Koritepadu
-
జిల్లాలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా
- కలెక్టర్ కాంతిలాల్ దండే - బ్యాంకర్లు, అధికారులతో సమీక్ష - మార్చి 31, 2016 నాటికి నూరుశాతం ఖాతాలు - ఖాతా ఏర్పాటు ప్రక్రియ మాచర్ల నుంచి ప్రారంభం కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలోని ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల, బ్యాంకు అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12,96,109 కుటుంబాలతో 48 లక్షల 87 వేల 813 మంది జనాభా ఉన్నారని తెలిపారు. 9 లక్షల 54వేల 813 కుటుంబాలు వివిధ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. మిగిలిన 3,41,820 కుటుంబాలకు అనగా దాదాపు 7 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉందని తెలిపారు. అందరికీ బ్యాంకుఖాతా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని ఈనెల 28న దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఈనెల 28న సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా పరిషత్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలుత బ్యాంకు ఖాతాలు లేని వారి జాబితాలు రూపొంచాల్సి ఉందన్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుశాఖల అధికారులు, బిజినెస్ కరస్పాండెంట్లు ద్వారా బ్యాంకు ఖాతాలతో కలిగే ప్రయోజనాలపై ప్రచారం కల్పించాలన్నారు. 2015 మార్చి 31వ తేదీ నాటికి 50 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చే యాలని చెప్పారు. 2016 మార్చి 31వ తేదీ నాటికి నూరుశాతం ఖాతాలు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతా ఏర్పాటు ప్రక్రియ తొలుత పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు ఏజీఎం కె.రత్నకుమారి, ఎల్డీఎం శ్రీనివాసశాస్త్రి, నాబార్డు, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ, డీఆర్డీఏ, డ్వామా అధికారులు పాల్గొన్నారు. -
ముందంజ
స్వాతంత్య్ర వేడుకల్లో సంక్షేమ పథకాలపై మంత్రి ప్రత్తిపాటి కొరిటెపాడు(గుంటూరు) : సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో నిలిచిందని రాష్ట్ర వ్య వసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ప్రజల భాగ స్వామ్యంతోనే నిర్దేశించిన లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని మంత్రి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జిల్లా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. పంటల బీమా పథకాన్ని సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. నాగార్జున సాగర్ జవహర్ కుడి కాలువ ఆధునికీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు రూ.4,444 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ ఖరీఫ్ సాగుకు 132 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది. గుంటూరు చానల్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లతోప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 286 కోట్ల అంచనా విలువతో 12 ఎత్తిపోతల పథకాల ద్వారా 29,082 ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించనున్నాం. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా 8,376 మందికి రూ.63.87 కోట్లు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల లక్ష్య సాధనలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 40 వేల కుటుంబాలకు 50 రోజుల పనిదినాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. గ్రామాల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద సెప్టెంబరు 30వ తేదీలోపు లక్షా 25 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2 నుంచి ఎన్టీఆర్ సుజల పథకం మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అదనపు సంయుక్త కలెక్టర్ కె.నాగేశ్వరరావు, అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు రాజేష్‌కుమార్, పి.హెచ్.డి.రామకృష్ట, అన్నిశాఖల ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నేటితో ప్రచారానికి తెర
కొరిటెపాడు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. రాజకీయ పార్టీల మైకుల మోతతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో మూగబోనున్నాయి. గత నెల 23వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. పోటాపోటీగా ర్యాలీలతో హోరెత్తించారు. ఇప్పటి వరకు ఇంటింటికి తిరుగుతూ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి పోస్టర్లు, కరపత్రాలు పంచుతూ తమకు ఓటేయాలని, మీ సమస్యలు తీరుస్తానని హామీలు గుప్పించారు. వాహనాలకు మైకులు అమర్చి, ప్లెక్సీలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ముమ్మర ప్రచారం చేశారు. జిల్లాలో అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌నారాయణ, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, బి.వి.రాఘవులు వంటి నాయకులంతా ప్రచారంలో పాలుపంచుకున్నారు. వీరేగాకుండా సినీపరిశ్రమకు చెందిన పలువురు సైతం టీడీపీ, వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేపట్టారు. సోమవారం చివరి రోజు కావటంతో అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పర్యటించని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ప్రచారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆందోళన
కొరిటెపాడు, న్యూస్‌లైన్: ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు మాత్రమే తాము పనికి వస్తామా అంటూ నగర తెలుగు యువత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలంయంలో శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గం సర్వసభ్య సమావేశం తెలుగు యువత అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. తూర్పు నియోజకవర్గ సమావేశం జరుగుతుంటే నగర తెలుగు యువత అధ్యక్షుడు సౌపాటి రత్నానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవటం ఏమిటని రత్నం అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వారిని బయటకు నెట్టివేశారు. సమావేశంలోనూ అసమ్మతి నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించి, వర్గపోరు బయట పడకుండా నాయకులు జాగ్రత్తపడ్డారు. -
జిల్లా వ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయటంతోపాటు బ్యాంకింగ్ రంగంలో తిరోగమన సంస్కరణలను వ్యతిరేకిస్తూ యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంక్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూతపడ్డాయి. కొన్ని బ్యాంకుల ఏటీఎంలు కూడా మూతపడటంతో లావాదేవీలు నిలిచిపోయి ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకు, ఎస్బీహెచ్, సెంట్రల్ బ్యాంకులతోపాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులక చెందిన మొత్తం 410 బ్రాంచిల వరకు మూతపడ్డాయి. గ్రామీణ బ్యాంకులు 75, కో ఆపరేటివ్ బ్యాంకులు 33 బ్రాంచిలు మాత్రమే పని చేశాయి. 10వ వేతన ఒప్పందం ఉమ్మడి చార్టర్‌ను వెంటనే ఖరారు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా 3500 మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వేతన ఒప్పందాన్ని ఖరారు చేయండి కొరిటెపాడు ఆంధ్రాబ్యాంక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో వేతన ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 23న యు.ఎఫ్.బి.యు సమావేశంలో భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పి.శివాజి, పలు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి సాగుకు ప్రోత్సాహం కరువు
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. మరి అంతగా ప్రస్తుతించే ఉల్లిని జిల్లా ఉద్యానశాఖ అధికారులు మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఉల్లి సాగుచేసే రైతుల దరి చేర్చటం లేదు. ఫలితంగా జిల్లాలో ఉల్లి సాగు సాధారణ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఉల్లి ధర చుక్కలనంటుతున్నా సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు కనీసం ప్రచారం కూడా చేయటం లేదు. జిల్లాలో గతేడాది 700 హెక్టార్లలో సాగు చేయగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రైతులు పంట వేసింది 598 హెక్టార్లలో మాత్రమే. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీ ఇవ్వటానికి ఈ సంవత్సరం రూ.45 లక్షలు కేటాయించారు. వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంట మినహా ఏ పంటకైనా కేటాయించవచ్చు. కానీ,ఉల్లికి కేటాయించింది నామ మాత్రమే. జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, ఫిరంగిపురం, నరసరావుపేట ప్రాంతాలు ఉల్లి సాగుకు అనుకూలం. ఈ ప్రాంతాల్లోని భూముల్లో ఉల్లిసాగుపై ప్రత్యేక దృష్టి పెడితే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. అవగాహన కల్పన లో విఫలం.. ఉల్లి సాగుపై ఆసక్తిని పెంచడానికి, ప్రోత్సాహకాలపై రైతులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలి. కానీ ఉద్యాన శాఖ అధికారులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించటం లేదు. ఎవరైన వారి వద్దకు వెళ్లి అడిగితే మినహా వివరాలు తెలియడం లేదు. గడచిన మూడేళ్లలో ఉల్లిసాగు చేసే ప్రాంతాల్లో ఉన్నతాధికారులు ఎవరూ వచ్చిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నాం.. ఉల్లిసాగు చేసే రైతులకు 50 శాతం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నాం. ఉద్యానశాఖలో సిబ్బంది కొరత ఉంది. సమైక్యాంధ్ర సమ్మె, వరదల కారణంగా ఉల్లిసాగుపై అవగాహన సదస్సులు నిర్వహించలేక పోయాం. రబీలో సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపడతాం. - ఉద్యానశాఖ ఏడీహెచ్ బెన్ని