పొంచి ఉన్న ఫైలిన్
Published Thu, Oct 10 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తూర్పు ఆగ్నేయ దిశగా పయనించి రానున్న 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. దీనికి ఫైలిన్ అని నామకరణం చేశారు. ఇప్పటికే అండమాన్ దాటేసిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం నుంచే తీర ప్రాంతంలో గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
ఈ మేరకు మత్స్యకారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం విశాఖ తీరానికి 1100 మీటర్ల దూరంలో అల్పపీడన ద్రోణి ఉన్నట్టు హేమరేడియో ఇన్‌చార్జ్ అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి. 10వ తేదీన 75 నుంచి 85, 11న 115 నుంచి 155, 12న నుంచి 180 నుంచి కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 13, 14 తేదీల్లో ఈదురుగాలులు తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 12 గంటలు గడిస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. తీవ్రంగా వీచే గాలుల వల్ల పూరిపాకలు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదముందని అధికారులు హెచ్చరిం చారు. తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, ఒడిశాలోని పారాదీప్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
మత్స్యకారులూ బహుపరాక్
పూసపాటిరేగ: తీరప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని తహశీల్దార్ వి.పద్మావతి హెచ్చరించారు. చింతపల్లి, పతివాడ బర్రిపేట , తిప్పలవలస ,కోనాడ గ్రామాలతో పాటు భోగాపురం మండలాల్లో ఉన్న తీర ప్రాంతగ్రామాలలో మత్స్యకార్లు అప్రమత్తంగా వుండాలను సూచించారు. సముద్రంలోకి వేటకు వెళ్లరాదని పేర్కొన్నారు. సూచించారు.
Advertisement
Advertisement