రైతు మెడపై కత్తి | no clarity on debt waiver, matching grant | Sakshi
Sakshi News home page

రైతు మెడపై కత్తి

Published Tue, Jul 29 2014 1:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

no clarity on debt waiver,  matching grant

సాక్షి, ఒంగోలు: రైతుకు కష్టకాలమొచ్చింది. రుణమో.. ‘చంద్రా’..! అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి అర్థిస్తున్నాడు. రుణవిముక్తి కల్పిస్తానని నమ్మబలికిన చంద్రబాబు..ఇప్పుడు మాటతప్పేలా వ్యవహరించడంపై జిల్లావ్యాప్తంగా అన్నదాతలు కసితో రగిలిపోతున్నారు. రైతుల ఆత్మాభిమానంతో ప్రభుత్వం ఆటలాడుతోందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులకు లక్షన్నర, డ్వాక్రాసంఘాలకు లక్ష చొప్పున అందజేస్తానన్న మ్యాచింగ్ గ్రాంట్ అందే అవకాశాలున్నాయా..? లేదా..? అనే ఆందోళనలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

 ఇప్పుడి ప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు అసలు నైజం బోధపడుతోందని.. అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పినట్లు రైతులు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలు.. వాటి అమలు తాత్సారంపై ‘నరకాసుర వధ’ పేరిట రైతులు అన్నిచోట్లా రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల్ని సైతం తగులబెట్టి తమ నిరసన  తెలుపుతున్నారు. మరోవైపు డ్వాక్రా సంఘాలదీ అదే పరిస్థితి. ఠంచన్‌గా బ్యాంకుల్లో రుణ వాయిదాలు చెల్లించే సంఘాలను సైతం టీడీపీ అధినేతలు ఇప్పటికే అడ్డుకున్నారు. పూర్తి రుణాల మాఫీ జరుగుతోందని ఆశపెట్టారు. నేడు, సంఘానికి రూ.లక్ష కేటాయింపు అంటూ ప్రకటించినా.. సంఘ సభ్యుల అప్పులకు వడ్డీలు కట్టే నాథుడే కరువయ్యాడు.

 నోటీసులతో బెదిరింపులు..
 రుణాల మాఫీపై విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం..బ్యాంకులకు మాత్రం మార్గదర్శకాలు పంపలేదు. దీంతో ఇదే అదునుగా పేరుకుపోయిన బకాయిల రికవరీ పేరుతో బ్యాంకర్లు నడుంబిగిస్తున్నారు. డ్వాక్రాసంఘాల వడ్డీ సొమ్మును పొదుపు ఖాతాల నుంచి మినహాయించుకుంటున్నారు. మరోవైపు రైతుల ఆస్తుల జప్తు, వేలానికి సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు.

నెలాఖరులోగా బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సిందేనంటూ రైతుల మెడపై కత్తిపెడుతున్నారు. మూడ్రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లిస్తే.. కొత్తరుణాలు అందిస్తామంటున్నారు. బకాయిలు చెల్లించినంత మాత్రాన రుణమాఫీ వర్తించక పోదంటూ నమ్మబలుకుతున్నారు. గడువులోగా చెల్లించకుంటే ప్రభుత్వమిచ్చే మ్యాచింగ్‌గ్రాంట్‌ను వడ్డీకిందనే జమచేసుకోవాల్సి వస్తుందని బ్యాంకర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.

 వడ్డీరాయితీకి తిప్పలు
 జిల్లాలో ఐదు లక్షల మంది రైతులు జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకున్నారు. కిందటేడాది జిల్లాలోని రైతులకు రూ.5,800 కోట్లు పంటరుణాల్ని పంపిణీ చేస్తే.. ఈఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇంత వరకు ఒక్కరూపాయి అందివ్వలేదు. బ్యాంకుల్లో మొత్తం రూ.6,900 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి.

 వర్షాభావం, రుణమాఫీ సందిగ్థంతో కొత్త అప్పులు పుట్టక, రైతులు పంటల సాగుకు స్వస్తి చెబుతున్నారు. కొత్తరుణాల మంజూరు లేక సంఘాల అంతర్గత కార్యకలాపాలు నిలిచిపోవడంతో డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే వడ్డీరాయితీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు, మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రూ.6 నుంచి రూ.10 వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు.

 ప్రభుత్వ ప్రకటనలపై అయోమయం:
 రైతులకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష చొప్పున మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో బ్యాంకర్లకు మార్గదర్శకాలు అందలేదు. రైతు కుటుంబం యూనిట్‌గా రూ.లక్షన్నర మొత్తాన్ని నేరుగా బ్యాంకులకు చెల్లించి..ఆమేరకు తమ రుణాలను మాఫీ చేస్తారా..? లేదంటే, రీషెడ్యూల్‌తో ఆ భారం ప్రభుత్వం మోస్తుందా..? తమపై వేస్తుందా..? అనే సవాలక్ష ప్రశ్నలతో రైతులు అయోమయంలో పడుతున్నారు. రైతు రుణాలకు సంబంధించి పంట రుణాలకా..? బంగారంపై రుణాలకు ప్రాధాన్యమిస్తారా..? అనేది తేలాల్సిఉంది.

 డ్వాక్రాసంఘాలకు గరిష్టంగా ఇస్తామన్న రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పుడు, ఎలా, ఎన్ని విడతల్లో ఇస్తారనేది స్పష్టత లేదు. రీషెడ్యూల్ చేస్తే పేరుకుపోయిన బకాయిలపై 12.5 శాతం వరకు వడ్డీపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఏటా జూలైలో రిజర్వు బ్యాంకు రీషెడ్యూల్ అమలుపై మార్గదర్శకాలిస్తుందని.. అవి రుణమాఫీకి వర్తించవని బ్యాంకర్లు చెబుతున్నారు. తాజాగా ఆర్‌బీఐ కొర్రీలతో ప్రభుత్వానికి పంపిన లేఖ సారాంశం ప్రకారం రీషెడ్యూల్ అమలు కల్లేనని రైతులు, డ్వాక్రాసంఘాలు ఆందోళన పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement