స్వయం ఉపాధి పథకాలకు రాయితీతో కూడిన రుణాలు
బ్యాంకుల పాత్ర తగ్గించే యోచన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రాయితీలు విడుదల చేసి ఏడాది గడిచినా బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. రుణం కోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులకు చివరకు మిగిలేది బ్యాంకర్ల ఈసడింపులే. ప్రభుత్వ రాయితీ పథకాల అమలులో ప్రతి ఏటా జరిగే సర్వ సాధారణ తంతు ఇది. బడా బాబులకు వందల కోట్ల రుణాలను ఉదారంగా చెల్లించే బ్యాంకర్లు బడుగు, బలహీనవర్గాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఏటా రాయితీ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారుతోంది.
దీనికి పరిష్కారంగా తామే స్వయంగా లబ్ధిదారులకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలనే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాల అమలులో బ్యాంకుల పాత్రను క్రమంగా తగ్గించుకుంటూ పోవాలనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే (2015-16) ఆర్థిక సంవత్సరం నుంచి ఎంపిక చేసిన కొన్ని పథకాలకు ఈ ప్రతిపాదనలను వర్తింపజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదేవిధంగా రాయితీల పంపిణీపై సైతం పునఃసమీక్ష జరుపుతోంది. స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం.. బీసీ, మైనారిటీలకు 50 శాతం రాయితీలు ఇవ్వాలని కిందటేడాది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే ఏడాది నుంచి వీరికి జారీ చేసే రాయితీలను ఏక విధానంలో 70-75 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. యూనిట్ విలువలో మిగిలిన 25-30 శాతం నిధులను సైతం ప్రభుత్వమే లబ్ధిదారులకు రుణం కింద చెల్లిస్తే లబ్ధిదారులకు బ్యాంకు కష్టాలు తప్పుతాయని, సకాలంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోగలుగుతారనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల్లో జవాబుదారీతనం లోపిస్తుందని, బ్యాంకుల పాత్రను పూర్తిగా నిర్మూలించడం సరికాదని కొందరు ఉన్నతాధికారులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది పాత విధానమే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పాత విధానంలోనే రాయితీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది వరకు అమల్లో ఉన్న రాయితీ మొత్తాలనే ఈ ఏడాది కూడా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఒకవేళ రాయితీల పెంపుపై నిర్ణయం తీసుకున్నా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనే భావనలో ఉంది. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు సూచిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 101 సవరణ విషయం సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. లబ్ధిదారులు కచ్చితంగా 21-45 ఏళ్ల వయసు కలిగి ఉండాలనే నిబంధనపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వయో అర్హతను 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ ఆధారిత పథకాల (భూపంపిణీ మినహాయించి) లబ్ధిదారుల వయోపరిమితిని 55-60 ఏళ్ల వరకు పెంచాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ఇకపై ‘సర్కారీ’ రుణాలు!
Published Wed, Dec 17 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement