ముందంజ
స్వాతంత్య్ర వేడుకల్లో సంక్షేమ పథకాలపై మంత్రి ప్రత్తిపాటి
కొరిటెపాడు(గుంటూరు) : సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో నిలిచిందని రాష్ట్ర వ్య వసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ప్రజల భాగ స్వామ్యంతోనే నిర్దేశించిన లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని మంత్రి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జిల్లా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. పంటల బీమా పథకాన్ని సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.
నాగార్జున సాగర్ జవహర్ కుడి కాలువ ఆధునికీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు రూ.4,444 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ ఖరీఫ్ సాగుకు 132 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది.
గుంటూరు చానల్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లతోప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 286 కోట్ల అంచనా విలువతో 12 ఎత్తిపోతల పథకాల ద్వారా 29,082 ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించనున్నాం.
షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా 8,376 మందికి రూ.63.87 కోట్లు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల లక్ష్య సాధనలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది.
మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 40 వేల కుటుంబాలకు 50 రోజుల పనిదినాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం.
గ్రామాల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద సెప్టెంబరు 30వ తేదీలోపు లక్షా 25 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అక్టోబరు 2 నుంచి ఎన్టీఆర్ సుజల పథకం మొదటి దశ ప్రారంభం కానుంది.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అదనపు సంయుక్త కలెక్టర్ కె.నాగేశ్వరరావు, అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు రాజేష్‌కుమార్, పి.హెచ్.డి.రామకృష్ట, అన్నిశాఖల ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.