అమ్మబోతే.. కన్నీళ్లు!
అమ్మబోతే.. కన్నీళ్లు!
Published Sat, Oct 22 2016 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
‘ఉల్లి’కిపాటు
- పెట్టుబడి కూడా దక్కని దయనీయం
- సగటున క్వింటాకు లభిస్తున్న ధర రూ.50 నుంచి రూ.80 మాత్రమే
- పొలంలోనే పంటను దున్నేస్తున్న రైతులు
- వంకలు, రోడ్ల పక్కన గుట్టలుగా దిగుబడులు
- మద్దతు ధర కొందరికే..
- కొనుగోళ్లలోనూ వ్యాపారుల చేతివాటం
డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఐదెకరాల్లో ఉల్లి సాగు చేశాడు. దిగుబడి ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు వచ్చింది. కర్నూలు మార్కెట్‌కు తరలించాలంటే క్వింటాకు రూ.80 వరకు ఖర్చవుతుంది. పైగా అన్‌లోడింగ్ చార్టీలు, ఏజెంట్ కమీషన్ ఇతరత్రాలు అదనం. ఈ నేపథ్యంలో పండించిన ఉల్లిని రోడ్డున పడేశాడు.
కర్నూలు(అగ్రికల్చర్)/డోన్: రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. మహారాష్ట్ర తర్వాత ఉల్లి అత్యధికంగా పండేది ఇక్కడే. ఈ ఏడాది జిల్లాలో 25వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. రైతులు వంద శాతం నష్టాలను మూట కట్టుకున్నారు. ఉల్లి ధరను మహారాష్ట్ర ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్రలో పంట బాగా ఉంటే ఇక్కడ పండిన ఉల్లికి డిమాండ్ ఉండదు. అక్కడ ఉల్లి పంట లేకపోతే కర్నూలు ఉల్లికి మంచి రోజులు వస్తాయి. ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి మరీ ఎక్కువగా ఉండటం, ఆ ఉల్లి దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతుండటం వల్ల కర్నూలు ఉల్లికి ఎప్పుడూ లేని విధంగా ధర పడిపోయింది. జిల్లాలో ఉల్లి పంటను దాదాపు 40వేల మంది రైతులు సాగు చేశారు. సగటున ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడిగా పెట్టారు. ఇందులో దాదాపు 15 శాతం మంది రైతులకు క్వింటాకు లభించిన ధర కేవలం రూ.50 నుంచి రూ.80 మాత్రమే. దాదాపు 15 శాతం మంది రైతులు పంటను పొలంలోనే దున్నేశారు. కొందరు పశువులు, గొర్రెలు, మేకలకు వదిలేశారు. మరికొందరు తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు తీసుకొస్తే.. ‘‘అబ్బే, ఉల్లి నాణ్యత బాగోలేదు’’ అంటూ వ్యాపారులు కొనకుండా తరస్కరిస్తున్నారు. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో మార్కెట్‌లోనే దిగుబడిని వదిలేసి వెళ్లిన రైతులు కోకొల్లలు. ఉల్లి సాగు చేసి పూర్తి స్థాయిలో పెట్టుబడి దక్కించుకున్న రైతులు ఒక్కరు కూడా లేకపోవడం గమానార్హం.
వేలాది క్వింటాళ్లు వంకల పాలు
ఉల్లి ధరలు పడిపోవడంతో మార్కెట్‌కు తరలించి నష్టాలను మూట కట్టుకోలేక వేలాది క్వింటాళ్ల ఉల్లిని వంకలు, రోడ్ల పాలు చేశారు. కోడుమూరు ప్రాంతంలోనే దాదాపు 1000 క్వింటాళ్లను వంకల్లో పారబోశారు. ఉల్లి అత్యధికంగా కోడుమారు, సి.బెళగల్, డోన్ ప్రాంతాల్లో సాగవుతుంది. 80శాతం మంది రైతులు ఉల్లిని పొలంలోనే వదిలేయడం.. వంకలు, రోడ్ల పక్కన పారబోశారు. డోన్‌లో సురేష్ అనే రైతు రీటైల్‌గా వినయోగదారులకు కిలో రూపాయి ప్రకారం పంపిణీ చేశారు. నెల రోజుల వ్యవధిలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో దాదాపు 2వేల క్వింటాళ్లు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వదిలి వెళ్లినట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉల్లి రైతును కదిలించినా కన్నీటి గాథలే. వెరసి ఉల్లి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
మద్దతు కొందరికే..
రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం క్వింటాకు రూ.600 మద్దతు ధర ప్రకటించింది. ఇందులో రైతుకు ఇచ్చేది గరిష్టంగా క్వింటాకు రూ.300 మాత్రమే. అదీ కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకున్న రైతులకే అమలు చేస్తారు. అంతదూరం తీసుకెళ్లినా ‘‘ఉల్లి నాణ్యత బాగోలేదు.. గ్రేడింగ్ రాదు.. కొనలేం’’ అని వ్యాపారులు చేతులెత్తేస్తే మా పరిస్థితి ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టులో అత్యధికంగా ఉల్లి విక్రయించగా.. ధరలు లేక రైతులు అనేక సార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. అయితే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సెప్టెంబర్ నెల నుంచి కొనుగోలు చేసిన ఉల్లికే మద్దతును అమలు చేస్తున్నారు. మొత్తంగా ఉల్లికి మద్దతు ధర కేవలం 30శాతం రైతులకు మాత్రమే దక్కుతోంది.
Advertisement