- కలెక్టర్ కాంతిలాల్ దండే
- బ్యాంకర్లు, అధికారులతో సమీక్ష
- మార్చి 31, 2016 నాటికి నూరుశాతం ఖాతాలు
- ఖాతా ఏర్పాటు ప్రక్రియ మాచర్ల నుంచి ప్రారంభం
కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలోని ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల, బ్యాంకు అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12,96,109 కుటుంబాలతో 48 లక్షల 87 వేల 813 మంది జనాభా ఉన్నారని తెలిపారు. 9 లక్షల 54వేల 813 కుటుంబాలు వివిధ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. మిగిలిన 3,41,820 కుటుంబాలకు అనగా దాదాపు 7 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉందని తెలిపారు. అందరికీ బ్యాంకుఖాతా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని ఈనెల 28న దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారని చెప్పారు.
ఈనెల 28న సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా పరిషత్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలుత బ్యాంకు ఖాతాలు లేని వారి జాబితాలు రూపొంచాల్సి ఉందన్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుశాఖల అధికారులు, బిజినెస్ కరస్పాండెంట్లు ద్వారా బ్యాంకు ఖాతాలతో కలిగే ప్రయోజనాలపై ప్రచారం కల్పించాలన్నారు. 2015 మార్చి 31వ తేదీ నాటికి 50 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చే యాలని చెప్పారు.
2016 మార్చి 31వ తేదీ నాటికి నూరుశాతం ఖాతాలు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతా ఏర్పాటు ప్రక్రియ తొలుత పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు ఏజీఎం కె.రత్నకుమారి, ఎల్‌డీఎం శ్రీనివాసశాస్త్రి, నాబార్డు, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ, డీఆర్‌డీఏ, డ్వామా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా
Published Tue, Aug 26 2014 2:09 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement
Advertisement