కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల కార్పొరేషన్ల నుంచి రుణాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల ఆంక్షలను విధించింది. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 101ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎస్‌సీ,ఎస్‌టీ వర్గాలకు సంబంధించి 21 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు మాత్రమే రుణ సహాయం పొందేందుకు అర్హులు. అలాగే బీసీ, మైనార్టీ, వికలాంగులు 21 నుంచి 40 సంవత్పరాల లోపు వారే దరఖాస్తు చేసుకోవాలి. మండల, పట్టణ స్థాయిలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి.
ఆయా కమిటీలు రెకమెండ్ చేసిన వారికే రుణ సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ కమిటీల్లో ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా, ముగ్గురు సోషల్ వర్కర్లు, వారిలో ఒక మహిళ ఉండాలి. ఆమెను కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నామినేట్ చేయాలి. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డీఆర్‌డీఏ నుంచి ఒక ప్రతినిధి, ఆయా మండలాల్లోని బ్యాంకుల మేనేజర్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక సహకార సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తులకు మాత్రమే రుణ సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
వ్యవసాయం కలిసిరాక, నిరుద్యోగ సమస్యతో ఇప్పటికే వేల సంఖ్యలో రుణాల కోసం ఆయా కార్పొరేషన్లకు దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల వారి దరఖాస్తులు ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల వారి దరఖాస్తులు మున్సిపల్ కమిషనర్లు పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేసి ఆయా కార్పొరేషన్లకు రెకమెండ్ చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటిని పరిశీలించి అర్హులను ప్రకటించాల్సి ఉంది. అయితే గత ఏడాది ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
నేటికీ దరఖాస్తులకు మోక్షం కలగలేదు. కొత్త నిబంధనలతో వయస్సు ఎక్కువగా ఉండేవారి దరఖాస్తులు పరిశీలనలోకి వచ్చే అవకాశం లేదు. అంతేగాక లబ్ధిదారుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసు అవసరమని ప్రకటించిన దృష్ట్యా, అన్ని దరఖాస్తులను ఆయా మండలాలు, మున్సిపాలిటీలకు తిప్పి పంపించాల్సి వస్తుందేమో అనే అనుమానాలను ఆయా కార్పొరేషన్ల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(మార్చిలోపు)లో రుణ విడుదల కష్టమేననే వాదన వినిపిస్తోంది.
రుణం.. ని‘బంధనం’
Published Sat, Jan 4 2014 2:10 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement