తరుముకొస్తున్న తుఫాన్
Published Thu, Oct 10 2013 4:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు పెను తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా.. ఆనక పెను తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా తీరం వైపు శరవేగంగా దూసుకొస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సమైక్య సమ్మెలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే తుపాను సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం అండమాన్ సమీపంలో కేంద్రీకృతమై ఉన్న పైలీన్ తుపాను ఉత్తర కోస్తా వైపు కదులుతోంది.
ఇది ఈ నెల 12 నాటికి కళింగపట్నం, పారాదీప్‌ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం, విపత్తు నివారణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉద్యోగులందరూ సమ్మెలో ఉండటంతో ముందుగా వారిని విధుల్లో చేరే లా ఒప్పించేందుకు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆయా శాఖల జేఏసీల ప్రతినిధులను కోరారు. సమ్మెలో కొనసాగుతూనే సహాయ చర్యల్లో పాల్గొంటామని వారు కలెక్టర్‌కు హామీ ఇచ్చా రు. జిల్లాలోని 11 సముద్ర తీర మండలాలతోపాటు వంశధార, నాగావళి తీర గ్రామాలను అప్రమత్తం చేయడంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించే విషయంలోనూ సహకరిస్తామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సమాచారం అందజేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉన్నతాధికారులతో సమీక్ష
తుపాను పరిస్థితి, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశమున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గురువారం ఉదయం 10 గంటలతో అన్ని శాఖల అధికారులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. తీర మండలాల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్. రాజకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, రెవెన్యూ డివిజనల్ అధికారులు జి.గణేష్‌కుమార్, వి. విశ్వేశ్వరరావు, బి.దయానిధి, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్లు బి.రాంబాబు, బి.వి.ఎస్.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల వేటకు వెళ్లరాదు
సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచించారు. పురపాలక సంఘాలు, గ్రామాల్లోనూ పారిశుద్ధ్యంపై తగు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి, పురపాలక సంఘాల కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. జనరేటర్లు, ఇతర అత్యవసర సామగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్తు వ్యవస్థ, రహదారులు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వరద ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను తరలించేందుకు తుపాను షెల్టర్లు, సహాయ పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, ఆహార పదార్థాల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉంచే బాధ్యతను ఆయా మండలాల డీలర్లకు అప్పగించారు.
జిల్లా అంతటా భారీ వర్షాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: తుపాను ప్రభావం అప్పుడే జిల్లాపై పడింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలుల తీవ్రత కూడా పెరిగింది. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం పోయిన కరెంటు రాత్రి 7 గంటలకు వచ్చింది. గంట వ్యవధిలోనే గాలుల తాకిడికి మళ్లీ పోవడంతో పట్టణాలు, గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు : 08942-240557, 9652838191
Advertisement