government subsidies
-
సినీ పరిశ్రమకు ప్రభుత్వ రాయితీలు
సాక్షి, అమరావతి: కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలలకు (2020 జులై నుంచి డిసెంబర్ వరకు) విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని పేర్కొంది. వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ఫ్లెక్స్ థియేటర్లకు లేదని తెలిపింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ధి కలిగేలా ఈ రాయితీలిచ్చినట్లు సమాచార, పౌర సంబంధాల ఎక్స్ అఫీషియో కార్యదర్శి టి.విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఇకపై ‘సర్కారీ’ రుణాలు!
స్వయం ఉపాధి పథకాలకు రాయితీతో కూడిన రుణాలు బ్యాంకుల పాత్ర తగ్గించే యోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రాయితీలు విడుదల చేసి ఏడాది గడిచినా బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. రుణం కోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులకు చివరకు మిగిలేది బ్యాంకర్ల ఈసడింపులే. ప్రభుత్వ రాయితీ పథకాల అమలులో ప్రతి ఏటా జరిగే సర్వ సాధారణ తంతు ఇది. బడా బాబులకు వందల కోట్ల రుణాలను ఉదారంగా చెల్లించే బ్యాంకర్లు బడుగు, బలహీనవర్గాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఏటా రాయితీ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా తామే స్వయంగా లబ్ధిదారులకు రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలనే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల స్వయం ఉపాధి పథకాల అమలులో బ్యాంకుల పాత్రను క్రమంగా తగ్గించుకుంటూ పోవాలనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే (2015-16) ఆర్థిక సంవత్సరం నుంచి ఎంపిక చేసిన కొన్ని పథకాలకు ఈ ప్రతిపాదనలను వర్తింపజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదేవిధంగా రాయితీల పంపిణీపై సైతం పునఃసమీక్ష జరుపుతోంది. స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం.. బీసీ, మైనారిటీలకు 50 శాతం రాయితీలు ఇవ్వాలని కిందటేడాది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి వీరికి జారీ చేసే రాయితీలను ఏక విధానంలో 70-75 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. యూనిట్ విలువలో మిగిలిన 25-30 శాతం నిధులను సైతం ప్రభుత్వమే లబ్ధిదారులకు రుణం కింద చెల్లిస్తే లబ్ధిదారులకు బ్యాంకు కష్టాలు తప్పుతాయని, సకాలంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోగలుగుతారనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల్లో జవాబుదారీతనం లోపిస్తుందని, బ్యాంకుల పాత్రను పూర్తిగా నిర్మూలించడం సరికాదని కొందరు ఉన్నతాధికారులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది పాత విధానమే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పాత విధానంలోనే రాయితీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది వరకు అమల్లో ఉన్న రాయితీ మొత్తాలనే ఈ ఏడాది కూడా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఒకవేళ రాయితీల పెంపుపై నిర్ణయం తీసుకున్నా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనే భావనలో ఉంది. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు సూచిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 101 సవరణ విషయం సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. లబ్ధిదారులు కచ్చితంగా 21-45 ఏళ్ల వయసు కలిగి ఉండాలనే నిబంధనపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వయో అర్హతను 50 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ ఆధారిత పథకాల (భూపంపిణీ మినహాయించి) లబ్ధిదారుల వయోపరిమితిని 55-60 ఏళ్ల వరకు పెంచాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
