Matching Grant
-
ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని ఆర్థిక శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది చేపట్టే పనులు, కార్యక్రమాల కోసం పైసలకు తడుముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దాదాపు 14వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. అలాగే మార్చి చివరి రోజుల్లో వచ్చిన రూ. 8 వేల కోట్ల బిల్లులనూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. హడావిడిగా మార్చి 18, 19, 20వ తేదీల్లో బిల్లులను సమర్పించడం అంటే వాస్తవంగా పనులు జరిగాయా లేదా అనే విషయం తెలియదు. ఈ బిల్లులను స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రూ. 8 వేల కోట్ల బిల్లులను తిరస్కరిస్తూ మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా బిల్లులు సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ సంబంధిత శాఖలకు సూచించింది. ఇవన్నీ కూడా వివిధ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులతో పాటు వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న నిధులకు సంబంధించిన బిల్లులని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అలాగే వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్లులు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలలకే ఓటాన్ అకౌంట్ కేటాయింపులకు అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి ఆయా శాఖలకు నాలుగు నెలలకు కేటాయించిన నిధులు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది పలు పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ. 4 వేల కోట్ల వరకు ఇతర అవసరాలకు మళ్లించేశారని, ఇప్పుడు ఆ నిధులనూ ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చంద్రబాబు అతి తెలివితేటలకు, రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ఖజానాను అస్థవ్యస్తం చేసేశారనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విభాగాల్లో అదే తీరు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన బిల్లులు రాకపోవడంతో అనేకమంది ఇప్పుడు సచివాలయంలోని ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘వివిధ రంగాల కార్పొరేషన్లకు చెందిన నిధులను లాగేసుకోవడంతో ఆయా కార్పొరేషన్ల వ్యక్తిగత ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఆఖరికి గ్రామీణాభివృద్ధి సెస్‌ను కూడా దారి మళ్లించేశారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల మేరకు కాకుండా ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యం మేరకు నిధులు ఇవ్వడంతో ఆ బడ్జెట్‌కు విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ ఆర్థిక ఏడాది కేటాయింపులు గతేడాది బిల్లుల చెల్లింపులకే సరిపోతాయి. ప్రస్తుతం వివిధ శాఖల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్త ప్రభుత్వానికి చాలా సమయం.. ‘గతేడాది పేదల గృహ నిర్మాణాలకు బిల్లులను చెల్లించలేదు. విద్యుత్ సబ్సిడీ కూడా చెల్లించకుండా ట్రాన్స్‌కో ద్వారా బయట అప్పులు చేయించారు. రేషన్ బియ్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులనూ ఇవ్వకుండా పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలుకు చేస్తున్న అప్పుల నుంచి సబ్సిడీ భరించాల్సిందిగా సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తలకిందులైపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి పరిస్థితిని చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుంది’ అని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లారంటే పరిస్థితిని చంద్రబాబు సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 5న రూ. 92.08 కోట్లు, 6న రూ. 2,513.77 కోట్లు, 9న రూ. 650.61 కోట్ల మేర ఓడర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం గమనార్హం. -
రైతు మెడపై కత్తి
సాక్షి, ఒంగోలు: రైతుకు కష్టకాలమొచ్చింది. రుణమో.. ‘చంద్రా’..! అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి అర్థిస్తున్నాడు. రుణవిముక్తి కల్పిస్తానని నమ్మబలికిన చంద్రబాబు..ఇప్పుడు మాటతప్పేలా వ్యవహరించడంపై జిల్లావ్యాప్తంగా అన్నదాతలు కసితో రగిలిపోతున్నారు. రైతుల ఆత్మాభిమానంతో ప్రభుత్వం ఆటలాడుతోందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులకు లక్షన్నర, డ్వాక్రాసంఘాలకు లక్ష చొప్పున అందజేస్తానన్న మ్యాచింగ్ గ్రాంట్ అందే అవకాశాలున్నాయా..? లేదా..? అనే ఆందోళనలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడి ప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు అసలు నైజం బోధపడుతోందని.. అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పినట్లు రైతులు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలు.. వాటి అమలు తాత్సారంపై ‘నరకాసుర వధ’ పేరిట రైతులు అన్నిచోట్లా రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల్ని సైతం తగులబెట్టి తమ నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డ్వాక్రా సంఘాలదీ అదే పరిస్థితి. ఠంచన్‌గా బ్యాంకుల్లో రుణ వాయిదాలు చెల్లించే సంఘాలను సైతం టీడీపీ అధినేతలు ఇప్పటికే అడ్డుకున్నారు. పూర్తి రుణాల మాఫీ జరుగుతోందని ఆశపెట్టారు. నేడు, సంఘానికి రూ.