నష్టాల ఊబిలో ‘ప్రగతి చక్రం’
- జిల్లాలో పది డిపోల్లో రూ. 10.12 కోట్ల నష్టం
- నాలుగు నెలలుగా అందని ప్రభుత్వ రాయితీలు
- ప్రైవేట్ వాహనాల జోరుకు కళ్లెం శూన్యం
నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు మూడడుగులు వెనుకకు ఆరడుగులు అన్న చందంగా తయారైంది. ఆయా డిపోలు పూర్తిగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సమయపాలన పాటించకపోవడం, కాలం చెల్లిన బస్సులు నడపడం, కొన్ని బస్సులను రద్దు చేయడం, అద్దె బస్సులను తీసుకోవడం, నిర్వహణ వ్యయం తడిసిమోపెడవడం తదితర సమస్యలతో ఆర్టీసీ కొట్టామిట్టాడుతోంది. జిల్లాలోని మొత్తం 10 డిపోలు కలిపి రూ.10.12 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నాలుగు నెలలుగా అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది.
నష్టం ఇలా...
జిల్లాలో నెల్లూరు-1, 2, ఉదయగిరి, ఆత్మకూ రు, కావలి, గూడూరు, వెంకటగిరి, రాపూరు, వాకాడు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో దాదాపు 798 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 103 అద్దె బస్సులు ఉన్నాయి. అన్ని డిపోల్లో ఆయా కేటగిరీల్లో మొత్తం 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దాదాపు రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులను ఆయా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.
జిల్లాలోని అన్ని డిపోల బస్సులు కలిపి రోజుకు 3.75 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందుకోసం డీజిల్ రూపంలో నెలకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులకు కిలోమీటరుకు దాదాపు రూ.33లు రావల్సి ఉండగా, కేవలం రూ.21లు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.34 లక్షల నష్టం వస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు.
తరచూ మొరాయిస్తున్న బస్సులు
ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. పాతకాలం నాటి బస్సులు కావడంతో ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల చెన్నైకి వెళ్తున్న బస్సు మొరాయించడంతో మరొక బస్సులో ప్రయాణికులను తరలించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవడంతో మరమ్మతుల ఖర్చు తడిసిమోపెడవుతోంది.
అర్ధంతరంగా బస్సుల రద్దు
సరిపడా ప్రయాణికులు ఉండడం లేదని, అవసరం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు లేరన్న సాకుతో నెల రోజుల కిందట కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రూట్లలో బస్సులు నష్టాల బాటన నడుస్తున్నాయన్న సాకుతో మరికొన్ని బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు రూట్లలో పల్లెవెలుగు బస్సులను నడపడం లేదు. ఆ మార్గాల్లో ఆటోలు, జీపులు ఎక్కువగా తి రుగుతుండంతో ఓఆర్ తగ్గిందని సాకుగా చూపిస్తున్నారు.
ప్రైవేటు వాహనాల జోరు
దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ తదితర ప్రాంతాలకు ఎక్కువగా ప్రైవే టు వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు డిపోల ముందుకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నుంచి గూడూరు, నాయుడుపేట, తిరుపతిలకు ప్రతిరోజు టెంపోలు, కార్లు తిరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
నష్టాలను అధిగమిస్తాం :
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్తాం. ఏప్రిల్, మే, జూన్ నెలలు మాత్రమే ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. మిగిలిన నెలలు అన్ సీజన్. దీంతో ఆర్టీసీకి కొంత రాబడి తగ్గుతుంది. ఆర్టీసీ 100 రోజుల ప్రణాళికలో నష్టాలను అధిగమిస్తాం.
- చంద్రశేఖర్, సీటీఎం