
వరుణ దేవా...కరుణ లేదా?
ఖరీఫ్ వచ్చేసింది. చినుకు రాలదు. నేల తడవదు. నాగలి కదలదు. ఎండలు తగ్గవా? వర్షాలు ఎప్పుడు పడతాయి? విత్తులు ఎప్పుడు వేయాలి? ఉభాలు ఎలా చేయాలి. పంట ఎప్పుడు పండించాలి. పరిపరి విధాలా సాగుతున్న ఆలోచనలతో అన్నదాత మనసు ఆందోళన చెందుతోంది. ఇంతవరకు చినుకు రాలకపోవడంతో ఈ ఏడాది సాగు కష్టమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమైన కారణంగా ఈ ఏడాది వర్షాలు ఊరిస్తున్నాయి. గత నెలాఖరు వరకు అడపాదడపా కురిసిన వర్షాలు కచ్చితంగా పడాల్సిన జూన్ నెలలో అడ్రస్ లేకుండా పోయాయి. ఫలితంగా చెరువులు, గుంతలు నీరు లేక వెలవెలబోతు న్నాయి. నారుపోయడానికి రైతులు మడులను సిద్ధం చేసి ఉంచారు. వరుణుడు కరుణిస్తే నారు పోయాలని చూస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రైతులతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు వర్షాలు పడక, ఎండ తీవ్రత తగ్గక జిల్లా ప్రజలు కూడా వేసవి తాపంతో అల్లాడుతున్నారు.
విజయనగరం వ్యవసాయం: ఒక ఏడాది కరువుతో కష్టాలు. మరో ఏడాది తుపానుతో నష్టాలు. వరుసగా నాలుగేళ్ల నుంచి అన్నదాత అష్టకష్టాలు పడుతున్నా డు. దీంతో సాగుకోసం పెట్టిన పెట్టుబడుల మీద కూడా ఆశలు వదులుకున్నాడు. అంతే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వ్యవసాయం తప్ప మరే ఇతర పనీ చేతకాని రైతన్న సంప్రదాయంగా వస్తున్న అలవాటును వదులుకోలేక.. ఖరీఫ్ సీజన్ వచ్చేయడంతో మళ్లీ సాగు కోసం ఆరాట పడుతున్నాడు. నాలుగేళ్లుగా కష్టాలు అనుభవించినప్పటికీ ఏ క్షణంలోనైనా వర్షం పడితే చాలు.. సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.
పెట్టుబడి కోసం..
వర్షం పడగానే నారు వేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర పెట్టుబడులకు రైతుల దగ్గర చిల్లిగవ్వ లేదు. ఖరీఫ్ సాగు కోసం ప్రతి ఏడా ది రైతులు మే, జూన్ నెలల్లో పంటరుణాలను తీసుకుని పెట్టుబడులు పెడతారు. అయితే అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం కూడా మానేశా యి. రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం దాని సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడంతో రుణాలు అందడం ప్రహసనంగా మారింది. దీంతో రుణాలు ఎప్పుడు అందుతాయోనని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అస లు అందుతాయో లేదోనని కూడా మధన పడుతున్నారు. ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుం దా లేదా కమిటీ పేరిట కాలయాపన చేస్తుందో అర్థం కాక రైతులు అయోమయ స్థితిలో ఉన్నా రు. ప్రభుత్వం గాని చేతులెత్తేస్తే వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
2.20 లక్షల హెక్టార్లలో సాగు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటలు కలి పి 2.20 లక్షల హెక్టార్ల వరకు సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందులో లక్షా 20వేల హెక్టార్లలో వరి పంట, మిగిలిన లక్ష హెక్టార్లలో మొక్కజొన్న, చోడి, శెనగ, వేరుశెనగ, చెరుకు, పత్తి, గోగు సాగవుతుందని అధికారుల అంచనా. రైతుల కోసం 92 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 45,500 క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు సిద్ధం చేశారు. ప్రైవేట్ డీలర్లకు విత్తనాలను సరఫరా చేశారు. వారు రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నారు. డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు రైతుల వద్ద డబ్బులు లేకపోవడంతో సాగు ఏవిధంగా చేపట్టాలో అర్థం కాక రైతులంతా బిత్తర చూపులు చూసున్నారు.
సాగు ప్రశ్నార్థకమే
ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టడానికి అవసరమైన నీరు, పెట్టుబడి రైతు దగ్గర లేవు. దీంతో ఈఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారింది. వరుణుడు నాలుగు, ఐదు రోజుల్లో కరుణించని రుణాలు అందే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఫలితంగా ఈఏడాది సాగు అయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికితోడు సాగు కలిసి రాకపోవడంతో కొంతమంది రైతులు సాగు పట్ల వెనుకడుగు వేస్తున్నారు. గత ఏడాది కూడా 20 వేల హెక్టార్ల వరకు సాగుకు నోచుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎండుతున్న చెరువులు
నీరు లేకపోవడం వల్ల చెరువులు, గుంతలు ఎండిపోతున్నాయి. నీటితో కళకళలాడిల్సిన చెరువులు కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 10వేల వరకు చెరువులు ఉన్నాయి. అన్నింటిదీ ఇదే పరిస్థితి. మండుతున్న ఎండల కారణంగా ఉన్న కొద్ది పాటి నీరు కూడా ఆవిరవుతోంది.
వర్ష సూచనలు లేవు
జూన్ నెలలో వర్షాలు కురవాలి. ఇంతవరకు వర్షాలు పడలేదు. వర్షాలు పడేసూచనలు కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇందుకోసం ప్రత్నామాయ ప్రణాళికను సిద్ధం చేశాం.
-డి.ప్రమీల, వ్యవసాయశాఖ జేడీ
ప్రకృతి పగబట్టినట్లుంది
ప్రతి ఏడాదీ ఈ సమయానికి ఎంతోకొంత వర్షాలు పడేవి. ఈ ఏడాది ఇంతవరకు పడలేదు. ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. నారుమడులను సిద్ధం చేసి ఉంచాం. అయితే విత్తనాలు, ఇతర పెట్టుబడులు కోసం బ్యాంకు రుణం కోసం ఎదురుచూస్తున్నాం. రుణాల గురించి అడగొద్దని బ్యాంకు అధికారులు అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-పొటుపురెడ్డి రమణ, రైతు, పినవేమలి, విజయనగరం మండలం