తే నారు పోయాలని చూస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రైతులతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు వర్షాలు పడక, ఎండ తీవ్రత తగ్గక జిల్లా ప్రజలు కూడా వేసవి తాపంతో అల్లాడుతున్నారు. విజయనగరం వ్యవసాయం: ఒక ఏడాది కరువుతో కష్టాలు. మరో ఏడాది తుపానుతో నష్టాలు. వరుసగా నాలుగేళ్ల నుంచి అన్నదాత అష్టకష్టాలు పడుతున్నా డు. దీంతో సాగుకోసం పెట్టిన పెట్టుబడుల మీద కూడా ఆశలు వదులుకున్నాడు. అంతే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వ్యవసాయం తప్ప మరే ఇతర పనీ చేతకాని రైతన్న సంప్రదాయంగా వస్తున్న అలవాటును వదులుకోలేక.. ఖరీఫ్ సీజన్ వచ్చేయడంతో మళ్లీ సాగు కోసం ఆరాట పడుతున్నాడు. నాలుగేళ్లుగా కష్టాలు అనుభవించినప్పటికీ ఏ క్షణంలోనైనా వర్షం పడితే చాలు.. సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. పెట్టుబడి కోసం.. వర్షం పడగానే నారు వేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర పెట్టుబడులకు రైతుల దగ్గర చిల్లిగవ్వ లేదు. ఖరీఫ్ సాగు కోసం ప్రతి ఏడా ది రైతులు మే, జూన్ నెలల్లో పంటరుణాలను తీసుకుని పెట్టుబడులు పెడతారు. అయితే అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం కూడా మానేశా యి. రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం దాని సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడంతో రుణాలు అందడం ప్రహసనంగా మారింది. దీంతో రుణాలు ఎప్పుడు అందుతాయోనని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అస లు అందుతాయో లేదోనని కూడా మధన పడుతున్నారు. ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుం దా లేదా కమిటీ పేరిట కాలయాపన చేస్తుందో అర్థం కాక రైతులు అయోమయ స్థితిలో ఉన్నా రు. ప్రభుత్వం గాని చేతులెత్తేస్తే వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. 2.20 లక్షల హెక్టార్లలో సాగు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అన్ని పంటలు కలి పి 2.20 లక్షల హెక్టార్ల వరకు సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందులో లక్షా 20వేల హెక్టార్లలో వరి పంట, మిగిలిన లక్ష హెక్టార్లలో మొక్కజొన్న, చోడి, శెనగ, వేరుశెనగ, చెరుకు, పత్తి, గోగు సాగవుతుందని అధికారుల అంచనా. రైతుల కోసం 92 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 45,500 క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు సిద్ధం చేశారు. ప్రైవేట్ డీలర్లకు విత్తనాలను సరఫరా చేశారు. వారు రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నారు. డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు రైతుల వద్ద డబ్బులు లేకపోవడంతో సాగు ఏవిధంగా చేపట్టాలో అర్థం కాక రైతులంతా బిత్తర చూపులు చూసున్నారు. సాగు ప్రశ్నార్థకమే ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టడానికి అవసరమైన నీరు, పెట్టుబడి రైతు దగ్గర లేవు. దీంతో ఈఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారింది. వరుణుడు నాలుగు, ఐదు రోజుల్లో కరుణించని రుణాలు అందే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఫలితంగా ఈఏడాది సాగు అయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికితోడు సాగు కలిసి రాకపోవడంతో కొంతమంది రైతులు సాగు పట్ల వెనుకడుగు వేస్తున్నారు. గత ఏడాది కూడా 20 వేల హెక్టార్ల వరకు సాగుకు నోచుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎండుతున్న చెరువులు నీరు లేకపోవడం వల్ల చెరువులు, గుంతలు ఎండిపోతున్నాయి. నీటితో కళకళలాడిల్సిన చెరువులు కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 10వేల వరకు చెరువులు ఉన్నాయి. అన్నింటిదీ ఇదే పరిస్థితి. మండుతున్న ఎండల కారణంగా ఉన్న కొద్ది పాటి నీరు కూడా ఆవిరవుతోంది. వర్ష సూచనలు లేవు జూన్ నెలలో వర్షాలు కురవాలి. ఇంతవరకు వర్షాలు పడలేదు. వర్షాలు పడేసూచనలు కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇందుకోసం ప్రత్నామాయ ప్రణాళికను సిద్ధం చేశాం. -డి.ప్రమీల, వ్యవసాయశాఖ జేడీ ప్రకృతి పగబట్టినట్లుంది ప్రతి ఏడాదీ ఈ సమయానికి ఎంతోకొంత వర్షాలు పడేవి. ఈ ఏడాది ఇంతవరకు పడలేదు. ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. నారుమడులను సిద్ధం చేసి ఉంచాం. అయితే విత్తనాలు, ఇతర పెట్టుబడులు కోసం బ్యాంకు రుణం కోసం ఎదురుచూస్తున్నాం. రుణాల గురించి అడగొద్దని బ్యాంకు అధికారులు అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి. -పొటుపురెడ్డి రమణ, రైతు, పినవేమలి, విజయనగరం మండలం