ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు | Andhra Pradesh Financial Status | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు

Published Tue, Apr 23 2019 11:00 AM | Last Updated on Tue, Apr 23 2019 11:00 AM

Andhra Pradesh Financial Status - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని ఆర్థిక శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది చేపట్టే పనులు, కార్యక్రమాల కోసం పైసలకు తడుముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దాదాపు 14వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. అలాగే మార్చి చివరి రోజుల్లో వచ్చిన రూ. 8 వేల కోట్ల బిల్లులనూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. హడావిడిగా మార్చి 18, 19, 20వ తేదీల్లో బిల్లులను సమర్పించడం అంటే వాస్తవంగా పనులు జరిగాయా లేదా అనే విషయం తెలియదు. ఈ బిల్లులను స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రూ. 8 వేల కోట్ల బిల్లులను తిరస్కరిస్తూ మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా బిల్లులు సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ సంబంధిత శాఖలకు సూచించింది.

ఇవన్నీ కూడా వివిధ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులకు మ్యాచింగ్‌ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులతో పాటు వివిధ కార్పొరేషన్‌ల నుంచి తీసుకున్న నిధులకు సంబంధించిన బిల్లులని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అలాగే వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్లులు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలలకే ఓటాన్‌ అకౌంట్‌ కేటాయింపులకు అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి ఆయా శాఖలకు నాలుగు నెలలకు కేటాయించిన నిధులు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది పలు పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ. 4 వేల కోట్ల వరకు ఇతర అవసరాలకు మళ్లించేశారని, ఇప్పుడు ఆ నిధులనూ ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చంద్రబాబు అతి తెలివితేటలకు, రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ఖజానాను అస్థవ్యస్తం చేసేశారనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.

అన్ని విభాగాల్లో అదే తీరు..
గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన బిల్లులు రాకపోవడంతో అనేకమంది ఇప్పుడు సచివాలయంలోని ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘వివిధ రంగాల కార్పొరేషన్లకు చెందిన నిధులను లాగేసుకోవడంతో ఆయా కార్పొరేషన్ల వ్యక్తిగత ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఆఖరికి గ్రామీణాభివృద్ధి సెస్‌ను కూడా దారి మళ్లించేశారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపుల మేరకు కాకుండా ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యం మేరకు నిధులు ఇవ్వడంతో ఆ బడ్జెట్‌కు విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ ఆర్థిక ఏడాది కేటాయింపులు గతేడాది బిల్లుల చెల్లింపులకే సరిపోతాయి. ప్రస్తుతం వివిధ శాఖల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్త ప్రభుత్వానికి చాలా సమయం..
‘గతేడాది పేదల గృహ నిర్మాణాలకు బిల్లులను చెల్లించలేదు. విద్యుత్‌ సబ్సిడీ కూడా చెల్లించకుండా ట్రాన్స్‌కో ద్వారా బయట అప్పులు చేయించారు. రేషన్‌ బియ్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులనూ ఇవ్వకుండా పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలుకు చేస్తున్న అప్పుల నుంచి సబ్సిడీ భరించాల్సిందిగా సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ తలకిందులైపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి పరిస్థితిని చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుంది’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అంటున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లారంటే పరిస్థితిని చంద్రబాబు సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 5న రూ. 92.08 కోట్లు, 6న రూ. 2,513.77 కోట్లు, 9న రూ. 650.61 కోట్ల మేర ఓడర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement