కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయటంతోపాటు బ్యాంకింగ్ రంగంలో తిరోగమన సంస్కరణలను వ్యతిరేకిస్తూ యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంక్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూతపడ్డాయి. కొన్ని బ్యాంకుల ఏటీఎంలు కూడా మూతపడటంతో లావాదేవీలు నిలిచిపోయి ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జిల్లాలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకు, ఎస్‌బీహెచ్, సెంట్రల్ బ్యాంకులతోపాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులక చెందిన మొత్తం 410 బ్రాంచిల వరకు మూతపడ్డాయి. గ్రామీణ బ్యాంకులు 75, కో ఆపరేటివ్ బ్యాంకులు 33 బ్రాంచిలు మాత్రమే పని చేశాయి. 10వ వేతన ఒప్పందం ఉమ్మడి చార్టర్‌ను వెంటనే ఖరారు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా 3500 మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
వేతన ఒప్పందాన్ని ఖరారు చేయండి
కొరిటెపాడు ఆంధ్రాబ్యాంక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో వేతన ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 23న యు.ఎఫ్.బి.యు సమావేశంలో భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పి.శివాజి, పలు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు
Published Thu, Dec 19 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement