తుపాను గండం గడిచింది
Published Sun, Oct 13 2013 12:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
తప్పిన ముప్పుపెను ముప్పు తప్పింది. తుపాను గండం గడిచింది. దాదాపు 48 గంటలపాటు తీవ్ర భయాందోళనకు గురిచేసిన ‘పై-లీన్’ తుపాను ఒడిశాలో తీరాన్ని తాకడంతో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. ప్రధానంగా జిల్లాలోని ఆరు తీరప్రాంత మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. పై-లీన్ తుపాను హెచ్చరికలతో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సైతం వెనక్కు వచ్చేశారు. బోట్లు, నావలు, వలలను భద్ర పరుచుకున్నారు. మరో విపత్తుకు సమాయత్తమయ్యారు. పై-లీన్ పెను తుపానుగా మారిందని తెలిసి భయకంపితులయ్యారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సాధనా సంపత్తిని సిద్ధం చేసుకున్నారు. తీరంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైన తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సైతం రంగంలోకి దిగింది. శనివారం రాత్రి పై-లీన్ తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకడంతో పెను ముప్పు తప్పిందని వెల్లడించిన అధికారులు మరో 24 గంటలపాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రజలను అప్రమత్తం చేశారు.
సాక్షి, గుంటూరు:‘పై-లీన్’ తుపాను ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద శనివారం రాత్రి తీరాన్ని తాకింది. దీని ప్రభావం మరో 24 గంటలపాటు జిల్లాపై వుంటుందని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు పడతాయని ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్ అన్ని మండలాల తహశీల్దార్‌లతో మాట్లాడారు. తుపాను చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సెట్‌కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిచ్చారు. తీరప్రాంత మండలాలైన బాపట్ల, కర్లపాలెం, రేపల్లె, నగరం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నంలో పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారులు జిల్లా కేంద్రానికి సమాచారం అందజేస్తున్నారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారుల వేటపై నిషేధాజ్ఞలు వున్నాయి. సూర్యలంకలో 20 మీటర్ల మేర సముద్రం ముందుకు రాగా, అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. బాపట్ల మండలం అడవిపందులపాలెం వద్ద ఈదురు గాలులు భారీగా వీస్తున్నాయి.
జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ నిజాంపట్నం వద్ద మెరైన్‌బోటులో ప్రయాణించి తీర ప్రాంత పరిస్థితిని పరిశీలించారు. మూడ్రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు డెల్టాలోని నల్లమడ, పెరలి, వెదుళ్లపల్లి, ఈపూరుపాలెంలో డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. రైతుల్లో గుండెదడ... జిల్లాలో ‘పై-లీన్’ తుపాను ఉధృతికి డెల్టాలో వరితో పాటు ఉద్యాన, వాణిజ్య పంటలు అక్కడక్కడ లంకగ్రామాల్లో నీటమునిగాయి. పంటనష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలోని పొలాల నుంచి జేసీబీలు, డీజిల్ ఇంజిన్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. సగటున ఎకరాకు రూ. 15వేల చొప్పున నష్టం వాటిల్లగా, కౌలురైతుకు ఎకరాకు రూ. 25 వేలు వరకు ఆర్థికభారం పడింది.
తీరప్రాంతగ్రామాలపై అధికారుల దృష్టి
బాపట్లటౌన్: 36 గంటలపాటు ప్రశాంతంగా కనిపించిన సముద్రతీరం ఒక్కసారిగా శనివారం రాత్రి అల్లకల్లోలంగా మారింది. దీనికితోడు తీరప్రాంత గ్రామాల్లో ఈదురు గాలులు బలంగా వీయటం, సముద్రంలో రెండు నుంచి మూడు మీటర్ల మేర ఎత్తులో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతప్రజలు కొంతమేర ఆందోళన చెందారు. అయితే తుపాను తీరం దాటే సమయంలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ముందుగా తెలియజేయడంతో కొంతమేర ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యంగా బాపట్ల మండలం కృపానగర్, దాన్వాయ్‌పేట, సూర్యలంక, రామచంద్రాపురం, కర్లపాలెం మండలంలో పేరలి, తుమ్మలపల్లి, నర్రావారిపాలెం, పెదపులుగువారిపాలెం, పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరో 48 గంటలపాటు ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
పొంగిపొర్లుతున్న డ్రెయిన్లు...
పై-లీన్ తుపాను ప్రభావంతో మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీర ప్రాంత మండలాల్లోని డ్రెయిన్లు పరవళ్ళుతొక్కుతున్నాయి. భారీ వర్షాలతోపాటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో డ్రెయిన్లకు సముద్రపు నీరు ఎగతన్నుతోంది. దీంతో డ్రెయిన్లకు గండ్లుపడే ప్రమాదం వుందని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా నల్లమడ, పేరలి, వెదుళ్ళపల్లి, ఈపూరుపాలెం డ్రెయిన్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెదుళ్ళపల్లి డ్రెయిన్‌కు ఇటీవల మరమ్మతులు నిర్వహించడంతో కరకట్టల మట్టి కరిగిపోయి అక్కడక్కడ కోతకు గురయ్యే అవకాశం ఉంది.
Advertisement
Advertisement