లక్ష్మీ.. రావే మా ఇంటికి!
♦ బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
♦ సంబురాల్లో వెనుకబడిన వర్గాలు
♦ జిల్లాలో బీసీ జనాభా 18.54లక్షలు
♦ దరఖాస్తుల పరిశీలన బాధ్యత బీసీ సంక్షేమ శాఖకే
♦ పారదర్శకంగా అమలు చేయాలంటున్న ప్రజాప్రతినిధులు, నేతలు
జోగిపేట : బీసీలకూ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెనుకబడిన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీసీలు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీఓ ఎంఎస్ నం. 5ను జారీ చేసింది. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సాయం అందుతుంది. ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీలకే ఈ పథకాన్ని వర్తింపజేసిన ప్రభుత్వం తాజాగా బీసీలకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి బీసీలు, ఓబీసీలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది.
జిల్లాలో బీసీ జనాభా 18.54 లక్షలు
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కంటే బీసీలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం బీసీ జనాభా 18,54,073 లక్షలు. వీరిలో 70 శాతానికిై పెగా నిరుపేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలే క సతమత మవుతున్నారు. బీసీలకు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చాలా మంది తల్లిదండ్రులకు ఇది వరంగా మారింది. కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిశీలన బాధ్యత ఆ శాఖ అధికారులకే..
దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించింది. సహయ బీసీ సంక్షేమ అధికారులు (ఏబీసీడబ్ల్యూఓ) వసతి గృహ వార్డెన్లకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. దరఖాస్తులు చేసుకునే వారు ఆయా మండల ప్రాంతాల వార్డెన్లకు దరఖాస్తులు అందజేస్తే సరిపోతుంది.
దరఖాస్తు చేసే విధానం..
♦ సమీపంలోని మీ-సేవ కార్యాలయంలో గాని, ఏదైనా ఇంటర్‌నెట్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో, హాస్టల్ వార్డెన్లకూ దరఖాస్తులు సమర్పించవచ్చు.
♦ వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ మెమో, బోనఫైడ్, టీసీ
♦ వధూవరుల కుల ధ్రువీకరణ పత్రం
♦ వధూవరుల ఆధార్ కార్డులు
♦ వధువు బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్
♦ వివాహ ప్రతిక, మొదటి వివాహ ధ్రువపత్రం (గెజిటెడ్ అధికారి సంతకం చేసినది)
♦ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి వివాహ ధ్రువపత్రం.
పథకం పక్కదారి పట్ట కుండా చూడాలి
♦ పేద బీసీ వర్గాల కోసం ప్రవేశ పెట్టిన పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. పేద బీసీ ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం మంజూరు చేసే రూ.51వేలు కొంత మేరకు ఉపయోగపడతాయి.
♦ నిబంధనల పేరిట పేదలను ఇబ్బంది పెట్టొద్దు. బీసీలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కవిత, చైర్‌పర్సన్, జోగిపేట నగర పంచాయతీ
వివాహ రిజిస్ట్రేషన్ పత్రం..
ఏప్రిల్ 1నుంచి పెళ్లిళ్లు చేసుకున్న బీసీ యువతులు, కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కల్గిన వారు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏబీసీడబ్ల్యూవోలు, వార్డెన్లు వాటిని పరిశీలిస్తారు. ఆ వెంటనేవధువు ఖాతాల్లోకి ట్రెజరీ ద్వారా నిధులు జమ అవుతాయి. ఆశన్న, - బీసీ సంక్షేమ శాఖ అధికారి సంగారెడ్డి
పథకం కింద అర్హత పొందాలంటే ..
♦ వివాహం కానివారై ఉండాలి, వధూవరులు ఒకే కులానికి చెందిన వారై ఉండాలి.
♦ పెళ్లి నాటికి వధువుకి 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
♦ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించరాదు.
♦ {పతి వధువుకు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది.
♦ ఏప్రిల్ 1 తర్వాత వివాహం చేసుకున్న బీసీ యువతులందరూ అర్హులే.