సాక్షి, కాకినాడ : గత ప్రభుత్వమూ వారిని చిన్నచూపు చూసింది. ‘ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం’ అని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వమూ వారి మేలును గాలికి వదిలేస్తోంది. అభివృద్ధి పేరిట గాలిమేడలు కడుతూ పాలనలో నూరురోజుల పండుగ చేసుకుంటున్న చంద్రబాబు సర్కారుకు తమ క్షేమం పట్టడం లేదని బడుగు, బలహీన వర్గాల వారు మండిపడుతున్నారు.
జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడడం లేదు. ఆ సంస్థలకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నిధులు లేకపోవడంతో పది శాతం యూనిట్లు కూడా ఏర్పాటు కాని పరిస్థితి నెలకొంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీసం కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోలేని దుస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో వాటి ద్వారా లబ్ధి పొంది, జీవితంలో స్థిరపడాలని ఆశించే నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ.43,30,65,000 అంచనా వ్యయంతో 4,064 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు.
వీటిలో రూ.15,77,97,000 విలువైన 1618 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో బ్యాంకు సంబంధిత పథకాల నుంచి రూ.39.37 కోట్లతో 2655 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.15.16 కోట్లతో 1464 యూనిట్లు మంజూరు చేశారు. హెచ్‌ఐవీ సోకిన వారికి, వికలాంగులకు నేరుగా సంస్థ ఆధ్వర్యంలో రూ.3,93,65,000తో 1406 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా, రూ.61.60 లక్షలతో 154 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులివ్వగలిగారు. బ్యాంక్ లింకేజ్ కలిగిన 1464 యూనిట్లకు రూ.8,70,46,000 సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. దీంతో ఈ సంస్థ ద్వారా గతేడాది మంజూరైన ఏ ఒక్క యూనిట్ ఇప్పటి వరకు ఏర్పాటు కాని పరిస్థితి నెలకొంది.
సబ్సిడీ ఊసే లేదు..
బీసీ కార్పొరేషన్‌లో మార్జిన్ మనీ స్కీమ్ కింద రూ.24,13,50,000తో 4410 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.12,40,54,000 విలువైన 1848 యూనిట్లు మంజూరు చేశారు. కార్పొరేషన్ ద్వారా అమలయ్యే రాజీవ్ అభ్యుదయ యోజన కింద రూ.10,96,50,000తో 2010 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.2,83,92,000 వ్యయం కాగల 400 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు స్కీమ్‌లలో మంజూరైన 2248 యూనిట్లు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.6,77,55,000 విడుదల చేయాల్సి ఉంది. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాని దుస్థితి నెలకొంది. ఇక బీసీ సహకార సంఘాల సమాఖ్య ద్వారా వివిధ సహకార సంఘాలకు రూ.28.30 కోట్లతో 377 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం రూ.కోటీ 52 లక్షలతో 22 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. వీటికి రూ.76 లక్షల సబ్సిడీ మొత్తం నేటికీ విడుదల కాలేదు.
అరకొరగా యూనిట్ల ఏర్పాటు
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు రూ.101.53 లక్షలతో 296 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.62.74లక్షలతో 191 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు రూ.24.23 లక్షలతో 96 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి రూ.కోటీ 11 లక్షలతో 276 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా, రూ.18.30 లక్షలతో 34 యూనిట్లకు మంజూరు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు అతికష్టమ్మీద రూ.5 లక్షల 45వేల అంచనాలతో 11 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మైనార్టీ కార్పొరేషన్ మినహా మిగిలిన కార్పొరేషన్‌లలో మంజూరైన ఏ ఒక్క యూనిట్ గత ఏడాదిన్నరగా ఏర్పాటు కాని దుస్థితి ఏర్పడింది. దీంతో మంజూరు ఉత్తర్వులు పొందిన వారు ఎక్కడ వీటన్నింటినీ రద్దు చేస్తారోనని భయపడుతున్నారు.
కార్యాచరణ ప్రణాళికే కరువు..
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క ఎస్సీ కార్పొరేషన్ మినహా మిగిలిన కార్పొరేషన్లు కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేకపోయాయి. ఎస్సీ కార్పొరేషన్ 2014-15లో బ్యాంకు సంబంధిత పథకాలకు సంబంధించి రూ.60.80 కోట్లతో 2921 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇందులో కార్పొరేషన్, ఇతర శాఖల సబ్సిడీ రూపంలో రూ.21,29,37,000, బ్యాంకు రుణంగా రూ.21,59,83,000 మంజూరు చేయాలని నిర్దేశించారు. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా హెచ్‌ఐవీ సోకిన వారికి, వికలాంగులకు మంజూరు చేసే స్కీమ్‌కు సంబంధించి రూ.4,31,58,000 అంచనా వ్యయంతో 1550 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, వీటిలో రూ.కోటి 93లక్షల 20వేలు సబ్సిడీ రూపంలో రావాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆర్థిక సంవత్సరం ఆరంభమై అర్ధ సంవత్సరం కావస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి ఈ ప్రణాళికకు నిధులు విదల్చని పరిస్థితి నెలకొంది.
బడుగుల బాగుకు ఏదీ బాసట?
Published Fri, Sep 12 2014 12:00 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement