నిలిచిన ఉల్లి కొనుగోళ్లు
Published Wed, Nov 9 2016 9:04 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
రైతుల ఆందోళన
కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద నోట్ల రద్దు వ్యవసాయ మార్కెట్ యార్డులపై తీవ్ర ప్రభావం చూపింది. కరెన్సీ కొరత కారణంగా పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలు స్తంభించిపోయారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోలు చేసే ఉల్లిని 80 శాతం వరకు కోల్‌కతకు తరలిస్తారు. ఇందుకు అడ్వాన్స్‌ల కింద 50 శాతం బాడుగలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్లు ఉన్నా పనికిరాకపోవడం, బ్యాంకులు పనిచేయకపోవడం, ఏటీఎంలు మూతపడటంతో వ్యాపారులు బాడుగలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు బుధవారం సాయంత్రం రోడ్డెక్కారు. తక్షణం ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలంటూ ఆందోళన చేపట్టారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు, లారీ ఓనర్ల అసోషియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గురువారం ఉల్లి వేలంపాట నిర్వహించాల్సిందేనని రైతులు మార్కెట్ కమిటీపై ఒత్తిడి పెంచారు.
ఎన్నిరోజులుండాలి: పాపన్న, ఉల్చాల, కర్నూలు మండలం
మూడు రోజుల క్రితం 37 ప్యాకెట్ల ఉల్లిని తీసుకొని మార్కెట్‌కు వచ్చాం. వ్యాపారులు కొనుగోలు చేయలేదు. ఈ రోజు కొనుగోలు చేయాల్సి ఉండగా పెద్ద నోట్లు చెల్లుబాటు కావడం లేదని చెప్పారు. ఈ కారణంతో ఉల్లి కొనుగోళ్లు బంద్ చేస్తే మా పరిస్థితి ఏమిటి, ఎన్నాళ్లు మార్కెట్‌లో ఉండాలి?
Advertisement