ఉల్లి సాగుకు ప్రోత్సాహం కరువు
Published Fri, Nov 22 2013 2:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. మరి అంతగా ప్రస్తుతించే ఉల్లిని జిల్లా ఉద్యానశాఖ అధికారులు మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఉల్లి సాగుచేసే రైతుల దరి చేర్చటం లేదు. ఫలితంగా జిల్లాలో ఉల్లి సాగు సాధారణ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఉల్లి ధర చుక్కలనంటుతున్నా సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు కనీసం ప్రచారం కూడా చేయటం లేదు. జిల్లాలో గతేడాది 700 హెక్టార్లలో సాగు చేయగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రైతులు పంట వేసింది 598 హెక్టార్లలో మాత్రమే. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీ ఇవ్వటానికి ఈ సంవత్సరం రూ.45 లక్షలు కేటాయించారు. వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంట మినహా ఏ పంటకైనా కేటాయించవచ్చు. కానీ,ఉల్లికి కేటాయించింది నామ మాత్రమే. జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, ఫిరంగిపురం, నరసరావుపేట ప్రాంతాలు ఉల్లి సాగుకు అనుకూలం. ఈ ప్రాంతాల్లోని భూముల్లో ఉల్లిసాగుపై ప్రత్యేక దృష్టి పెడితే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది.
అవగాహన కల్పన లో విఫలం..
ఉల్లి సాగుపై ఆసక్తిని పెంచడానికి, ప్రోత్సాహకాలపై రైతులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలి. కానీ ఉద్యాన శాఖ అధికారులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించటం లేదు. ఎవరైన వారి వద్దకు వెళ్లి అడిగితే మినహా వివరాలు తెలియడం లేదు. గడచిన మూడేళ్లలో ఉల్లిసాగు చేసే ప్రాంతాల్లో ఉన్నతాధికారులు ఎవరూ వచ్చిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నాం..
ఉల్లిసాగు చేసే రైతులకు 50 శాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నాం. ఉద్యానశాఖలో సిబ్బంది కొరత ఉంది. సమైక్యాంధ్ర సమ్మె, వరదల కారణంగా ఉల్లిసాగుపై అవగాహన సదస్సులు నిర్వహించలేక పోయాం. రబీలో సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపడతాం.
- ఉద్యానశాఖ ఏడీహెచ్ బెన్ని
Advertisement