లక్ష కేటాయింపు అంటూ ప్రకటించినా.. సంఘ సభ్యుల అప్పులకు వడ్డీలు కట్టే నాథుడే కరువయ్యాడు. నోటీసులతో బెదిరింపులు.. రుణాల మాఫీపై విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం..బ్యాంకులకు మాత్రం మార్గదర్శకాలు పంపలేదు. దీంతో ఇదే అదునుగా పేరుకుపోయిన బకాయిల రికవరీ పేరుతో బ్యాంకర్లు నడుంబిగిస్తున్నారు. డ్వాక్రాసంఘాల వడ్డీ సొమ్మును పొదుపు ఖాతాల నుంచి మినహాయించుకుంటున్నారు. మరోవైపు రైతుల ఆస్తుల జప్తు, వేలానికి సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నారు. నెలాఖరులోగా బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సిందేనంటూ రైతుల మెడపై కత్తిపెడుతున్నారు. మూడ్రోజుల్లోగా బకాయిలన్నీ చెల్లిస్తే.. కొత్తరుణాలు అందిస్తామంటున్నారు. బకాయిలు చెల్లించినంత మాత్రాన రుణమాఫీ వర్తించక పోదంటూ నమ్మబలుకుతున్నారు. గడువులోగా చెల్లించకుంటే ప్రభుత్వమిచ్చే మ్యాచింగ్‌గ్రాంట్‌ను వడ్డీకిందనే జమచేసుకోవాల్సి వస్తుందని బ్యాంకర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. వడ్డీరాయితీకి తిప్పలు జిల్లాలో ఐదు లక్షల మంది రైతులు జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకున్నారు. కిందటేడాది జిల్లాలోని రైతులకు రూ.5,800 కోట్లు పంటరుణాల్ని పంపిణీ చేస్తే.. ఈఏడాది రూ.4,100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇంత వరకు ఒక్కరూపాయి అందివ్వలేదు. బ్యాంకుల్లో మొత్తం రూ.6,900 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి. వర్షాభావం, రుణమాఫీ సందిగ్థంతో కొత్త అప్పులు పుట్టక, రైతులు పంటల సాగుకు స్వస్తి చెబుతున్నారు. కొత్తరుణాల మంజూరు లేక సంఘాల అంతర్గత కార్యకలాపాలు నిలిచిపోవడంతో డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే వడ్డీరాయితీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు, మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రూ.6 నుంచి రూ.10 వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ప్రకటనలపై అయోమయం: రైతులకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష చొప్పున మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో బ్యాంకర్లకు మార్గదర్శకాలు అందలేదు. రైతు కుటుంబం యూనిట్‌గా రూ.లక్షన్నర మొత్తాన్ని నేరుగా బ్యాంకులకు చెల్లించి..ఆమేరకు తమ రుణాలను మాఫీ చేస్తారా..? లేదంటే, రీషెడ్యూల్‌తో ఆ భారం ప్రభుత్వం మోస్తుందా..? తమపై వేస్తుందా..? అనే సవాలక్ష ప్రశ్నలతో రైతులు అయోమయంలో పడుతున్నారు. రైతు రుణాలకు సంబంధించి పంట రుణాలకా..? బంగారంపై రుణాలకు ప్రాధాన్యమిస్తారా..? అనేది తేలాల్సిఉంది. డ్వాక్రాసంఘాలకు గరిష్టంగా ఇస్తామన్న రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పుడు, ఎలా, ఎన్ని విడతల్లో ఇస్తారనేది స్పష్టత లేదు. రీషెడ్యూల్ చేస్తే పేరుకుపోయిన బకాయిలపై 12.5 శాతం వరకు వడ్డీపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఏటా జూలైలో రిజర్వు బ్యాంకు రీషెడ్యూల్ అమలుపై మార్గదర్శకాలిస్తుందని.. అవి రుణమాఫీకి వర్తించవని బ్యాంకర్లు చెబుతున్నారు. తాజాగా ఆర్బీఐ కొర్రీలతో ప్రభుత్వానికి పంపిన లేఖ సారాంశం ప్రకారం రీషెడ్యూల్ అమలు కల్లేనని రైతులు, డ్వాక్రాసంఘాలు ఆందోళన పడుతున్నాయి. -
జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : రూ.20లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ సాధనలో భాగంగా టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ ఉపాధ్యక్షుడు బంటు సారయ్య మాట్లాడుతూ గని ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికులకు రూ.20లక్షలు, విధుల్లో ఉండి ఏ కారణంతోనైనా సహజ మరణం చెందితే రూ.15లక్షల గ్రాంటు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోలిండియాలో ఎక్స్‌గ్రేషియా సాధించాల్సిన బాధ్యత జాతీయ సంఘాలపై ఉందని, అక్కడ పోరాడకుండా సింగరేణిలో లేని ఎక్స్‌గ్రేషియాను ఇప్పించాలని తమపై ఒత్తిడి తేవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ఆయా సంఘాలు తమ వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఏజీఎం మహమ్మద్ అబ్బాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతిరాజు, కె.సురేందర్ రెడ్డి, నాయకులు శేషగిరిరావు, చిలువేరు సదానందం, బుస్స రమేశ్, ముస్కె సమ్మయ్య, ఫిట్ సెక్రెటరీలు రాళ్లబండి రాజన్న, తిరుపతిరావు, కంది సమ్మిరెడ్డి, కొలిపాక సమ్మయ్య, రవీందర్‌రెడ్డి, నీలం సదయ్య, తాటి బాపు పాల్గొన్నారు.