నష్టాల ఊబిలో ‘ప్రగతి చక్రం’
- జిల్లాలో పది డిపోల్లో రూ. 10.12 కోట్ల నష్టం - నాలుగు నెలలుగా అందని ప్రభుత్వ రాయితీలు - ప్రైవేట్ వాహనాల జోరుకు కళ్లెం శూన్యం నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు మూడడుగులు వెనుకకు ఆరడుగులు అన్న చందంగా తయారైంది. ఆయా డిపోలు పూర్తిగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సమయపాలన పాటించకపోవడం, కాలం చెల్లిన బస్సులు నడపడం, కొన్ని బస్సులను రద్దు చేయడం, అద్దె బస్సులను తీసుకోవడం, నిర్వహణ వ్యయం తడిసిమోపెడవడం తదితర సమస్యలతో ఆర్టీసీ కొట్టామిట్టాడుతోంది. జిల్లాలోని మొత్తం 10 డిపోలు కలిపి రూ.10.12 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నాలుగు నెలలుగా అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నష్టం ఇలా... జిల్లాలో నెల్లూరు-1, 2, ఉదయగిరి, ఆత్మకూ రు, కావలి, గూడూరు, వెంకటగిరి, రాపూరు, వాకాడు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో దాదాపు 798 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 103 అద్దె బస్సులు ఉన్నాయి. అన్ని డిపోల్లో ఆయా కేటగిరీల్లో మొత్తం 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దాదాపు రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులను ఆయా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోల బస్సులు కలిపి రోజుకు 3.75 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందుకోసం డీజిల్ రూపంలో నెలకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులకు కిలోమీటరుకు దాదాపు రూ.33లు రావల్సి ఉండగా, కేవలం రూ.21లు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.34 లక్షల నష్టం వస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. తరచూ మొరాయిస్తున్న బస్సులు ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. పాతకాలం నాటి బస్సులు కావడంతో ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల చెన్నైకి వెళ్తున్న బస్సు మొరాయించడంతో మరొక బస్సులో ప్రయాణికులను తరలించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవడంతో మరమ్మతుల ఖర్చు తడిసిమోపెడవుతోంది. అర్ధంతరంగా బస్సుల రద్దు సరిపడా ప్రయాణికులు ఉండడం లేదని, అవసరం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు లేరన్న సాకుతో నెల రోజుల కిందట కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రూట్లలో బస్సులు నష్టాల బాటన నడుస్తున్నాయన్న సాకుతో మరికొన్ని బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు రూట్లలో పల్లెవెలుగు బస్సులను నడపడం లేదు. ఆ మార్గాల్లో ఆటోలు, జీపులు ఎక్కువగా తి రుగుతుండంతో ఓఆర్ తగ్గిందని సాకుగా చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల జోరు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ తదితర ప్రాంతాలకు ఎక్కువగా ప్రైవే టు వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు డిపోల ముందుకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నుంచి గూడూరు, నాయుడుపేట, తిరుపతిలకు ప్రతిరోజు టెంపోలు, కార్లు తిరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. నష్టాలను అధిగమిస్తాం : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్తాం. ఏప్రిల్, మే, జూన్ నెలలు మాత్రమే ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. మిగిలిన నెలలు అన్ సీజన్. దీంతో ఆర్టీసీకి కొంత రాబడి తగ్గుతుంది. ఆర్టీసీ 100 రోజుల ప్రణాళికలో నష్టాలను అధిగమిస్తాం. - చంద్రశేఖర్, సీటీఎం -
ఆన్లైన్ అవస్థలు
వంగర, న్యూస్‌లైన్: వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. కానీ అవి కంప్యూటర్లో కనిపించవు. కనిపించకపోవడానికి కార ణం.. రెవెన్యూ అధికారులు వాటిని ఆన్లైన్ చేయకపోవడ మే. ఆన్లైన్లో నమోదు కానిదే బ్యాంకు రుణాలు, ఇతరత్రా ప్రభుత్వ రాయితీలు అందవు. వంగర మండలం కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రామానికి చెందిన 104 మంది రైతులు ఇదే దుస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విభాగాలన్నింటిలోనూ కంప్యూటరీకరణ జోరుగా సాగుతోంది. అందులో భాగంగా రైతుల భూముల వివరాలు కూడా కంప్యూటరీకరిస్తున్నారు. ఈ పని అరకొరగా జరగడంతో రైతులు కష్టనష్టాలకు గురవుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కె.కొత్తవలసే. ఈ గ్రామంలో 255 మంది రైతులకు పల్లం, మెట్టు కలిపి 900 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవ న్నీ తోటపల్లి కుడికాలువ పరిధిలో ఉన్నాయి. వీటికి భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. ఆఫ్‌లైన్ అడంగల్, రెవెన్యూ రికార్డు-01, రెవెన్యూ రికార్డు-04లలోనూ నమోదయ్యాయి. కానీ వీరిలో 205 మందికే పట్టాదారు పాసుపుస్తకాలున్నా యి. ఇదిలా ఉండగా గత ఏడాది మండలంలోని అన్ని గ్రామాలు, బౌండరీల వారీగా పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర రికార్డుల ఆధారంగా భూముల వివరాలను కంప్యూట రీకరించారు.కె.కొత్తవలసను మాత్రం విస్మరించారు. దాంతో కంప్యూటరీకరణ గురించి తెలుసుకున్న, దానిపై అవగాహన ఉన్న 151 మంది రైతులు నేరుగా కార్యాలయానికి వెళ్లి తమ భూములను కంప్యూటరీకరించుకున్నారు. 54 మంది రైతుల వివరాలు ఆన్లైన్ కాలేదు. మరో 50 మందికి పాసుపుస్తకాలే మంజూరు చేయలేదు. మొత్తం మీద గ్రామానికి చెందిన 350 ఎకరాల భూములు ఆన్లైన్ కాగా, మిగిలిన 550 ఎకరాల భూములు ఆఫ్‌లైన్‌లోనే ఉండిపోయాయి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రైతుల భూములన్నింటినీ కంప్యూటరీకరించాలని ప్రభుత్వం గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అయితే అధికారులు అలసత్వం వహిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించి, వారి భూముల వివరాలను కంప్యూటరీకరించాలి. అది పూర్తి అయిన తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా కంప్యూటర్ అడంగల్ తీసుకోవాలి. అది ఉంటే తప్ప రుణాలు మంజూరు కావు. ఇతర ప్రభుత్వ రాయితీలకు దరఖాస్తు చేసుకోలేరు. అయితే కె.కొత్తవల సలో రైతుల పాసుపుస్తకాలనే అధికారులు పరిశీలించలేదు. నేరుగా వెళ్లి ఆన్లైన్ చేయించుకున్న రైతులకు తప్ప మిగతా వారికి కంప్యూటర్ అడంగల్ కాపీలు లభించడం లేదు. రుణ సౌకర్యానికి నోచుకోని రైతులు తమ భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడం తో 54 మంది రైతులు రుణ సౌకర్యానికి దూరమయ్యారు. అర్హులైన రైతులందరికీ రుణాలు ఇవ్వాలని అటు ప్రభుత్వం, ఇటు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఇక్కడ అమలు కావడం లేదు. గత ఏడాది ఈ రైతులంతా రుణాలకు అర్హత కోల్పోయారు. కొన్నేళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులు వాటి ని రెన్యూవల్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌కు సైతం కంప్యూటర్ అడంగల్ అవసరం కావడంతో గత రెండేళ్లుగా పంట రుణాలు రెన్యూవల్ చేసుకోలేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన సున్నా వడ్డీ రాయితీ కూడా వీరికి వర్తించడం లేదు. 50 మంది రైతులకు పాసుపుస్తకాలే లేవు గ్రామంలో 50 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. వంశపారంపర్య ఆస్తిగా సంక్రమించే భూముల యజమాని మరణిస్తే, ఆ భూములను వారి వారసుల పేరిట మార్చి కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఈ గ్రామంలో ఆ పరిస్థితి లేదు. నమోదు కాని సర్వే నెంబర్లు కొప్పర బౌండరీ పరిధిలో కంప్యూటరీకరణకు నోచుకోని భూముల సర్వే నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన 77, 113, 76, 301, 111, 10, 25 తదితర సర్వే నెంబర్ల పరిధిలో అధిక సంఖ్యలో రైతులకు చెందిన భూములు కంప్యూటరీకరించలేదు. కాగా కె.