సాక్షి, ఒంగోలు: రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కగా మారింది. బ్యాంకుల రుణాలు చెల్లించొద్దని చెప్పినవారే.. నేడు నెత్తిన బండ మోపుతున్నారు. రైతు రుణమాఫీ అమలు చేతగాదంటూ చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా రోజుకో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ‘తొలిసంతకం’ అమల్లోకి రాకపోవడంపై అంతటా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఆయన రాష్ర్ట బ్యాంకర్లతో సమావేశమైనా.. ఆర్‌బీఐకి లేఖలు రాసి అనుకూల స్పందన రాలేదు.
ఈక్రమంలో మెడపై కత్తిని కొంతకాలం దూరంపెట్టేందుకే రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదన తెచ్చినట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే, ఏదో ఒక కారణం లేనిదే రీషెడ్యూల్ చేయడం కుదరదని ఆర్‌బీఐ చెప్పడంతో కిందటేడాది తుపాను, కరువును తెరమీదికి తెచ్చారు. మొత్తానికి రుణాల మాఫీ హామీ దాటవేతకు ముఖ్యమంత్రి రైతులను తిమ్మినిబమ్మిని చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
సరిగ్గా పదేళ్ల కిందట టీడీపీ అధికారంలో ఉండగా, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తుపాను ప్రభావిత మండలాల్లో పర్యటిస్తూ.. ‘వ్యవసాయం దండగ మారిదని...’ వ్యాఖ్యానించిన విషయం రాష్ట్రవ్యాప్త సంచలనమైంది. అప్పట్నుంచి రైతువ్యతిరేకి అనే అపనిందను తొలగించుకునేందుకు టీడీపీ పాట్లు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం రుణాలమాఫీ ఆచరణ కాదంటూ.. రీషెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో బాబు గతకాలపు ఏలుబడిని రైతులు మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కొత్తప్రభుత్వం పాతరుణాలు మాఫీతో కొత్తగా ఖరీఫ్‌సాగు పెట్టుబడులొస్తాయని ఆశించిన రైతన్నకు భవిష్యత్ అగమ్యగోచరమైంది.
జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు.
వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు.
మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల విలువైన రైతు రుణాలు మాఫీకావాల్సి ఉంది.
జిల్లాలో 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే మరో రూ.488.67 కోట్ల మేరకు మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ ప్రకటనల నాటినుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని.. బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత రుణాలు రైతుపేరు మీదే..
రుణాల రీషెడ్యూల్ అమలుపై సోమవారం ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే, ఈవిధానాన్ని కూడా జిల్లామొత్తం వర్తించకుండా.. కేవలం కొన్ని మండలాలకే పరిమితం చేస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధనల మేరకు కిందటేడాది ఎక్కడైతే తుపాను, కరవు సంభవించినట్లు ప్రభుత్వం గుర్తించిందో.. అక్కడి రైతులకే రుణాల రీషెడ్యూల్ చేస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఆమేరకు జిల్లాలో 45 తుపాను ప్రభావిత మండలాలు, నాలుగు కరువుపీడిత మండలాలంటూ ఈఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. గడువు మీరిన బకాయిలన్నీ రైతులపేరు మీదనే ఉండి.. రుణం తీసుకున్న నాటినుంచి ఇవ్పటి వరకు వడ్డీ 11.75 శాతంను అసలు మొత్తంతో కలిపి లెక్కించి బకాయిగా రికార్డులో నమోదు చేయనున్నారు.
కొత్తగా ప్రస్తుతం రుణాలిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే, జిల్లాలోని 5 లక్షల మంది రైతుల్లో 49 మండలాల రైతులకే రీషెడ్యూల్ వర్తిస్తే.. మిగతా వారి రుణాల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా. పైగా, బ్యాంకరు రైతు వద్దనున్న అన్ని ఆధార ధ్రువీకరణలు, పొలం పుస్తకాలు చూసిన తర్వాతనే రుణాలిస్తారని... ఆధార్‌కార్డు వంటి షరతులు పెట్టి ప్రభుత్వం రైతులను అనుమానించే ప్రయత్నం చేస్తోందని రైతుసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రీషెడ్యూల్ వర్తించే మండలాలివే..
ప్రభుత్వం తుపాను, కరవు మండలాల రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ కుదురుతోందని ప్రకటించనుంది. ఈమేరకు జిల్లాలో 45 మండలాలు తుపాను ప్రభావితం కాగా.. ఒంగోలు డివిజన్ పరిధిలో అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జే.పంగులూరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మద్దిపాడు, మార్టూరు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పర్చూరు.
సంతమాగులూరు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలున్నాయి. కందుకూరు డివిజన్‌లో దర్శి, దొనకొండ, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, కందుకూరు, కొండపి, కురిచేడు, మర్రిపూడి, ముండ్లమూరు, పొదిలి, సింగరాయకొండ, తాళ్లూరు, తర్లుపాడు మండలాలున్నాయి. మార్కాపురం డివిజన్‌లో అర్థవీడు, బేస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం మండలాల రైతులకే రీ షెడ్యూల్ వర్తించనుంది.
రుణమాఫీ అమలుపై తాజా ప్రతిపాదన
Published Sun, Jul 13 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement