
పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, చిత్రంలో యలమంచిలి శివాజీ, కొల్లురవీంద్ర
సాక్షి, అమరావతి/ఆత్కూరు (గన్నవరం): అన్నం పెట్టే చేతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయం గురించి ఆలోచించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ’ఆరుగాలం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం విజయవాడలో జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ రైతుకు శాశ్వత న్యాయం జరగాలంటే మౌలిక వసతులు కల్పించాలే తప్ప రుణమాఫీ వంటి ఉపశమన చర్యలు పరిష్కారమార్గం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విస్మరణకు గురైన రంగం వ్యవసాయమేనని, దాన్ని ప్రస్తుతం సవరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
రైతు దృక్పథంలోనూ మార్పు రావాలని, అదనపు విలువ జోడింపు, ఆహార శుద్ధి, పంటల మార్పిడి, ఈ–నామ్ వంటి వాటిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నూటికి 40 శాతం మందికే వ్యవస్థాగత రుణ సౌకర్యం లభిస్తోందని, మిగతా 60 శాతం మంది ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారని, పంటల బీమా రంగంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. సాగుతో పాటు పాడి, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలపైనా దృష్టి పెడితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పుస్తక రచయిత యలమంచిలి శివాజీని ఘనంగా సత్కరించారు. పుస్తకం ప్రచురించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు రైతులకు చేస్తున్న సేవను కొనియాడారు. అనంతరం నిర్వాహకులు ఉపరాష్ట్రపతిని ఘనంగా సన్మానించారు. మంత్రి కొల్లు రవీంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పుస్తకావిష్కరణ
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పోలూరు హనుమజ్జానకీరామశాస్త్రి రచించిన జీవితం–సాహిత్యం సంకలన పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల వలన కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయన్నారు. యువత వీటి బారిన పడకుండా మన జీవన విధానాన్ని కొనసాగించాలన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కేఎల్ వర్సిటీని అభినందించారు.