కొత్తవలస గ్రామానికి చెందిన కొంత మేర పంట భూములు మద్దివలస, కొండచాకరాపల్లి బౌండరీల్లో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 27 మంది రైతులుండగా వారిలో 10 మంది వివరాలే ఆన్లైన్లో నమోదయ్యాయి. కొండచాకరాపల్లిలో 10, మద్దివలసలో ఏడుగురు రైతులకు సంబంధించి భూములు ఆన్లైన్ కాకపోవడం సమస్యగా మారింది. ఏడాదిన్నర నుంచి వీఆర్వో లేరు సుమారు ఏడాదిన్నర నుంచి ఈ గ్రామ వీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన అధికారులైనా ఇక్కడి సమస్యలపై దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు ప్రతిదానికీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ ఏడాది మేలో ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఈ గ్రామం నుంచి 60 ఫిర్యాదులు అందాయి. తమ భూములను కంప్యూటరీకరించాలని, రికార్డుల్లో తప్పులు సరిచేయాలని, వారసత్వంగా అనుభవిస్తున్న భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, కొత్తగా కొనుగోలు చేసిన భూములను కంప్యూటరీకరించాలని అర్జీలు పెట్టుకున్నా ఇంత వరకు ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. తమ సమస్యలపై రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదు. కలెక్టర్ గ్రీవెన్స్‌లోనూ, పాలకొండ ఆర్డీవోకు ఫిర్యా దు చేశారు. దీంతో సమస్య తెలుసుకునేం దుకు ఓ అధికా రి వచ్చి రైతుల వద్ద ఉన్న పాసుపుస్తకాలు చూసి వెళ్లిపోయారు. సమ స్య మాత్రం పరిష్కారం కాలేదు. -
ఉల్లి సాగుకు ప్రోత్సాహం కరువు
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. మరి అంతగా ప్రస్తుతించే ఉల్లిని జిల్లా ఉద్యానశాఖ అధికారులు మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఉల్లి సాగుచేసే రైతుల దరి చేర్చటం లేదు. ఫలితంగా జిల్లాలో ఉల్లి సాగు సాధారణ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఉల్లి ధర చుక్కలనంటుతున్నా సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు కనీసం ప్రచారం కూడా చేయటం లేదు. జిల్లాలో గతేడాది 700 హెక్టార్లలో సాగు చేయగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రైతులు పంట వేసింది 598 హెక్టార్లలో మాత్రమే. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీ ఇవ్వటానికి ఈ సంవత్సరం రూ.45 లక్షలు కేటాయించారు. వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంట మినహా ఏ పంటకైనా కేటాయించవచ్చు. కానీ,ఉల్లికి కేటాయించింది నామ మాత్రమే. జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, ఫిరంగిపురం, నరసరావుపేట ప్రాంతాలు ఉల్లి సాగుకు అనుకూలం. ఈ ప్రాంతాల్లోని భూముల్లో ఉల్లిసాగుపై ప్రత్యేక దృష్టి పెడితే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. అవగాహన కల్పన లో విఫలం.. ఉల్లి సాగుపై ఆసక్తిని పెంచడానికి, ప్రోత్సాహకాలపై రైతులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలి. కానీ ఉద్యాన శాఖ అధికారులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించటం లేదు. ఎవరైన వారి వద్దకు వెళ్లి అడిగితే మినహా వివరాలు తెలియడం లేదు. గడచిన మూడేళ్లలో ఉల్లిసాగు చేసే ప్రాంతాల్లో ఉన్నతాధికారులు ఎవరూ వచ్చిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నాం.. ఉల్లిసాగు చేసే రైతులకు 50 శాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నాం. ఉద్యానశాఖలో సిబ్బంది కొరత ఉంది. సమైక్యాంధ్ర సమ్మె, వరదల కారణంగా ఉల్లిసాగుపై అవగాహన సదస్సులు నిర్వహించలేక పోయాం. రబీలో సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపడతాం. - ఉద్యానశాఖ ఏడీహెచ్ బెన్ని